'ఆప్'సోపాలు!
ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్, బిజెపిల రాజకీయాలను సవాలు చేస్తానని తొడకొట్టి ముందుకొచ్చిన ఆప్ ఇప్పుడు ఆపసోపాలు పడుతోంది. పార్టీ ఏరి కోరి టికెట్ ఇచ్చిన నలుగురు క్యాండిడేట్లు చడీ చప్పుడూ లేకుండా పోలీ నుంచి తప్పుకున్నారు. వీరిలో ముగ్గురు రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్ కి చెందిన వారు. ఒకరు రాజస్థాన్ కి చెందిన వారు.
ఉత్తరప్రదేశ్ లోని ఎటా, ఆగ్రా, ఫరుఖాబాద్, రాజస్థాన్ లోని అజ్మీర్ లోని ఆప్ అభ్యర్థులు పోటీనుంచి తప్పుకున్నారు. ఫరూఖాబాద్ లో కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పై పోటీ చేస్తున్న ఆప్ అభ్యర్థి ముకుల్ త్రిపాఠీ పార్టీ నాకు సాయం చేయడం లేదని ఆరోపిస్తూ వైదొలిగారు. ఎటా నుంచి దిలీప్ యాదవ్, ఆగ్రా నుంచి రవీందర్ సింగ్, అజ్మీర్ నుంచి అజయ్ సోమానీలు కూడా ఇవే కారణాలు చెబుతూ పక్కకు తప్పుకున్నారు. వీరంతా పార్టీ టికెట్లు అమ్ముకుంటున్నారని, ఆవినీతి నిర్మూలనే ప్రధానాంశంగా తెరమీదికి వచ్చిన ఆప్ నిండా అవినీతే ఉందని ఆరోపించారు.
మరో వైపు మురాదాబాద్ నుంచి పోటీకి దిగిన ఖాలిద్ పర్వేజ్, అవధ్ కి చెందిన అరుణా సింగ్ లకు ముందు టికెట్లు ఇచ్చి, తరువాత వారు అవినీతి పరులని తేలడంతో ఆప్ నాలిక కరుచుకుంది. వారిద్దరి టికెట్లు రద్దు చేసింది. మొత్తం మీద 'ఆప్' సోపాలు కొనసాగుతున్నాయి.