సిరియాపై సవాళ్లు | Syria Faced Many Challenges | Sakshi
Sakshi News home page

సిరియాపై సవాళ్లు

Published Thu, Apr 12 2018 12:19 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

Syria Faced Many Challenges - Sakshi

మరుభూమిని తలపిస్తున్న సిరియాలో మరో ఉత్పాతాన్ని సృష్టించడానికి అగ్రరా జ్యాలు సిద్ధపడుతున్నాయి. తమది కాని గడ్డపై పరస్పరం సవాళ్లు విసురుకుంటు న్నాయి. భద్రతామండలిలో ఒక దేశం తీర్మానాలను మరొక దేశం వీటో చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు రెండురోజులక్రితం భద్రతా సలహాదారుగా వచ్చిన జాన్‌ బోల్టన్‌కు ‘యుద్ధోన్మాది’ అన్న ముద్ర ఇప్పటికే ఉంది. ఆయన రాకతో ట్రంప్‌ యుద్ధభేరి మోగిస్తున్నారు. సిరియాలో క్షిపణులు దూసుకెళ్లడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. అందుకు సంబంధించిన వ్యూహాన్ని రచించడానికి ఈ వారం జరగాల్సిన లాటిన్‌ అమెరికా దేశాల పర్యటనను కూడా ఆయన రద్దు చేసుకు న్నారు. మరో 48 గంటల్లోగా తమ స్పందన ఉంటుందని ట్రంప్‌ చెబుతున్నారు. అటు రష్యా సైతం ‘సై అంటే సై’ అంటోంది. ‘మా దళాలకు హాని జరిగే చర్య ఎవరు తీసుకున్నా అందుకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంద’ని బదులిచ్చింది.

 ట్రంప్‌ చెబుతున్న క్షిపణులు సాధారణమైనవి కాదు. అవి అణు క్షిపణులు. అమెరికాకు చెందిన మూడు యుద్ధ నౌకలు ఇప్పటికే మధ్యధరా సముద్రంలో మోహరించి ఉన్నాయి. వీటికి తోడు క్షిపణుల్ని సంధించగల బ్రిటన్‌ ఫైటర్‌ జెట్‌ విమానాలు సైప్రస్‌ సమీపంలో తిష్టవేశాయి. మరోపక్క ఫ్రాన్స్‌కు చెందిన ఫైటర్‌ జెట్‌ విమానాలు ఒమన్‌లోని సైనిక స్థావరంలో సిద్ధంగా ఉన్నాయి. భద్రతా మండలి, ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై సిరియా మారణ హోమాన్ని ఆపడానికి ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చించి ఒక సమష్టి నిర్ణయాన్ని తీసుకోవడానికి బదులు తమ తమ పరాక్రమాలను ప్రదర్శించడానికి సిద్ధపడు తున్న అగ్రరాజ్యాల తీరు దిగ్భ్రాంతి గొలుపుతోంది.  

 సిరియాలో పరిస్థితి క్షీణించిందన్నది వాస్తవం. అక్కడి బషర్‌ అల్‌ అసద్‌ ప్రభుత్వం తిరుగుబాటుదార్లను అణిచే పేరిట జనావాసాలపై నిత్యం బాంబుల వర్షం కురిపిస్తూ పౌరులను  పొట్టనబెట్టుకుంటోంది. అమెరికా, ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల అండదండలున్న తిరుగుబాటుదారులు ప్రతిదాడులకు పూనుకుంటు న్నారు. అటు సిరియాకు అండగా రష్యాతోపాటు ఇరాన్‌ కూడా రంగప్రవేశం చేసింది. అక్కడి సహాయక బృందాలు చెబుతున్నదాన్నిబట్టి తిరుగుబాటుదార్ల ప్రాంతాల్లోని పౌరులపై గత ఫిబ్రవరి 18 మొదలుకొని ఇప్పటివరకూ నాలుగు సార్లు విషవాయు దాడులు జరిగాయి. యుద్ధ విమానాలు క్లోరిన్, సరీన్‌ వంటి విష వాయువులతో కూడిన బాంబుల్ని ప్రయోగిస్తున్నాయి. యుద్ధ రంగంలో మొట్ట మొదటి క్షతగాత్ర సత్యమేనంటారు. ఇన్ని పక్షాలు హోరాహోరీగా పోరాడే సిరి యాలో విషవాయు దాడులకు పాల్పడుతున్నదెవరో చెప్పే పరిస్థితి లేదు.

 అసద్‌ ప్రభుత్వానికి విషవాయు దాడులకు పాల్పడిన చరిత్ర ఉంది.  రసాయన ఆయుధా లను నిర్మూలించామని అసద్‌ ప్రభుత్వం చెబుతున్నా దాన్ని పూర్తిగా విశ్వసించడం సాధ్యం కాదు. ఇజ్రాయెల్, తిరుగుబాటుదార్లు కావాలని ఈ విషవాయు దాడులకు తెగబడి అమెరికా జోక్యానికి దారులు తెరుస్తున్నారని రష్యా అంటున్నది. నిజమైన నేరస్తులు రష్యా, సిరియాలేనని అమెరికా, బ్రిటన్‌ ఆరోపిస్తున్నాయి. హంతకులెవరన్న సంగతి అలా ఉంచితే ఈ విషవాయు దాడుల పర్యవసా నాలు అతి భయంకరమైనవి. వందలాదిమంది పిల్లలు, పెద్దలు నడి వీధుల్లో నుర గలు కక్కుకుంటూ గిలగిలా కొట్టుకోవడం, ఊపిరి పీల్చుకోవడానికి నరకయాతన పడటం, బాధితుల శరీరాలపై ఉన్న విషవాయు అవశేషాలను తొలగించడానికి అగ్నిమాపక సిబ్బంది నిలువెల్లా గాయాలైనవారిపై స్ప్రేయర్లతో నీళ్లు జల్లటం వంటి వీడియోలు ఒళ్లు జలదరింపజేస్తాయి.

నిరుడు ఏప్రిల్‌లో వాయువ్య సిరి యాలో తిరుగుబాటుదార్ల అధీనంలోని పట్టణంపై జరిగిన విషవాయు దాడిలో 75 మంది అక్కడికక్కడే మరణించారు. వందలాదిమంది తీవ్ర అస్వస్థతతో జీవచ్ఛవా లయ్యారు. రసాయన ఆయుధాల వినియోగంపై నిషేధం ఉన్నా వాటిని యుద్ధ విమానాలు జారవిడుస్తున్నాయి. ఈ దాడులతో నిస్సహాయులుగా మారిన పౌరు లకు సహాయం అందించేందుకు నెల రోజుల కాల్పుల విరమణ పాటించాలని ఫిబ్రవరి నెలాఖరులో భద్రతామండలి ఏకగ్రీవంగా తీర్మానించినా దాన్ని ఎవరూ పాటించడం లేదు. గాయాలపాలైనవారిని, అస్వస్థులైనవారిని ఆస్పత్రులకు తరలిం చేందుకు కాల్పుల విరమణను ఉద్దేశించారు. అయితే దాడులు యధావిధిగా సాగు తూనే ఉన్నాయి. తిరుగుబాటుదారుల అధీనంలోని ప్రాంతాల నుంచి తమవైపు లక్షా 20 వేలమంది వచ్చారని ప్రభుత్వం చెప్పుకుంటోంది. ఇప్పుడు సిరియా అత్యంత సంక్లిష్ట దశలో ఉంది. అసద్‌ను వెళ్లగొట్టడం కోసం అమెరికా, సౌదీ అరేబియాలు అందించిన ఆయుధాలు, డబ్బు ఐఎస్‌ ఉగ్రవాద సంస్థకు ఊపిరులూదాయి. అదిప్పుడు బలహీనపడినట్టు అనిపిస్తున్నా ఎక్కడిక క్కడ నస్రా ఫ్రంట్‌ వంటి ముఠాలు పుట్టుకొచ్చాయి.

రసాయన బాంబులు ప్రయో గిస్తున్న యుద్ధ విమానాలెవరివో తేల్చడానికి అనువైన వాతావరణం అక్కడ లేదు. జరిగిందేమిటో, ఎవరు నేరస్తులో తేల్చడానికి ఐక్యరాజ్యసమితి నేతృత్వంలో నిపు ణుల బృందం వెళ్లడం ప్రస్తుతం అవసరం. భద్రతామండలి ఆమోదం సంగతలా ఉంచి తన దేశంలోని కాంగ్రెస్‌ అనుమతి కూడా తీసుకోకుండా ఏకపక్షంగా క్షిపణి దాడులకు దిగాలని తహతహలాడుతున్న ట్రంప్‌కు బ్రిటన్, ఫ్రాన్స్‌వంటి దేశాలు వెనకా ముందూ చూడకుండా మద్దతిస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. సరిగ్గా పది హేనేళ్ల క్రితం ఈ దేశాలన్నీ ఇదే తరహాలో ఇరాక్‌పై దురాక్రమణకు దిగాయి. దాన్ని వల్లకాడుగా మార్చాయి. లక్షలాదిమంది ప్రాణాలు తీశాయి. ఈనాటికీ అది సాధా రణ దేశంగా నిలదొక్కుకొనలేకపోతోంది. ఇప్పుడు అమెరికా, రష్యాలు తలపడితే పశ్చిమాసియాలో అంతకుమించిన నష్టం వాటిల్లుతుంది. ఒకసారంటూ యుద్ధం మొదలైతే అది ప్రపంచ దేశాలన్నిటిపైనా  దారుణమైన ప్రభావాన్ని చూపుతుంది. కనుక అగ్రరాజ్యాల యుద్ధోన్మాదాన్ని వదలగొట్టడం ప్రపంచ ప్రజల తక్షణ కర్తవ్యం. సిరియాలో శాంతి స్థాపించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడటం కోసం అగ్రరాజ్యాల్లోని పౌరులు సమష్టిగా తమ తమ ప్రభుత్వాలపై ఒత్తిళ్లు తీసుకు రావాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement