పొదుపు రుణాల్లో గోలమాల్‌పై విచారణ
పొదుపు రుణాల్లో గోలమాల్‌పై విచారణ
Published Thu, Jul 6 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
అధికారులను నిలదీసిన మహిళలు
ఆదోని : బ్యాంకు అకౌంట్ పుస్తకాలలో గ్రూపు లీడర్ల ఫొటోలు మార్చి సమాఖ్య రీసోర్స్‌పర్సన్ (ఆర్పీ) ఝాన్సీ రూ.లక్షలు డ్రా చేసుకుని స్వాహా చేసిందనే ఆరోపణలపై గురువారం ఆంధ్ర బ్యాంకు మేనేజరు కోటేశ్వరరావు, పట్టణ మెప్మా అధికారి శేఖన్న మండగిరి వార్డులోని ఆర్పీ ఇంటి వద్ద విచారణ చేపట్టారు. పట్టణంలోని ప్రతిభా మహిళా సమాఖ్య పరిధిలోని పల్లవి, కప్పన, ఇందిర, శాంతి పొదుపు గ్రూపులకు సంబంధించి రుణాల మొత్తాల్లో గోల్‌మాల్ జరిగింది. ఈసందర్భంగా బ్యాంకు మేనేజరు గ్రూపు లీడర్లు, సభ్యుల స్టేట్‌మెంట్లను రికార్డు చేశారు. ఆర్పీ వద్ద ఉన్న రికార్డులను స్వాధీనం చేసుకున్నారు.
మెప్మా అధికారితో మహిళల వాగ్వాదం
తమకు తెలియకుండా రుణం ఎలా మంజూరు చేశారని బాధితులు బ్యాంకు మేనేజర్, మెప్మా అధికారిని నిలదీశారు. అకౌంట్ పుస్తకాలలో తమ ఫొటోలు, సంతకాలు ఉంటాయని, నిర్ధరించుకోకుండా ఆర్పీకి రూ.లక్షలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అయితే రికార్డుల పరిశీలన, బ్యాంకుల్లో సీసీ పుటేజీలు చూసిన తర్వాతే డబ్బు ఎవరు డ్రా చేశారో తెలుస్తుందని, విచారణకు సహకరించాలని బ్యాకు మేనేజర్, మెప్మా అధికారి బాధితులను కోరారు. అక్రమంగా డబ్బు డ్రా చేసినట్లు తెలిస్తే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు స్వాహా మొత్తాన్ని రికవరీ చేస్తామని హామీ ఇచ్చారు.
రూ.2 లక్షలు వాడుకున్నా..
ఇదిలా ఉండగా ఒక గ్రూపునకు మంజూరైన రుణం రూ.2 లక్షలు మాత్రమే తాను వాడుకున్నట్లు ఆర్పీ ఝాన్సీ తనను ప్రశ్నించిన మీడియాకు చెప్పారు. మిగిలిన మూడు గ్రూపులకు మంజూరైన మొత్తాన్ని సంబంధిత గ్రూపు లీడర్లే డ్రా చేసుకున్నారని, మిగతా విషయాలు విచారణలో వెల్లడిస్తానని పేర్కొన్నారు.
Advertisement
Advertisement