కొత్త జిల్లాల్లో పరిపాలనకు సిద్ధం కావాలి
-
ప్రభుత్వ భవనాలు లేని చోట అద్దె ఇళ్లు తీసుకోవాలి
-
రికార్డుల పంపిణీ పూర్తి చే యాలి
-
కలెక్టర్ వాకాటి కరుణ
హన్మకొండ అర్బన్ : కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి ఆయా జిల్లాలో పరిపాలన కార్యకలాపాలు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం కావాలని కలెక్టర్ వాకాటి కరుణ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మం దిరంలో జిల్లాల విభజనకు సంబంధించిన అంశాలపై కలెక్టర్ శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహబూబాబా ద్‌లో వైటీసీలో, భూపాలపల్లిలో సింగరేణి సంస్థ భవనంలో కలెక్టరేట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామమన్నారు. పాత భవనాలు ఉంటే వాటికి మరమ్మతులు చేయించుకోవాలని, లేని చోట్ల అద్దె భవనాలు తీసుకోవాలన్నారు. తమ శాఖలకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు.
ఫైళ్లు స్కానింగ్ చేయించాలి
అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇప్పటివరకు ఉన్న ఫైళ్లు భద్రంగా స్కానింగ్ చేయించాలని కలెక్టర్ సూచించారు. ఏ జిల్లా పరిధిలోని ఫైళ్లు ఆ జిల్లాకు పంపించాలన్నారు. ఈ పనులను వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కోర్టు వివాదాలు, ఇతర ముఖ్యమైన ఫైళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. ఫైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు రికార్డుల్లో నమోదుచేసుకోవాలన్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందినే కొత్త జిల్లాలకు పంపిణీ చేసుకోవాలని పేర్కొన్నారు.
ఉమ్మడి కార్యాలయాల్లో హన్మకొండ, వరంగల్
ప్రస్తుతం హన్మకొండ, వరంగల్ జిల్లాల పాలన కొద్ది రోజుల వరకు ఉమ్మడి కార్యాలయాల్లోనే కొనసాగుతుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో చేసినట్లు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఒకే కార్యాలయం మధ్యలో పార్టీషన్, గోడ కట్టడం వంటి వాటితో సర్దుబాటు చేసుకోవాలన్నారు. కొత్తగా ఏర్పడబోయే జిల్లాలకు వచ్చే అధికారులకు సమస్యలు స్వాగతం పలకకుండా ముందస్తుగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.
భూపాలపల్లిలో భవనాల కొరత
సమీక్ష సమావేశంలో పాల్గొన్న 30 శాఖలకు పైగా అధికారులు తమకు భూపాలపల్లిలో కార్యాలయం లేదని.. వాటి కోసం ప్రత్యామ్నాయం చూపించాలని కలెక్టర్‌ను కోరారు. కాగా, కార్యాలయాల పూర్తి వివరాలు అందజేసేందుకు లేఖలు రాయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జేసీ ప్రశాంత్‌జీవన్ పాటిల్, ఏజేసీ తిరుపతిరావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.