– 3 నెలల్లో భూ సేకరణ పూర్తి కావాలి
– వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం ఆదేశం
అనంతపురం అర్బన్ : అనంతపురం నుంచి అమరావతికి ఏర్పాటు చేయనున్న ఆరు లైన్ల రహదారికి అవసరమైన భూసేకరణ మూడు నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం విజయవాడ నుంచి ఆయన ఇన్‌చార్జి కలెక్టర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ అనంతపురం, కర్నూలు, వైఎస్‌ఆర్ కడప, ప్రకాశం, గుంటూరు జిలాల నుంచి అమరావతికి 598 కిలో మీటర్ల ఆరు లైన్ల రహదారి ఏర్పాటుకు రూ.27,600 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నామని చెప్పారు.
అనంతపురం జిల్లాలో 1,260 హెక్టార్ల భూమి అవసరమవుతుందన్నారు. ఇందులో అటవీ భూములు కూడా ఉన్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపుల అభివృద్ధి జరిగితే భూమి విలువ పెరుగుతుందనే భావన ప్రజల్లో ఉంటుందన్నారు. అయితే ఇది ఎక్స్‌ప్రెస్ రోడ్డు కాబట్టి ఎలాంటి అభివృద్ధి ఉండదనే విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు. భూమి విలువ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లాలో 1,017 హెక్టార్లు సేకరించాల్సి ఉంది. జిల్లా నుంచి అమరావతికి వెళ్లే మార్గం 72.85 కిలోమీటర్లు ఉంటుందని, ఇందుకు 1,017 హెక్టార్లు సేకరించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రికి æఇన్‌చార్జి కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. అనంతపురం, రాప్తాడు, బుక్కరాయసముద్రం, పుట్లూరు, నార్పల, తాడిప్రతి మండలాల్లో ఈ భూమి సేకరించాల్సి వస్తుందన్నారు. ముచ్చుకోట, దూకుడు పల్లెల్లో రిజర్వు ఫారెస్టు ఉందన్నారు. ప్రభుత్వ భూములన్న చోట పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం నుంచి రహదారి అలైన్‌మెంట్ చూపేందుకు అధికారులను పంపుతామన్నారు. ఆర్డీఓ మలోలా, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ శివకుమార్, ఈఈ శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
అనంత' నుంచి అమరావతికి ఆరు లైన్ల రహదారి
Published Thu, Nov 24 2016 10:57 PM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement