- కృష్ణా పుష్కరాలకు డీలా
- గత వారం రోజులుగా రూ.12 కోట్ల ఆదాయం.. 25 లక్షల మంది ప్రయాణం
- ప్రైవేటు దోపిడీని అడ్డుకోలేకపోయిన సర్కారు
సాక్షి, అమరావతి
కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ ఆశించిన మేర ఆదాయం ఆర్జించలేకపోతోంది. గోదావరి పుష్కరాల్లో రూ.74 కోట్ల మేర ఆదాయం రాబట్టిన ఆర్టీసీకి కష్ణా పుష్కరాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. కష్ణా పుష్కరాలకు రూ.60 నుంచి రూ.80 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఆశించింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా భారీగానే చేసింది. కానీ గత వారం రోజులుగా ఆదాయం రూ.12 కోట్లు మాత్రమే రాబట్టింది. కష్ణా పుష్కరాల్లోనైనా సర్వీసులు తిప్పి నష్టాల్ని కొంత మేర పూడ్చుకుందామని భావించిన ఆర్టీసీకి తొలి రోజే చుక్కెదురు కావడంతో అప్పటి నుంచి నిరాశాజనకంగానే కొనసాగుతుంది. చివరి ఐదు రోజుల్లోనూ ఆదాయం రూ.10 కోట్లు దాటేలా కనిపించడం లేదని ఆర్టీసీ వర్గాలే పేర్కొనడం గమనార్హం.
ప్రణాళికా లోపమే కారణమా?
పుష్కరాలకు ప్రతి రోజూ 4.50 లక్షల మంది విజయవాడకు వస్తారని అంచనా వేశారు. ఇందుకోసం ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ విజయవాడలో ఐదు శాటిలైట్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. పుష్కరాలకు రెండు రోజుల ముందు నుంచే ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులకు ప్రధాన బస్టాండ్ నుంచి రిజర్వేషన్లు రద్దు చేయడం, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణీకులను ఇబ్రహీంపట్నం వరకు మాత్రమే అనుమతించడంతో ప్రయాణీకులు ఎక్కువ శాతం మంది ప్రైవేటు సర్వీసుల్ని ఆశ్రయించారు. పుష్కరాల తొలి రోజు ఆర్టీసీ ఆదాయం రూ.50 లక్షలకు మించలేదు. ఆర్టీసీ హడావుడిగా ఆంక్షలు సడలించింది. రిజర్వేషన్ పునరుద్ధరించి దూర ప్రాంత సర్వీసుల్ని బస్టాండ్ వరకు అనుమతించింది. అయితే మూడు రోజుల పాటు ఆర్టీసీ ఆదాయం మెరుగుపడలేదు. పై పెచ్చు ఆర్టీసీ అధికారులు విజయవాడ-గుంటూరు నడుమ సర్వీసుల్ని కూడా సరిగ్గా నడపలేదు. పుష్కరాల రెండో రోజు బస్సు సర్వీసులు లేక ప్రయాణీకులు గుంటూరు బస్టాండ్‌లో ఆందోళనలు కూడా చేశారు. ఆర్టీసీ నష్ట నివారణ చర్యలు చేపట్టేలోగానే ఆదాయం పడిపోయింది.
మరోవైపు ప్రైవేటు సర్వీసుల్ని కట్టడి చేస్తామని రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు ఆర్భాట ప్రకటనలు చేశారే తప్ప చర్యలు మాత్రం తీసుకోలేదు. కాంట్రాక్టు క్యారియర్లుగా తిప్పాల్సిన ప్రైవేటు సర్వీసులు మాత్రం స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ప్రయాణీకుల్ని దోచుకున్నాయి. ఆన్‌లైన్‌లో రిజర్వేషన్ వెసులుబాటు ఉంచి ప్రైవేటు సర్వీసులు అందినకాడికి దోచుకున్నా.. రవాణా శాఖ మాత్రం చేష్టలుడిగి చూసిందే తప్ప ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది. ఆర్టీసీ ఒక్క విజయవాడలోనే ఉచిత సిటీ సర్వీసుల్ని తిప్పిందే తప్ప గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఉచిత సౌకర్యం కల్పించలేదు. మొత్తం మీద భారీ ప్రణాళికలు రూపొందించిన ఆర్టీసీకి పుష్కర ఆదాయం నిరాశాజనకంగానే ఉంది.