రెండేళ్లలో టీఆర్ఎస్కు అంత డబ్బెక్కడిది?
ఖమ్మం : పాలేరు ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పూర్తిగా డబ్బు రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ అభ్యర్థి, దివంగత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితా రెడ్డి అన్నారు. ఇతర పార్టీల నేతలను టీఆర్ఎస్ ప్రలోభపెడుతోందని ఆమె మండిపడ్డారు. పాలేరు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఖర్చు పెడుతున్న ధనాన్ని, ఇంకో వందేళ్లు అయినా తాము సంపాదించలేమన్నారు. రెండేళ్లలోనే టీఆర్ఎస్కు అంత డబ్బు ఎక్కడని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సుచరితారెడ్డి ఓ లేఖను విడుదల చేశారు.'పాలేరులో వచ్చే తీర్పు మన తెలంగాణా ప్రజాస్వామ్య భవిష్యత్ ను నిర్ధేశిస్తుంది, ఏమాత్రం జాగ్రత్తగా లేకున్నా అరాచక ఊబి లో మునిగిపోవడం ఖాయం. అప్రమత్తంగా ఉండాలని పాలేరు నియోజక వర్గ ప్రజాబంధువుల కు వినతి. ప్రజల సొమ్ము అయిన ప్రభుత్వ ధన ఖర్చుతో అధికార బలం, ఆర్భాటాల ప్రచారం ఖర్చు ఎన్ని కోట్లో నేను ఊహించలేక పోతున్నాను.
ఇంకా వందేళ్లు అయినా ... ఇంత ధనం మా కుటుంబం మొత్తం వ్యవసాయం, రాజకీయాల్లో ఉన్నా కూడా ఖర్చు పెట్టడం మాకు సాధ్యం కాదు అంటే మీరు పరిస్థితి ఊహించొచ్చు. రెండేళ్లలో వీరికి ఇంత ధనం ఎక్కడిది? విజ్ఞులైన ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లు కావాలంటే అక్రమ సంపాదనను ఖర్చుపెట్టడం ఎంతవరకు సబబు?
50 ఏళ్లుగా రాజకీయాల్లో ఉండి తర తమ బేధాలు లేకుండా ప్రజలందరూ నా వాళ్లే అని చూసుకున్నా మా కుటుంబానికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే... ఇక ముందు ఈ టీఆర్ఎస్ పరిపాలనలో ప్రజాస్వామ్యం బతికి బట్టకడుతుందా? వీరి ఆగడాలు, ఆర్భాటాలు, ప్రతి రోజూ ప్రజల బలహీనతలను ఆధారం చేసుకొని ఏదో ఒక నాటకం చేస్తూ మభ్యపెట్టడాన్ని ప్రజలు గమనించాలని ప్రార్ధన. ఇది ఒక రకంగా పెద్ద మోసమే.. దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ స్ఫూర్తి, వారి ఆశీస్సులతో పాలేరు ప్రజల బాగును చూసుకొని అభివృద్ధికి నిదర్శనంగా నిలవాలని మీ ఆదరాభిమానానికై నిలుచున్న మీ ఇంటి ఆడపడుచును'. అని ముగించారు.