ఐఆర్‌సీటీసీ భారీ విమాన ప్రయాణ ఆఫర్లు
సాక్షి, సిటీబ్యూరో: దసరా సెలవుల్లో సరదాగా విహార యాత్రలకో... పుణ్య క్షేత్రాల సందర్శనకో వెళ్లాలని అనుకుంటున్నారా? మీలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీలు సిద్ధం చేసింది. దేశ, విదేశీ పర్యటనల కోసం ఫ్లైట్ ప్యాకేజీలను ప్రకటించింది. హాంకాంగ్, షంజన్, మకావూ, దుబాయ్‌తో పాటు మొట్టమొదటిసారి గోవా, తిరుపతికి సైతం ఫ్లైట్ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఫ్లైట్ ప్యాకేజీలకు పర్యాటకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్న దృష్ట్యా దసరా సెలవుల సందర్భంగా ప్రత్యేక పర్యటనలకు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు.
భోజనం,రోడ్డు రవాణా, హోటళ్లలో బస వంటి అన్ని సదుపాయాలతో ప్యాకేజీలను రూపొందించడం వల్ల ఎక్కువ మంది పర్యాటకులు ఐఆర్‌సీటీసీపై ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు. ఒకసారి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ బుక్ చేసుకున్న తరువాత అన్ని సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. పర్యాటకులకు బీమా సౌకర్యం ఉంటుంది.
దుబాయ్ పర్యటన ...
అక్టోబర్ 10వ తేదీ నుంచి 14 వరకు ఈ పర్యటన ఉంటుంది. దుబాయ్, అబుదాబి నగరాలను సందర్శిస్తారు. బుర్జ్ ఖలీఫా, మిరాకిల్ గార్డెన్, గోల్డ్ షాపింగ్, షేక్ జాయద్ మసీదు, తదితర ప్రాంతాల పర్యటన ఉంటుంది. భోజనం, వసతి, రోడ్డు రవాణా వంటి అన్ని సదుపాయాలతో కూడిన ఈ ప్యాకేజీ చార్జీ రూ.62,800.
గోవాకు ఫ్లైట్ ప్యాకేజీ...
ఇప్పటి వరకు గోవాకు రైలు ప్యాకేజీలను మాత్రమే ప్రకటించిన ఐఆర్‌సీటీసీ మొట్టమొదటిసారి దసరా సెలవుల సందర్భంగా ఫ్లైట్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్ 21 నుంచి 24వ తేదీ వరకు ఈ పర్యటన ఉంటుంది. 21న మధ్యాహ్నం 12.50 గంటలకుSహైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో బయలుదేరి 2.15కు గోవా చేరుకుంటారు.
తిరిగి 24వ తేదీ మధ్యాహ్నం 2.30గంటలకు గోవా నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3.45కు హైదరాబాద్ చేరుకుంటారు. సౌత్, నార్త్ గోవా, ఓల్డ్ గోవా చర్చి, బీచ్‌లు, ఆలయాలు, బోట్ రైడింగ్, తదితర సదుపాయాలతో కూడిన ఈ పర్యటన చార్జీ రూ.18,970. ఈ మొత్తానికే అన్ని వసతులు, రోడ్డు రవాణా సదుపాయాన్ని కల్పిస్తారు.
తిరుపతికి ఫ్లైట్‌లో....
తిరుపతికి రెగ్యులర్‌గా రైళ్లలో వెళ్లే ప్రయాణికులు దసరా సెలవుల్లో సరదాగా విమాన ప్రయాణం చేయవచ్చు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 21న రెండు ఫ్లైట్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. సెప్టెంబర్ 30న ఉదయం 9.25కు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.25 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 1న రాత్రి 8.30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి రాత్రి 9.35 కు హైదరాబాద్ చేరుకుంటారు. శ్రీవారి దర్శనంతో పాటు శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు తదితర పుణ్యక్షేత్రాలు సందర్శించవచ్చు. అన్ని వసతులతో కలిపి ఈ పర్యటన చార్జీ రూ.9775.
బుకింగ్, ఇతర వివరాలకు ఫోన్ :040–27702407, 9701360647, 9701360609
చలో హాంకాంగ్....
హాంకాంగ్, షంజన్, మకావు నగరాల పర్యటన అక్టోబర్ 8 నుంచి 12వ తేదీ వరకు ఉంటుంది. 8వ తేదీ తెల్లవారు జామున 1.50 గంటలకుSరాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ బయలుదేరుతుంది. ఉదయం 9.40కి హాంకాంగ్ చేరుకుంటుంది. తిరిగి 12వ తేదీ రాత్రి 9.15 గంటలకు హాంకాంగ్ నుంచి బయలుదేరి అర్ధరాత్రి 12.30కు హైదరాబాద్ చేరుకుంటారు. ఈ పర్యటనలో మొదటి రెండు రాత్రులు హాంకాంగ్‌లో గడుపుతారు.
అక్కడి డిస్నీల్యాండ్, మేడం టుసార్ట్స్, వంద అంతస్థుల అతి ఎత్తయిన భవనం వంటి ప్రాంతాల్లో పర్యటిస్తారు. అనంతరం షంజన్ సిటీలో మినరల్ మ్యూజియం, లోటస్ స్క్వేర్, దివాంగ్ మాన్షన్, లోకల్ షాపింగ్, విండోస్ ఆఫ్ ది వరల్డ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు. ఇక పర్యాటకుల స్వర్గధామంగా పరిగణించే మకావు సిటీలో ఎ–మా టెంపుల్, సెయింట్ పౌల్స్ చర్చి, సెనాడో స్క్వేర్, కుమ్ లమ్ స్టాచ్యూ, లోటస్ స్క్వేర్ ఉంటాయి. ఏసీ డీలక్స్ హోటల్‌లో వసతి, రవాణా, తదితర అన్ని సదుపాయాలతో ఈ ప్యాకేజీ చార్జీ రూ.73,419