చిన్నారిని తల్లి ఒడికి చేర్చిన వాట్సప్
చీరాల అర్బన్ : స్కూలుకు వెళ్లి తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారిని వాట్సప్ తల్లి దగ్గరికి చేర్చింది. ఈ ఘటన మంగళవారం చీరాల పట్టణంలో చోటుచేసుకుంది. చీరాల పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి టోని శ్రీవాణి స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. స్కూలు నుంచి చెప్పకుండా బయటకు వచ్చిన ఆ చిన్నారి దారి తెలియక ఎంజీసీ మార్కెట్ వద్ద నిలబడింది. అమాయకంగా బేల చూపులు చూస్తున్న బాలికను శృంగారపేటకు చెందిన బెస్లీ అనే కుర్రాడు చూసి, తన బాధ్యతగా వన్‌టౌన్ పోలీసులకు అప్పగించాడు.
చిన్నారి ఫొటోను పోలీసులు వాట్సప్ గ్రూప్‌లో షేర్ చేశారు. గ్రూప్ మెసేజ్‌లో వచ్చిన ఫొటో ఆధారంగా చిన్నారిని గుర్తుపట్టిన ఓ వ్యక్తి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే వారు పోలీస్‌స్టేషన్‌కు రాగా పోలీసులు పూర్తి వివరాలు తీసుకుని చిన్నారిని తల్లికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి గంటల వ్యవధిలోనే తల్లి చెంతకు చేరడంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.