'ఒంటెద్దు పోకడలకు పోతున్న కేసీఆర్'
కరీంనగర్: సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రాన్ని పాలిస్తూ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో బండ రాజిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఉంటే కేసీఆర్ మాత్రం పార్టీ ప్లీనరీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దళితులకు మూడెకరాలు, డబుల్‌బెడ్‌రూం పథకం మాటలకే పరిమితమయ్యాయని చాడ వెంకటరెడ్డి అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని.... ఉద్యమంలో సహకరించిన వారిని అణుగదొక్కుతూ ఉద్యమ వ్యతిరేకులకు పెద్దపీట వేయడం సిగ్గుచేటన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవినీతి, మతోన్మాదాన్ని పెంచిపోషిస్తుందని ఆరోపించారు. జేఎన్‌యూ నేత కన్నయ్యకుమార్‌పై దాడి దీని కిందకే వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలకు కార్యకర్తలు సిద్ధంకావాలని కోరారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.