మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో లభించిన అఖండ విజయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీని నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలి తాలు ఖంగుతినిపించాయి. బీహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లోని 18 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 21న ఉప ఎన్నికలు జరగ్గా వాటిల్లో కేవలం ఏడు స్థానాలను మాత్రమే ఆ పార్టీ దక్కించుకోగలి గింది. లోక్‌సభ ఎన్నికల్లో దివాళా తీసిన స్థితికి చేరుకున్న కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు చూశాక కాస్త ప్రాణం నిలబడింది. వాస్తవానికి మొన్నటి ఉత్తరాంచల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మూడు స్థానాలూ చేజిక్కాక కాం గ్రెస్‌కు ధైర్యం వచ్చినా, ఇతరచోట్ల... ముఖ్యంగా బీహార్‌లో ఇది సాధ్య పడుతుందని ఆ పార్టీ అనుకోలేదు. సాధారణంగా ఉప ఎన్నికల ఫలి తాలు వాటికవే ఒక ధోరణిని ప్రతిఫలించలేవు.
అభ్యర్థి ఎంపిక దగ్గర నుంచి అతి విశ్వాసం వరకూ... స్థానిక సమస్యలు మొదలుకొని కుల సమీకరణాల వరకూ ఏదో ఒక కారణంవల్ల లెక్క తప్పి దెబ్బతినడానికి ఉప ఎన్నికల్లో ఎప్పుడూ అవకాశం ఉంటుంది. ఈ ఫలితాలు నరేంద్ర మోడీ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి చిహ్నమని జేడీ(యూ), కాంగ్రెస్ చెబుతున్నాయి. అయితే, మోడీ అధికారంలోకొచ్చి కేవలం మూడు నెలలు మాత్రమే గడిచిన నేపథ్యంలో ఈ వాదనకు అంత విలువ ఉండదు. ఎన్డీయే సర్కారు ఆచరణ ఇప్పుడిప్పుడే మొదలైంది. ఈ ఆచరణ ఫలితాలు ఎలా ఉండగలవో, వాటివల్ల సామాన్యుడికి కలిగేదేమిటో తేలాకగానీ ప్రభుత్వం పనితీరుకూ, ఎన్నికలకూ ముడి పెట్టడం సాధ్యపడదు.
అయితే, బీహార్‌లోని పది స్థానాల ఫలితాలు అనేక విధాల కీలకమై నవి. ఈ పదింటిలో 7 జేడీ(యూ)- ఆర్జేడీ కూటమికి లభించగా, బీజే పీకి మూడు వచ్చాయి. వచ్చే ఏడాది మొదట్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి 40 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ కూటమి 31 స్థానాలను గెల్చుకుని పాలక జేడీ(యూ) సర్కారును దిగ్భ్రమపరిచింది. రద్దయిన లోక్‌సభలో 38 స్థానాలుండే జేడీ(యూ)కి దక్కినవి కేవలం రెండంటే రెండే! మిగిలిన ఏడు స్థానాలూ కాంగ్రెస్, ఆర్జేడీ, ఎన్సీపీ కూటమి చేజిక్కించుకుంది. ఆ ఫలితాలు చూశాక బీహార్‌లో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధి కారం చేపట్టడం ఖాయమని అందరూ అనుకున్నారు. మొన్నటి లోక్‌సభ ఫలితాలను బట్టి చూస్తే ఈ 10 స్థానాల్లో బీజేపీకి రావలసినవి 8 సీట్లు. ఇందులో ఆరు స్థానాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెల్చుకు న్నవి. వీరిలో నలుగురు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలుపొందిన కార ణంగా ఎన్నికలొచ్చాయి. ఆ నాలుగింటిలో ఇప్పుడు బీజేపీకి లభించి నవి రెండు మాత్రమే. ఓడిపోయిన రెండు సీట్లూ ఎప్పటినుంచో బీజేపీ ఖాతాలో ఉన్నవి. సారాంశంలో సెమీ ఫైనల్స్‌గా భావించదగ్గ ఈ అసెం బ్లీ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే. బీహార్‌లో దిగ్గజాలన దగ్గ మాజీ సీఎంలు లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్‌కుమార్‌లు సామా జిక ఉద్యమాల ద్వారా రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నవారు. ఇద్దరికి ద్దరూ ఆ రాష్ట్రంలోని రెండు బలమైన కులాలకు చెందినవారు. ఒకప్పు డు సన్నిహిత మిత్రులే అయినా అనంతర పరిణామాల కారణంగా బద్ధ శత్రువులైనవారు. మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో సైతం వీరి నాయకత్వం లోని ఆర్జేడీ, జేడీ(యూ)ల కూటమి సాధ్యంకాలేదు. అలాంటిచోట ఉప ఎన్నికల ముందు అనూహ్యంగా రెండు పార్టీల మధ్యా పొత్తు కుదరింది. మోడీ కనికట్టు ముందు ఇలాంటి పొత్తులు తీసికట్టేనని బీజేపీ బల్లగుద్ది చెప్పింది. కేవలం అధికారాన్ని నిలుపుకొనేందుకు మాత్రమే వీరిద్దరూ సన్నిహితులయ్యారని, ఇందుకు సిద్ధాంత ప్రాతిపదికేమీ లేదని.... రాజ కీయాల్లో ఇలాంటి అవకాశవాదాన్ని ప్రజలు మెచ్చరన్నది. దానికితోడు లోక్‌సభ ఎన్నికల్లో యూపీ, బీహార్ ఫలితాలను విశ్లేషించిన అనేకమంది నిపుణులు కుల రాజకీయాలకు కాలం చెల్లినట్టేనని అంచనా వేశారు. ప్రజలు అన్నిటికీ అతీతంగా ఒక్కటై హిందూత్వకూ, మోడీకి పట్టంగ ట్టారని తేల్చారు. అందువల్లే మిగిలినవాటికంటే బీహార్ ఉప ఎన్నికలే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. అక్కడి 10 స్థానాలూ ఎటు మొగ్గు చూపుతాయన్న అంశంపైనే అందరి దృష్టీ పడింది. నిత్యమూ పరస్పరం తలపడే రెండు బలమైన పక్షాలు ఒక్కటైతే బీజేపీకి గండమేనని ఫలి తాలు తేల్చాయి.
అయితే, మొన్నటి లోక్‌సభ ఎన్నికల అనంతరం నితీష్‌కుమార్ వ్యవహరించిన తీరు సైతం ఈ ఫలితాలకు కారణమని గుర్తించాలి. ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా తాను సమాధ వుతున్నానని నితీష్ సరిగానే గుర్తించారు. తక్షణం సీఎం పదవిని వదు లుకుని పార్టీని పటిష్టపరచకపోతే, జనంలో విశ్వాసం కలిగించలేకపోతే మనుగడకు ప్రమాదమని నిర్ధారణకొచ్చారు. అందువల్లే అత్యంత వెనక బడిన కులానికి చెందిన మజీని సీఎం చేశారు. లాలూ-నితీష్ కూటమి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ కొనసాగుతుందా...కీలకమైన సీఎం పదవి విషయంలో వారు అంగీకారానికొస్తారా అనే అంశాలు బీహార్ రాజకీయాల భవిష్యత్తు గమనాన్ని నిర్దేశిస్తాయి.
మొన్నటి లోక్‌సభ ఎన్నికలు జరిగిన ప్రాతిపదిక వేరు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరస కుంభకోణాల్లో కూరుకు పోయి సర్వ భ్రష్టమైపోయింది. ఆ కూటమిని చావుదెబ్బ తీస్తే తప్ప ప్రయోజనం శూన్యమని ప్రజలు భావించారు. అలాంటి నేపథ్యంలో బీజేపీ కూటమికి అధికారం కట్టబెట్టారు. నరేంద్ర మోడీ వాక్పటిమ, ఆయన చేసిన వాగ్దానాలు అధికారంలోకొచ్చేందుకు ఆ పార్టీకి ఎంతగానో తోడ్పడ్డాయి. అయితే, ఆ మాటల్ని ఏ మేరకు చేతల్లో చూపగలదన్న అంశంపై ఆధారపడి మరికొన్నాళ్లలో జరగబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మెరుగైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ గ్రహించాల్సింది అదే.
‘ఉప’ ఫలితాలు
Published Tue, Aug 26 2014 11:57 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement