మైకాకు జీఎస్టీ షాక్
► 14.5 నుంచి 28 శాతం పన్ను బాదుడు
► పౌడర్ ఫ్యాక్టరీలపైనా ప్రభావం
► జీఎస్టీ తగ్గించకపోతే ఫ్యాక్టరీలు మూతపడే అవకాశం
సైదాపురం(వెంకటగిరి): కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న జీఎస్టీ మైకా, క్వార్ట్జ్, పౌడర్ ఫ్యాక్టరీలపై తీవ్ర ప్రభావం చూపనుంది. నాలుగు శ్లాబుల్లో అత్యధికంగా ఉన్న 28 శాతం జీఎస్టీ పౌడర్ ఫ్యాక్టరీలపై పడనుంది. ఇప్పటివరకు వ్యాట్ రూపంలో 14.5 శాతం పన్నులు మాత్రమే ఫ్యాక్టరీలపై పడేది. అందులో కూడా ఇన్‌పుట్ సబ్సిడీ 12 శాతం ఫ్యాక్టరీ యాజమానులకు తిరిగొచ్చేది. తాజాగా జీఎస్టీ ప్రభావంతో మెటీరియల్ కొనుగొలు చేసేవారు పన్నులను భరించాల్సి ఉంటుంది. ఒక్కసారిగా 28శాతం పన్నుల రూపంలో పెరిగితే మెటిరియల్ కొనే నాథుడే ఉండరని ఫ్యాక్టరీ యాజమానులు వాపోతున్నారు.
అదనపు భారం భరించాల్సిందే
జిల్లాలో మైకా పరిశ్రమకు ఎంతో పేరుంది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే మైకా పరిశ్రమలు ప్రధానంగా జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉన్నాయి. మైకా, క్వార్ట్జ్, తదితర ఖనిజాలను పౌడర్ చేసే ప్రత్యామ్నాయ పరిశ్రమలు ఇటీవలి కాలంలో సైదాపురం మండలంలో విస్తారంగా ఏర్పాటుచేశారు. వీటి ద్వారా ప్రత్యక్షంగా రెండువేల మందికి, పరోక్షంగా రెండువేల మందికి ఉపాధి దొరుకుతోంది. కరెంట్ బిల్లుల నుంచి కూలీల వరకు రోజురోజుకు పెరిగి పోతుండటంతో కొందరు యాజమానులు ఫ్యాక్టరీలను లీజులకు ఇచ్చేస్తున్నారు. ఈతరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈపరిశ్రమకు మరోషాక్ ఇచ్చింది. గతంలో 14.5 శాతం ఉన్న పన్నులను ఒక్కసారిగా 28శాతం చేయడంతో దీని ప్రభావం ఫ్యాక్టరీలపై పడనుంది. బ్యాంకుల్లో లక్షల రూపాయలు అప్పు చేసి స్థాపించిన ఫ్యాక్టరీలు అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. జీఎస్టీ ప్రభావంతో తమకు ఉపాధి ఎక్కడ పోతుందోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ పనిచేసేవారిలో ఎక్కువగా జార్ఖండ్, బిహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందినవారే.
ఎక్స్‌పోర్టర్స్ కూడా పన్ను చెల్లించాల్సిందే..
గతంలో ఉన్న ప్రభుత్వాలు విదేశీ మారక ద్రవ్యాన్ని రాబట్టుకునేందుకు ఎక్స్‌పోర్ట్ చేసే వారిని పన్నుల నుంచి మినహాయింపులు ఇచ్చేవి. అయితే జీఎస్టీ కారణంగా వారు కూడా పన్నుల లెక్కల్లోకి వచ్చారు. వారు ఎంత ఎగుమతులు చేశారు? అనే వివరాలు కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాతే పన్ను నుంచి వెసులుబాటు వచ్చేలా నిబంధనలు విధించారు.
13శాతం అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టి జీఎస్టీ కారణంగా పరిశ్రమలపై 13.5 శాతం అదనపు భారం పడుతుంది. దీంతో తీరని నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం స్పందించి జీఎస్టీలో మార్పులు తీసుకుని వస్తేనే ఫ్యాక్టరీలు నిలిచే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో భారీ నష్టలు తప్పవు. – సీలార్, పౌడర్ ఫ్యాక్టరీ మేనేజర్