పదికి..పకడ్బందీ!
ఉత్తేజం తోడు ∙పాఠశాలల దత్తత..
అధికారుల కసరత్తు ∙కలెక్టర్ ప్రత్యేక దృష్టి
కోరుట్ల: పదో తరగతిలో మంచి ఫలితాలు రాబట్టేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. విద్య..వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ శరత్ ఓ వైపు మరుగుదొడ్ల నిర్మాణంతో స్వచ్ఛ జిల్లా రికార్డుపై దృష్టి పెడుతూనే మరో వైపు పదో తరగతిలో ఉత్తమ çఫలితాలు సాధించి మరో రికార్డు కోసం కసరత్తులు చేస్తున్నారు. కొత్త జిల్లాలో మొదటిసారి జరుగుతున్న పదో తరగతి పరీక్షలు కావడంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే పదో తరగతి విద్యార్థులకు సాయంత్రం వేళ ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేసి ఉత్తేజం సాయంతో స్నాక్స్ ఏర్పాటు చేసి ప్రోత్సాహిస్తున్నారు. అంతే కాకుండా ప్రతీ ఉన్నత పాఠశాలలో ఉత్తేజం అమలు..విద్యార్థుల చదువుల పర్యవేక్షణకు దత్తత అ«ధికారులను ఏర్పాటు చేయడం విశేషం.
ఫలితాలకు..ఉత్తేజం!
గత ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పదో తరగతి సిలి బస్ పూర్తి అయిన క్రమంలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయాలన్న లక్ష్యంతో ఉన్నత పాఠశాలల్లో సాయంత్రం వేళ ప్రిపరేషన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 2 నుంచి మొదలయిన ఈ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులకు పౌష్టికారం అందించి పోత్సాహించాలన్న లక్ష్యంతో ‘ఉత్తేజం’ పేరిట స్నాక్స్ అందిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 180 ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 7644 మంది విద్యార్థులకు ఒక్కో విద్యార్థికి రూ.109 చొప్పున మొత్తం రూ.4,99,992 నిధులు మంజూరు చేశారు. పదో తరగతి పరీక్షలు మార్చి 14 ప్రారంభమై 30వ తేదిన ముగియనున్నాయి. పదో తరగతి పరీక్షలు ప్రారంభమై ముగిసే వరకు ఉన్నత పాఠశాలల్లో ఈ ఉత్తేజం కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో సాయంత్రం పూట విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు సిద్దం కావడానికి మంచి అవకాశం చిక్కింది.
పాఠశాలల దత్తత..
పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ పలితాల సాధనకు మండల స్థాయి అధికారులను నియమించారు. ఉత్తేజం అమలు తీరుతో పాటు సాయంత్రం పూట క్లాసులు ఎలా సాగుతున్నాయన్న అంశాన్ని పరిశీలించి మంచి పలితాల సాధనకు దత్తత అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మండల తహాశీల్దార్, ఎంపీడివో, ఎంఈవోలకు ఈ దత్తత బాధ్యతలు అప్పగించారు. వీరు తరచూ ఉన్నత పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. ఇటీవల కోరుట్ల మండలం మోహన్‌రావుపేట ఉన్నత పాఠశాలను అకస్మికంగా సందర్శించి ఉత్తేజంపై నిర్లక్ష్యం చూపుతున్న ఎంఈవో, ప్రధానోపాధ్యాయులకు మోమోలు జారీ చేయడం..దత్తత అధికారిని హెచ్చరించడం వంటి చర్యలు పది పలితాలపై జిల్లా కలెక్టర్ ఎంత సీరియస్‌గా ఉన్నారన్న అంశాని కి అద్దం పడుతోంది. ఇంత పకడ్బందీగా జిల్లా కలెక్టర్..విద్యాశాఖ తీసుకుంటున్న నిర్ణయాలు సత్పలితాలిస్తే పది పలితాల్లో జగిత్యాల జిల్లా రాష్ట్రస్థాయిలో తన ప్రత్యేకతను చాటుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.