ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్
Published Wed, Jul 27 2016 11:52 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
జ్యోతినగర్ : ఎన్టీపీసీ గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయినట్లు తెలిసింది. ప్రస్తుత గుర్తింపు యూనియన్ కాలపరిమితి గత సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసింది. అయినా గుర్తింపు ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది. ఎన్నికల నిర్వహణకు ఆలస్యం కావడంతో వివిధ యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో కేంద్ర కార్మిక శాఖ డెప్యూటీ చీఫ్ లేబర్‡ కమిషనర్ ఎన్నికల విషయంలో స్థానిక యాజమాన్యానికి లేఖ రాశారు. అన్ని యూనియన్లు, యాజమాన్య ప్రతినిధులతో ఎన్నికల తేదీ ఖరారుపై సమావేశం కూడా నిర్వహించారు.
రామగుండం ఎన్టీపీసీ సంస్థ విస్తరణ నేపథ్యంలో వీఐపీల తాకిడి ఉంటుందని కొంత వ్యవధి కావాలని యాజమాన్యం కార్మిక శాఖ అధికారిని కోరింది. ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఎన్నికల సరళిని మార్పు చేసేందుకు కార్పొరేట్ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. దేశంలోని అన్ని ఎన్టీపీసీ సంస్థలలో ఒకేసారి గుర్తింపు సంఘాల ఎన్నికలు ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. మెజారిటీ సాధించిన యూనియన్‌తోపాటు రెండో స్థానంలో ఉన్న యూనియన్‌కు ప్రాతినిధ్యం కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన అపెక్స్ సమావేశంలో కొన్ని జాతీయ కార్మిక సంఘాల నాయకులు దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఈమేరకు జూన్–19న ఎన్బీసీ సమావేశంలో యూనియన్ ఎన్నికలపై అన్ని జాతీయ సంఘాలు ఏకాభిప్రాయానికి వచ్చి సంతకాలు చేశారు. దీంతో రామగుండం ఎన్టీపీసీ సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ చేస్తూ కార్పొరేట్ సెంటర్ న్యూఢిల్లీ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
Advertisement