వారిని అరెస్ట్ చేయవద్దు
Published Sat, Dec 3 2016 12:16 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసీ) సిబ్బందితో లాలూచీపడి నిత్యావసర సరకుల పంపిణీలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కేసులు ఎదుర్కొంటున్న కర్నూలు జిల్లాకు చెందిన చౌకధర దుకాణదారులు పెద్ద సంఖ్యలో హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలంటూ 140 మందికి పైగా చౌకధర దుకాణదారులు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, లైసెన్సుల రద్దుపై వారు దాఖలు చేసిన వ్యాజ్యాలపై నిర్ణయం వెలువడేంత వరకు వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. అయితే ప్రతీ రోజూ పోలీసుల ముందు హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్‌ఐసీ సిబ్బంది సాయంతో నిత్యవసర సరుకులను ఇవ్వకుండా, ఇచ్చినట్లు చూపి ప్రజలను మోసం చేశారంటూ కర్నూలు జిల్లాలో 149 మంది చౌకధర దుకాణదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో వారు తమపై కేసులను కొట్టేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే పోలీసులు మూకుమ్మడిగా కేసులు నమోదు చేశారని వారు కోర్టుకు నివేదించారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. భారీస్థాయిలో మోసానికి పాల్పడ్డారని, కంప్యూటర్‌లలో తప్పుడు వివరాలు నమోదు చేసి ప్రజలకు ఇవ్వాల్సిన సరుకులను దారి మళ్లించారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, లైసెన్సుల రద్దుపై పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై నిర్ణయం వెలువడేంత వరకు వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ, తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు.
Advertisement