వరద బాధితులను ఆదుకోవాలి
వరద బాధితులను ఆదుకోవాలి
Published Sat, Sep 24 2016 6:18 PM | Last Updated on Sat, Apr 6 2019 8:52 PM
వైఎస్సార్ సీపీ నేతలు ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి,
ఎమ్మెల్యే గోపిరెడ్డి, రాజశేఖర్, అప్పిరెడ్డి డిమాండ్
పట్నంబజారు: వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో శుక్రవారం ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి, పార్టీనేత కిలారి రోశయ్య భేటీ అయ్యారు. జిల్లాలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైందని, ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. చిలకలూరిపేట సమీపంలో సుమారు పది గంటలపాటు ఒక వ్యక్తి చెట్టును పట్టుకుని వేలాడుతున్నా సహాయక చర్యలు అందించడంలో అధికార యంత్రాంగం పూర్తి వైఫల్యం చెందిందని విమర్శించారు. రోడ్లు కోతకు గురై ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. వేలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి నష్టపరిహారమిచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా వరదలు సంభవించిన చోట వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, అన్ని విభాగాల నాయకులు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. రాజకీయాలకతీతంగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నేతలు కొత్తా చినప్పరెడ్డి, మేరువ నర్సిరెడ్డి, జగన్‌కోటి తదితరులు పాల్గొన్నారు.
Advertisement