కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా మారింది ట్రాఫిక్ పోలీసులు తీసుకున్న నిర్ణయం. బంజారాహిల్స్ రోడ్ నంబర్ -12లోని అగ్రసేన్ చౌక్‌లో కళింగ చౌరస్తాలో ట్రాఫిక్ జాం అవుతోందంటూ చేపట్టిన ప్రయోగం వాహనదారులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోంది. అగ్రసేన్ చౌరస్తాలోని రోడ్‌నంబర్-12 వైపు రోడ్డును బారికేడ్లతో మూసివేయటంతో వాహన చోదకులు కిలోమీటర్ దూరంలో ఉన్న బసవతారకం ఆస్పత్రి చౌరస్తా వరకు వెళ్లి యూటర్న్ చేసుకొని టీఆర్‌ఎస్ భవన్ మీదుగా రోడ్ నంబర్-12 వైపు వెళ్తున్నారు.
అందుకు పావుగంట సమయం పడుతోంది. ఎప్పటిలాగే వాహనాలు అగ్రసేన్‌చౌక్ నుంచి బసవతారకం ఆస్పత్రి వరకు నిలిచిపోతున్నాయి. ఎందుకంటే బసవతారకం చౌరస్తాలో పీవీ నర్సింహారావు విగ్రహం ఉన్న ఐలాండ్ చాలా పెద్దది. దీని చుట్టూ పెద్ద వాహనాలు తిరగటానికి తీవ్ర ఇబ్బంది ఎదురవుతోంది. ఇంకోవైపు గణేష్ టెంపుల్, ఐలాండ్‌తో పాటు సెంట్రల్‌మీడియన్ కూడా ఉండటం వాహనదారులకు ఇబ్బందికరంగా ఉంది. ఎటు చూసినా ఇక్కడ వాహనాలు మళ్లడం కష్టం కావటంతో సహజంగానే వెనుక వస్తున్న వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకు పోతున్నాయి.
అగ్రసేన్ చౌక్‌లో నలుగురు ట్రాఫిక్ పోలీసులను విధుల్లో ఉంచితే ఇక్కడ ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుంది. అయితే చలానాలు రాయడానికి మాత్రమే పోలీసులను వినియోగిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు వాహనదారుల నియంత్రణ ఏమాత్రం పట్టడం లేదు. ఇప్పటికైనా ట్రాఫిక్ ఉన్నతాధికారులు కలుగజేసుకుని అగ్రసేన్ చౌక్, బసవతారకం చౌరస్తాల్లో ఐలాండ్‌ల నిడివిని, సెంట్రల్ మీడియన్లను కుదించాలి. అప్పుడే ఇక్కడ వన్‌వే ప్రయోజనకరంగా ఉంటుందని వాహనదారులు అంటున్నారు.