జన ఉప్పెన
సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన జనపథం శనివారం జిల్లాలోని శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో కొనసాగింది. మూడో రోజు బండిఆత్మకూరులో ప్రారంభమైన పర్యటన సంతజూటూరు, వెలుగోడు, స్మృతివనం, నల్లకాలువ, ఆత్మకూరు, కరివేన, పాములపాడు, జూపాడుబంగ్లా, నందికొంట్కూరు. బ్రాహ్మణకొట్కూరు వరకు సాగింది.
ఆమె రాకతో పల్లెలు పులకించాయి. జై జగన్.. వైఎస్‌ఆర్ అమర్ రహే నినాదాలతో అభిమానులు స్వాగతం పలికారు. వెలుగోడు మండలం నుంచి భారీగా తరలివచ్చిన జనం ‘వచ్చెర.. వచ్చెర.. పులివెందుల పులి వచ్చెర’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్‌షోలో పాల్గొన్నారు.
వెలుగోడులో విజయమ్మకు ముస్లింలు సంప్రదాయ దుస్తులను బహుకరించారు. నమాజ్‌కు సమయం కావటంతో ఆమె ప్రసంగాన్ని త్వరగా ముగించుకున్నారు. దర్గా దాటే వరకు శబ్ధం చేయకుండా స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అనంతరం నేరుగా స్మృతివనానికి చేరుకుని మహానేతకు నివాళులర్పించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు. మహానేత మరణించిన ఆత్మకూరు ప్రాంతానికి చేరుకోగానే ఆమె దుఃఖాన్ని ఆపుకోలేకపోయారు.
ఆ నియోజకవర్గంలో ప్రతి చోటా గద్గద స్వరంతోనే ప్రసంగించారు. స్థానికులు సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ఆత్మకూరు బహిరంగ సభకు జనం పోటెత్తారు. అక్కడి నుంచి కరివేనకు చేరుకోగానే స్థానికులు గ్రామంలోకి రావాలని పట్టుబట్టారు. వారి కోరిక మన్నించి గ్రామానికి వెళ్లి విజయమ్మ.. జగన్ సీఎం అయ్యాక మరోసారి గ్రామానికి వచ్చి వైఎస్‌ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాములపాడు, జూపాడుబంగ్లా మధ్య దారిపొడవునా జనం బారులు తీరి అభివాదం చేశారు. ఆ తర్వాత నందికొట్కూరు చేరుకుని భారీ బహిరంగసభలో ప్రసంగించారు. చంద్రబాబు చీకటి పాలన, కిరణ్ అసమర్థ పాలనపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రం ముక్కలయ్యేందుకు వీరిద్దరే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ సువర్ణయుగం రావాలంటే వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. సభ ముగిసిన తర్వాత బొల్లవరం, బ్రాహ్మణకొట్కూరు, గార్గేయపురం మీదుగా కర్నూలుకు చేరుకున్నారు. కార్యక్రమంలో నంద్యాల ఎంపీ ఎస్పీవెరైడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరువెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరితారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త బుడ్డా రాజశేఖరరెడ్డి, బుడ్డా శేషారెడ్డి, నందికొట్కూరు శివానందరెడ్డి, మహిళా విభాగం నాయకురాలు అరుణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నేడు విజయమ్మ పర్యటన ఇలా..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నాలుగో రోజు ఆదివారం పర్యటన షెడ్యూల్‌ను జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి వెల్లడించారు.
ఉదయం 10.30 గంటలకు
డోన్‌లో రోడ్‌షో, బహిరంగ సభ
మధ్యాహ్నం 12.30 గంటలకు
గూడూరు రోడ్‌షో, బహిరంగ సభ
సాయంత్రం 3గంటలకు
ఎమ్మిగనూరు రోడ్‌షో, బహిరంగ సభ
సాయంత్రం 6 గంటలకు
ఆదోని రోడ్‌షో, బహిరంగ సభ