- పట్టభద్రులకు 121, ఉపాధ్యాయులకు 55
పోలింగ్ కేంద్రాలు ఖరారు
Published Wed, Feb 22 2017 12:06 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
- స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు
కర్నూలు(అగ్రికల్చర్): శాసనమండలి ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాల ఖరారు పూర్తి చేశారు. పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి జిల్లా యంత్రాంగం పంపిన ప్రతిపాదనలకు ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. తొలుత పట్టభద్రుల నియోజక వర్గానికి సంబంధించి 112 కేంద్రాలను ఏర్పాటు చేయాలని తలపెట్టారు. అయితే పలు పోలింగ్ కేంద్రాల్లో 1300కు పైగా ఓటర్లు ఉండటంతో పోలింగ్ నిర్ణీత సమయానికి పూర్తి కావడం కష్టమవుతుందన్న రాజకీయ పార్టీల నేతలు సూచన మేరకు అదనంగా 9 కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్ కేంద్రాల సంఖ్య 121కి పెరిగింది. ఉపాధ్యాయ నియోజక వర్గానికి తొలుత 54 కేంద్రాలు ఏర్పాటు చేయగా రాజకీయ పార్టీల సూచనల మేరకు మరో కేంద్రాన్ని అదనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇందువల్ల పోలింగ్ కేంద్రాల సంఖ్య 55కు పెరిగింది. ఇప్పటికి వెయ్యికి పైగా ఓటర్లున్న పోలింగ్ కేంద్రాలు 17 ఉన్నాయి. పట్టభద్రులకు ఆదోని డివిజన్‌లో 23, కర్నూలు డివిజన్‌లో 62, నంద్యాల డివిజన్‌లో 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులకు ఆదోని డివిజన్‌లో 17, కర్నూలు డివిజన్‌లో 21, నంద్యాల డివిజన్‌లో 17 ప్రకారం ఏర్పాటు చేశారు. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కర్నూలు, నంద్యాల, ఆదోని రెవెన్యూ డివిజన్ అధికారుల కార్యాలయాల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
Advertisement