ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఏప్రిల్ 30న జరిగిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పీఓ డైరీ, ఫారం -17 (ఎ), ఫారం 17(సీ) స్క్రూటిని పూర్తయినట్టు జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ప్రకటించారు. ఎన్నికలు ప్రశాంతవాతావరణంలో జరిగాయని తెలిపారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో నల్లగొండ పార్లమెంటరీ నియోవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి స్క్రూటిని అబ్వర్జర్లు, పోటీ చేసిన అభ్యర్థులు, వారి ప్రతినిధుల సమక్షంలో జిల్లాలో జరిగిన పోలింగ్‌సరళి, పోలింగ్ జరిగిన విధానాన్ని గురించి అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన విషయాలకు సంతృప్తి వ్యక్తం చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా జరిగాయని తెలిపారు.
పీఓ డైరీ, ఫారం -17 (ఎ), ఫారం 17(సీ) స్క్రూటిని చేయగా వాటిలో కూడా అన్ని సక్రమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు. జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ తన ఛాంబర్‌లో భునవగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 శాసనసభ నియోజవర్గాలకు సంబంధించి పీఓ డైరీ, ఫారం -17 (ఎ), ఫారం 17(సీ) స్క్రూటిని అబ్జర్వర్లు, పోటీ చేసిన అభ్యర్థులు వారి ప్రతినిధుల సమక్షంలో సమీక్ష చేశారు. జిల్లాలో జరిగిన పోలింగ్ సరళి, పోలింగ్ జరిగిన విధానాన్ని జేసీ అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు రోషన్ సుంకారియా, విద్యాసాగర్ ప్రసాద్, సంతోష్‌కుమార్ సారంగీ, దేవిప్రసాద్ పాండా, వివిధ పార్టీల నుంచి పోటీ చేసిన అభ్యర్థుల తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు.