ఇంటింటికీ నల్లా, ఇంటర్నెట్
♦ వాటర్‌గ్రిడ్ ద్వారా తాగునీరు, బ్రాడ్‌బ్యాండ్ అందుబాటులోకి
♦ మండలిలో కేటీఆర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వాటర్‌గ్రిడ్ పథకం ద్వారా ‘ఇంటింటికీ నల్లా... ఇంటింటికీ ఇంటర్నెట్’ను అందిస్తామని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) తెలిపారు. బుధవారం శాసనమండలిలో ఈ అంశంపై స్వల్పకాలిక చర్చకు ఆయన బదులిస్తూ వాటర్‌గ్రిడ్ ద్వారా వేసే పైపులైన్ల నుంచి తాగునీటితోపాటు బ్రాడ్‌బ్యాండ్ కేబుల్‌ను పంపుతామన్నారు. 90 శాతం నీటిని గ్రావిటీ ద్వారానే ఇంటింటికీ సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. వాటర్‌గ్రిడ్‌లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు గరిష్టస్థాయిలో పరిహారం ఇస్తామన్నారు.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో పర్యవేక్షిస్తామన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కోసం రూ. 20 వేల కోట్లు సేకరించామని కేటీఆర్ చెప్పారు. గ్రామాల్లో మహిళలే గ్రిడ్ నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తారన్నారు. ప్రాజెక్టు పరిధిలోకి హైదరాబాద్ నగరం రాదన్నారు. వాటర్‌గ్రిడ్ పథకంలో అవినీతి జరుగుతోందన్న విపక్షాల ఆరోపణలపై కేటీఆర్ స్పందిస్తూ వారికి అన్నింట్లో స్కాములు కనిపిస్తాయని, కానీ తాము స్కీములతో ముందుకు పోతున్నామన్నారు. తమ ప్రభుత్వం ఈపీసీ విధానాన్ని, కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్సులిచ్చే పద్ధతిని రద్దు చేసిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నుంచి 10 శాతం నీటిని పారిశ్రామిక అవసరాలకు కూడా ఉపయోగిస్తామన్నారు. వచ్చే ఏడాదిన్నరలోనే పాలేరు రిజర్వాయర్ నుంచి సమీపంలోని సూర్యాపేట, కూసుమంచి తదితర ప్రాంతాలకు తాగునీరు అందిస్తామన్నారు.
చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు...
వాటర్‌గ్రిడ్‌ను అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. వాటర్‌గ్రిడ్‌కు నీరెలా తెస్తారని దుష్ర్పచారం చేస్తున్నారని...పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖ రాశారని ఆరోపించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి 1,200 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయిస్తూ అప్పటి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అందులో 10 శాతం (120 టీఎంసీలు) తాగునీటికి ఉపయోగించుకోవచ్చని... వాటర్‌గ్రిడ్‌కు 40 టీఎంసీలకు మించి అవసరం లేదన్నారు. ఇంత స్పష్టత ఉన్నా వాటర్‌గిడ్‌పై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు.
ఎవరు అడ్డుపడినా ఈ ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రతిపక్షాలను రాజకీయంగా మూడు చెరువుల నీరు తాగిస్తామని చురకలంటించారు. సభలోని అందరు అధికార పార్టీ సభ్యులంతా ఈ అంశంపై చర్చలో పాల్గొన్నారు. కేటీఆర్ సమాధానం అనంతరం మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ స్వామిగౌడ్ ప్రకటించారు.