నీటి సమస్య తీరుస్తా.. వలసలను నివారిస్తా
- చంద్రబాబు వైఫల్యాలు, ప్రజా సమస్యలే ప్రచార అస్త్రాలు
- టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలు చూసి జగన్ వెంట నడవాలని నిర్ణయించా
- సాక్షి ఇంటర్వ్యూలో వైఎస్సార్ సీపీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి సామాన్యకిరణ్
చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర లేకపోవడం, జాతీయ రహదారి సమస్య వంటి ప్రధాన అంశాలు, కుప్పం నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఫల్యాలను అస్త్రాలుగా చేసుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ జి.సామాన్యకిరణ్ ప్రచారంలో దూసుకెళుతున్నారు. వలసలను నివారిస్తానని చెబుతున్నారు. సమాజ సేవే లక్ష్యంగా ట్రస్టు నడుపుతున్నారు. పేద, అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని ఆదరిస్తున్నారు. ‘సాక్షి ’కి సామాన్యకిరణ్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ..
మీ కుటుంబ నేపథ్యం
సామాన్యకిరణ్: నేను పుట్టింది మదనపల్లెలో. మా తండ్రి స్వగ్రామం జిల్లాలోని పూతలపట్టు మండలం టి.కొత్తూరు గ్రామం. అమ్మ సొంతూరు నెల్లూరు జిల్లా టీపీ.గూడురు మండలం వరిగొండ. ఉద్యోగ రీత్యా అక్కడే ఉండేవాళ్లం. 2013 వరకు నెల్లూరులోనే అధ్యాపకురాలిగా పని చేశాను. భర్త జీ.కిరణ్‌ది ఖమ్మం జిల్లా కొత్తగూడెం. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో చదివేటప్పుడు పరిచయమయ్యారు. మాది ప్రేమ వివాహం. వెస్ట్‌బెంగాల్ ఐఏఎస్ అధికారిగా పని చేస్తున్నారు.
మీ విద్యా నేపథ్యం
సామాన్యకిరణ్: చిత్తూరులో 10వ తరగతి వరకు చదివాను. ఎస్వీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేశా. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఫిల్, పీహెచ్‌డీ చేశాను. పలు అంశాలపై పరిశోధనలు, అనేక సాహిత్య ప్రచురణలు చేశాను. నెల్లూరులో 2013 వరకు తెలుగు అధ్యాపకురాలిగా పని చేశాను.
చిత్తూరు ఎంపీగా మీరేం చేస్తారు
సామాన్యకిరణ్: చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గ ప్రజలు తాగునీరు, సాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిత్తూరు పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే అత్యవసర సమస్యగా పరిష్కరించేందుకు కృషి చేస్తాను. రెండవ ప్రధాన సమస్య వలసలు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ఉపాధి కోసం బెంగుళూరు, చెన్నయ్‌కి వెళ్తున్నారు. వలసలను నిరోధించేందుకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి, ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తాను. తద్వారా ప్రజల వలసలు ఆగుతాయి. నేషనల్‌హైవే-4 నియోజకవర్గం మీదుగానే కర్నాటకకు వెళ్తుంది. ఈ రోడ్డు నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యాన్ని నివారించి, రోడ్డును నాలుగులైన్లుగా మార్చేందుకు కృషి చేస్తా. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు చర్యలు చేపడతాను. చిత్తూరు విజయా డెయిరీని చంద్రబాబు తన స్వార్థం కోసం మూయించారు. దీనికి ప్రత్యామ్నాయంగా గుజరాత్ ఆనంద్ తరహా డెయిరీని సహకార రంగంలోనే రైతుల కోసం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ద్వారా చర్యలు చేపడతాం. కుప్పం, పలమనేరు, చంద్రగిరి నియోజకవర్గాల్లో ఏనుగుల దాడులను అరికట్టేందుకు కృషి చేస్తా. ఏనుగుల దాడుల్లో పంట, ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థికసాయం చేయటం కూడా ఒక ప్రధాన అంశంగా ముందుకెళ్తాం. పాకాలను మోడల్ రైల్వేస్టేషన్ జంక్షన్‌గా అభివృద్ధి చేస్తాం. కుప్పంలో నీటి సమస్య పరిష్కారానికి వైఎస్ చేపట్టిన పాలారు ప్రాజెక్టును పూర్తి చేయిస్తాం. మూడు ఫైఓవర్ల నిర్మాణానికి చర్యలు చేపడతాం.
రాజకీయాల్లోకి ఎలా వచ్చారు.
సామాన్యకిరణ్: చదువుకునే రోజుల్లోనే వామపక్ష సిద్దాంతాల పట్ల ఆకర్షితురాలినయ్యా. నా తెలుగు సాహ్యిత పరిశోధనలు కూడా అభ్యుదయ అంశాలకు సంబంధించినవే. అలా కొనసాగుతున్న క్రమంలో వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలకు ఆకర్షితురాలినై రాజకీయాల్లోకి వచ్చాను. ప్రతిపక్ష టీడీపీ, అధికార కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కు అయి జగన్‌ను వేధించి, ఆయనపై పన్నిన కుట్రలు చూసి చలించాను. ఆయనతో పాటు నడవాలని, మద్దతుగా పని చేయాలని నిర్ణయించుకున్నాను. 2013లో ఉద్యోగానికి రాజీనామా చేసి జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. జగన్ ఆదేశం మేరకు ఖమ్మం జిల్లా మధిర వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టాను. డెప్యూటీ స్పీకర్ భట్టివిక్రమార్కకు ధీటుగా పని చేశాను. చిత్తూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా పార్టీ ఆదేశించటంతో ఎన్నికల బరిలో దిగాను.
ప్రచారంలో కీలకంగా ప్రస్తావిస్తున్న అంశాలు
సామాన్యకిరణ్: పార్టీ అధ్యక్షులు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టో ఎప్పుడో జనంలోకి వెళ్లిపోయింది. 20 నుంచి 30 సంవత్సరాల పాటు జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా పని చేయబోతున్నారు. ఆయన వస్తేనే వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాలు అమలవుతాయి. ప్రజలకు మేలు జరుగుతుంది. చెప్పింది చేసే నిజాయితీ, విశ్వసనీయత జగన్‌లో ఉన్నాయనేది ప్రజలు నమ్ముతున్నారు. పార్టీ మేనిఫెస్టోలో జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలను, హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నాం. ఆయన తొలి సంతకంగా ప్రకటించిన అమ్మఒడి పథకానికి ఆడపడుచుల్లో అద్భుతమైన స్పందన వస్తోంది. దీని వల్ల పేదరికం, నిరుద్యోగాన్ని అత్యం త త్వరగా రూపుమాపవచ్చు. పిల్లలు చదువుకుని ఉద్యోగాల్లోకి వెళ్తారు. సమాజంలో నిరాదరణకు గురవుతున్న వర్గాలకు పింఛన్ పెంపు ఒక భరో సా. ధరల స్థిరీకరణ నిధితో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు వీలు కలుగుతుంది. ఇవన్నీ ప్రధానంగా ప్రస్తావిస్తూ, చిత్తూరు లోక్‌సభ పరిధిలో కూరగాయల సాగు, చెరకు, వేరుశనగ రైతులు, బెల్లం తయారీ రైతులకు భరోసా కల్పించే దిశగా ప్రచారం సాగిస్తున్నాము. జనం నుంచి స్పందన చాలా బాగుంది.