మనోడు మహాముదురే...
నెల్లూరు (క్రైమ్): మేము దావూద్ ఇబ్రహీం (డి-గ్యాంగ్) అనుచరులం.. రూ.100 కోట్లు ఇవ్వాలి.. లేదంటే చంపుతాం.. అంటూ బీసీసీ సభ్యుడు రాజీవ్‌శుక్లాను బెదిరించిన నెల్లూరుకు చెందిన ఫత్తే అహ్మద్ పెద్ద ముదురని నిఘావర్గాల విచారణలో తేలింది. ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌చేసిన ఫత్తే అహ్మద్ కంప్యూటర్‌ను వినియోగించుకుని ఏమైనా చేయగల దిట్ట.
ఎంబీఏ పూర్తిచేసిన ఫత్తే 2013లో దేశంలోని ఓ ప్రముఖ ఫైనాన్స్ గ్రూప్ ఫ్రాంచైజీగా రామలింగాపురంలో రైట్‌వే క్యాపిటల్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటె డ్ పేరిట కార్యాలయం తెరిచాడు. రూ.లక్ష ఇస్తే రూ.10 లక్షలు ఫైనాన్స్ ఇస్తామని ప్రకటనలు గుప్పించాడు. ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని జిల్లాలో 300 మంది సభ్యులను చేర్పించుకున్నా డు. ఫ్రాంచైజర్ అని నమ్మించేందుకు ఒడి శా, అస్సాం తదితర ప్రాంతాలకు చెందిన వ్యక్తులను కార్యాలయం లో ఉద్యోగులుగా నియమించుకున్నాడు.
ముంబై, ఢిల్లీల్లో ఇద్దరు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ఫైనాన్స్ కోసం వచ్చే వారి సర్టిఫికెట్లను అప్రూవల్ కోసం వారికి పంపేవాడు. వారు కొన్నింటిని అప్రూవల్ చేసి మరికొన్నింటిని వివిధ కారణాలతో రిజెక్ట్ చేసేవారు. ఇలా అందరి వద్ద నమ్మకం పెంచుకుని పెద్దమొత్తంలో నగదు కట్టించుకున్నాడు. ఈ నేపథ్యంలో నగరంలోని ఓ కళ్యాణమండపం యజ మాని తనకు రూ.50 లక్షలు ఫైనాన్స్ కావాలని ఫత్తేను సంప్రదించాడు.
అతడి అవసరాన్ని పసిగట్టిన ఫత్తే రూ.5 లక్షలు డిపాజిట్ చేస్తే రూ.50 లక్షలు ఇస్తామని చెప్పడంతో అతను అడిగిన మొత్తాన్ని జమచేశారు. నెలలు గడుస్తున్నా ఫైనాన్స్ ఇవ్వకపోవడంతో బాధితుడు కంపెనీ వ్యవహారంపై అనుమానం వచ్చి ఆరాతీయగా అంతా మోసమని తేలింది. ఈ విషయాన్ని గమనించిన ఫత్తే అప్పటి అధికారపార్టీ నేత అండతో విషయం పెద్దది కాకుండా చూసుకున్నాడు. అనంతరం బోర్డు తిప్పేశాడు. ఈక్రమంలోనే అతడికి షఫీవుల్లాతో పరిచయం ఏర్పడినట్లు తెలిసింది.
అంతేకాకుండా ఫత్తే క్రికెట్ బెట్టింగ్‌లు, రేసింగ్‌లు, పలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడేవాడన్న ఆరోపణలున్నాయి. జిల్లాలోని ఓ మైనార్టీ పెద్దతో ఫత్తేకు దగ్గర సంబంధాలున్నాయి. సినిమా హీరోలు, మ్యూజిక్ డెరైక్టర్లతో పాటు ఢిల్లీ, ముంబై, కోలకత్తాలోని బడా వ్యక్తులతో పరిచయాలున్న ఆ మైనార్టీ పెద్ద ద్వారా పెద్ద లాబీ నడిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.