ఆ ఖర్చూ మేమే భరిస్తాం!
Published Sat, Mar 4 2017 10:55 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
– అధికారపార్టీ అభ్యర్థికి తేల్చి చెప్పిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలు
– ప్రచార ఖర్చుకు రూ.10 లక్షలు ఇస్తామని అవమానించారని ఫైర్
– సర్దిచెప్పేందుకు యత్నించిన మంత్రులు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార ఖర్చు విషయం అధికార పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఒక్కో నియోజకవర్గంలో ప్రచారానికి రూ. 5లక్షల మొత్తాన్ని ఇస్తామని అధికారపార్టీ అభ్యర్థి కేజే రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జీలకు ఇవ్వచూపడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలు మండిపడటంతో.. నియోజకవర్గానికి రూ.10 లక్షల మేరకు సర్దుబాటు చేస్తామని ప్రకటించడాన్ని అందరూ ముక్తకంఠంతో నిరసించినట్టు సమాచారం. ఈ మాత్రం మొత్తాన్ని తామే భరిస్తామని.. మాకు ఇచ్చేది ఏందని నిలదీసినట్టు తెలిసింది. మొత్తం మీద ఎమ్మెల్సీ అభ్యర్థి వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అయితే, ఎలాగోలా సర్దుకుపోవాలని.. అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని మంత్రులు సర్దిచెప్పినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో గెలుపు సాధ్యమయ్యే అవకాశం లేదని ఆ పార్టీ నేతలు తేల్చిచెప్పినట్టు సమాచారం.
అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి
వాస్తవానికి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో అధికారపార్టీ మొదటి నుంచీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. నియోజకవర్గ ఇన్‌చార్జీలు, ఎమ్మెల్యేలను కనీసం పలకరించలేదని.. తమతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల్లో ఫ్లెక్సీలు కట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో అభ్యర్థి కేజే రెడ్డికి అధిష్టానం క్లాస్ తీసుకుంది. అయితే, ప్రచారంలో ఎంతో వెనుకబడ్డారు. ఎక్కడా అభ్యర్థికి సానుకూలంగా వాతావరణం కనిపించలేదు. దీంతో మరోసారి సమన్వయ కమిటీ పేరుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుపునకు కృషి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సర్దిచెప్పారు. ఈ పరిస్థితుల్లో గెలుపు కష్టమని.. ఇందుకు కారణం అభ్యర్థి వైఖరేనని అందరూ తేల్చిచెప్పారు. దీంతో ఎలాగైనా గెలుపు సాధించేందుకు ప్రయత్నించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అడ్డగోలుగా కోడ్ ఉల్లంఘిస్తూ ప్రచారానికి అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఇందుకోసం అధికారాన్ని ఉపయోగించుకుని ఓటు వేయాలని మరీ బెదిరింపులకు దిగుతోంది. ఎంతగా కోడ్ ఉల్లంఘిస్తున్నా ఎన్నికల అధికారులు కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన
గెలుపు కష్టమని తేలిపోవడంతో.. ఎన్నికల కోడ్‌ను అధికారపార్టీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. మంత్రి హోదాలో అధికారులతో సమావేశాలు మొదలు... ఓటు వేయాల్సిందేనంటూ గురుకుల టీచర్లను, ప్రిన్సిపాళ్లను పిలిపించి మరీ అభ్యర్థితో కలిసి సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా దర్జాగా పోలీసు బందోబస్తుతో నగరంలో అక్కడికి.. ఇక్కడికి చక్కర్లు కొట్టారు. ఇక ప్రచారంలో కూడా అందరి ఫ్లెక్సీలను చించి వేసినప్పటికీ అధికారపార్టీ అభ్యర్థి ఫ్లెక్సీలను మాత్రం అధికారులు తొలగించడం లేదు. పైగా రోజుకొక ప్రాంతంలో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. అయినా అధికారులు మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్ని చేస్తున్నప్పటికీ సానుకూల వాతావరణం మాత్రం కనిపించడం లేదని అధికారపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.
Advertisement
Advertisement