అవనిగడ్డ ఉప ఎన్నికకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు | Effective arrangements for the election of the Vice AVANIGADDA | Sakshi
Sakshi News home page

అవనిగడ్డ ఉప ఎన్నికకు కట్టుదిట్టంగా ఏర్పాట్లు

Published Mon, Aug 5 2013 2:04 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

Effective arrangements for the election of the Vice AVANIGADDA

 విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ :  ఈ నెల 21న జరగనున్న అవనిగడ్డ ఉప ఎన్నికలో ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ఎస్.హెచ్.అనీల్ పంత్ అధికారులను ఆదేశించారు. స్థానిక స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆదివారం ఆయన రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల నియమావళిని అమలు చేయాలన్నారు. ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మద్యం షాపులు మూసివేయటంతో పాటు, నిఘా ఏర్పాటు చేయాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు.

 ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి..

 జిల్లా కలెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి మాట్లాడుతూ అవనిగడ్డ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం సూచనల మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోటీచేసే అభ్యర్థులు నియమావళిని కచ్చితంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. పోలింగ్ నిర్వహణకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశామని చెప్పారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలలో వెబ్ క్యాస్టింగ్, మైక్రో పరిశీలన, వీడియో చిత్రీకరణ ఏర్పాట్లు చేశామన్నారు. మచిలీపట్నం, అవనిగడ్డలలో రెండు కంట్రోల్‌రూంలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

మచిలీపట్నం ఆర్డీఓ సాయిబాబా మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 91 గ్రామాలు ఉన్నాయని చెప్పారు. ఎన్నికలను పురస్కరించుకుని 236 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పి.ఉషాకుమారి, జిల్లా రెవెన్యూ అధికారి ఎల్.విజయచందర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ప్రదీప్‌రావు, శ్రీలత తదితర అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement