ఏమీ కోరని ప్రేమ | Eternal love between Dhanraj and Sirisha | Sakshi
Sakshi News home page

ఏమీ కోరని ప్రేమ

Published Wed, Aug 28 2013 1:26 AM | Last Updated on Mon, Aug 13 2018 4:19 PM

ఏమీ కోరని ప్రేమ - Sakshi

ఏమీ కోరని ప్రేమ

‘ఐ లవ్యూ’ చెప్పాడు ధన్‌రాజ్. చెప్పి, ‘హమ్మయ్య’ అనుకున్నాడు. శిరీష ఏమనుకున్నా సరే...
 చెప్పదలచుకున్నాడు, చెప్పాడు. రిలీఫ్.  ఇంటికెళ్లాడు. మిన్ను విరిగి మీద పడింది! ఎప్పట్లా అమ్మ ఎదుర్రాలేదు. దన్‌రాజ్ దగ్గర డబ్బుల్లేవు. ఇప్పుడు అమ్మ కూడా లేదు.నాన్న ఎప్పుడో పోయాడు. ఏం చూసి శిరీష లవ్ చేయాలి? ఏమీ చూడలేదు ఆ అమ్మాయి! అందుకే లవ్ చేసింది. అందుకే పెళ్లి కూడా చేసుకుంది. తర్వాత? తర్వాతేముందీ! ‘నా అంత ధనవంతుడు’ లేడని ధన్‌రాజ్...తనంత అదృష్టవంతురాలు లేదని శిరీష...‘మనసే జతగా...’ ఆరేళ్లుగా...
 
 సినిమాలు, టీవీ కార్యక్రమాల ద్వారా నవ్వుల జల్లులను నట్టింట్లో కురిపించే కమెడియన్ ధనాధన్ ధన్‌రాజ్. ఆ నవ్వుల వెనక దాగి ఉన్న విషాదాన్ని వెనక్కి నెట్టి, జీవితంలో ముందుకు సాగారు. ఆ అడుగులో జతగా కలిశారు శిరీష. ‘జీవితభాగస్వామి అందంలో కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో ఉంది దాంపత్యపు మధురిమ’ అని వివరించారు ఈ జంట. ఆరేళ్ల క్రితం తాము కలిసి వేసిన మొదటి అడుగు గురించి, ఆ తర్వాత జీవన ప్రయాణంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి, తమ జీవితాన్ని చక్కదిద్దుకున్న విధానం గురించి ఇలా వివరించారు.
 
 ముక్కుపుడకతో సహా..!- ధన్‌రాజ్
  ‘‘చేతిలో అర్ధరూపాయి కూడా లేని పరిస్థితిలో ఓ అమ్మాయికి నా ప్రేమను తెలియజేశాను. అమ్మ చనిపోయిన కష్టంలో ఉన్నప్పుడు నా గురించి ఏమీ తెలియని ఆ అమ్మాయే నన్ను ఆదుకుంది. ఆమే శిరీష.. నా అర్ధాంగి. నేను పుట్టిపెరిగింది తాడేపల్లి గూడెం. అమ్మానాన్నలది పెద్దలు కాదన్న ప్రేమ వివాహం. నా చిన్నప్పుడే నాన్న ఓ ప్రమాదంలో చనిపోవడంతో నన్ను పోషించడానికి అమ్మ చాలా కష్టపడింది. నాలోకం అంతా అమ్మే! టెన్త్ క్లాస్ వరకు చదివిన నేను సినిమాలో చేరుదామని హైదరాబాద్ వచ్చాను. నాతోపాటు అమ్మ. సినిమా ప్రయత్నాలు చేస్తూనే డ్యాన్స్ నేర్చుకున్నాను. పొట్టపోసుకోవడానికి మణికొండలో స్నేహితుల సాయంతో ఓ డ్యాన్స్ స్కూల్ ఏర్పాటు చేశాను. శాస్త్రీయ నృత్యం నేర్పించడానికి టీచర్‌గా అక్కడికి వచ్చింది శిరీష. మొదటి చూపులోనే ‘ప్రేమిస్తున్నాను’ అని చెప్పాను.
 
 చిరునవ్వు విసిరి వెళ్లిపోయింది. ఆ అనందకర సంఘటనను అమ్మకు చెబుదామని ఇంటికి వెళితే, అమ్మ చనిపోయి ఉంది. అన్నాళ్లూ నేను బాధపడతానని, క్యాన్సర్ ఉందన్న విషయం అమ్మ నాకు తెలియనివ్వలేదు. చివరిరోజుల్లో చెప్పినా, ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఒకేరోజు సంతోషం, విషాదం చవిచూశాను. దహనసంస్కారాలు చేయడానికి చేతిలో కానీ కూడా లేదు. స్నేహితులు అందుబాటులో లేరు. శిరీషకు ఫోన్ చేసి పరిస్థితి చెప్పాను. తన మెడలో గొలుసు, కాళ్ల పట్టీలు, గాజులు, ముక్కుపుడకతో సహా తీసి పంపించింది. వాటిని తాకట్టు పెట్టి అమ్మ కర్మ చేశాను. ‘కష్టంలో ఉన్నవారికి సాయపడే గుణం ఉందంటే శిరీషది ఎంతటి మంచిమనసో కదా!’ అనుకున్నాను. ఆ మరుసటిరోజే ‘ఎవరూ లేరని బాధపడకు, నీకు తోడుగా జీవితాంతం నేనుంటాను’ అని వచ్చింది శిరీష. మరేమీ ఆలోచించలేదు, మార్చి 5, 2008న పెద్దమ్మగుడిలో పెళ్లి చేసుకున్నాం.
 
 ఆలోచన లేకుండానే అండదండ... పెళ్లి చేసుకున్నాక అప్పుడు గుర్తొచ్చింది. శిరీష కుటుంబం ఏంటి? ఎక్కడుంటారు? వాళ్లు మమ్మల్ని అంగీకరిస్తారా? అని అడిగితే, ‘ఊరు ఖమ్మం, అమ్మానాన్న, ఐదుగురు అక్కచెల్లెళ్లు, తమ్ముడు. ఇంటర్మీడియెట్ చదివి, హైదరాబాద్‌లో ఉద్యోగం చూసుకోవడానికి ఫ్రెండ్స్‌తో కలిసి వచ్చాను’ అని చెప్పింది. శిరీష ఇంట్లోవారికి చెబితే తిట్టారు. మాకు కూతురే లేదన్నారు. ఆలోచించకుండా పెళ్లి చేసుకున్నాం. కాని నిలబెట్టుకున్నాం. అదే మా ఇద్దరి సంతోషం. మాకు ఓ బాబు, పేరు సుక్రామ్. వాడికి నాలుగేళ్లు. శిరీష నన్ను అర్థం చేసుకుని అండగా నిలబడింది కాబట్టే ఈరోజు నాకంటూ ఓ కుటుంబం ఏర్పడింది.
 మొదటి విమర్శ... నా నటనకు మొదటి విమర్శ శిరి నుంచే వస్తుంది. నేను ఏ సీన్ చేసినా ముందు మెచ్చుకోదు. అందులో మైనస్‌లేంటో మొహమాటం లేకుండా చెప్పేస్తుంది. అప్పుడు కోపంతో ఉడుక్కుంటాను. ‘నీకేం తెలుసు’ అంటాను. కాని ఆలోచించి చెక్ చేసుకుంటే ‘కరెక్టే చెప్పింది కదా!’ అనుకున్న సందర్భాలెన్నో!’’
 
  అమ్మకన్నా మిన్నగా..! - శిరీష
 ‘‘ధన్‌రాజ్ దగ్గర ధనం లేకపోవచ్చు. కాని మంచి మనసు ఉందని డ్యాన్స్ స్కూల్లోనే అర్థమైంది. అప్పటివరకు అమ్మే లోకంగా బతికిన వ్యక్తి. అమ్మను చూసుకున్నంత ప్రేమగా నన్ను చూసుకుంటాడన్న నమ్మకం కలిగింది. అందుకే తనకు తోడుగా ఉండాలని వెళ్లాను. అమ్మానాన్నలు ఎలాగూ కాదంటారని, ఈ విషయం ముందుగా వారికి చెప్పలేదు. తర్వాత తెలిసి బాధపడ్డారు. మమ్మల్ని చూశాక చాలా సంతోషించారు. ఇంట్లో ఉంటే ధన్‌రాజ్‌ని ‘అమ్మూ!’ అని పిలుస్తాను. తనూ నన్ను అలాగే పిలుస్తారు. నాకు పెద్దగా వంటలేమీ వచ్చేవి కావు. అమ్మూనే వంట చేసేవాడు. ఆరునెలల పాటు నా చేతులతో నేను తిన్నదే లేదు. మేం కష్టాన్ని ఇష్టంగా ఎదుర్కొన్నాం అంటే అది నా డెలివరీ టైమ్. మా పెళ్లయిన ఏడాదిన్నరకు బాబు పుట్టాడు. ఆ టైమ్‌లో అన్నీ నాకు అమ్మూనే అమ్మలా సేవలు చేశాడు. బాబు పుట్టాడని తెలిసి, అమ్మావాళ్లు వచ్చేశారు. అప్పుడంతా కలిసిపోయాం. ఇప్పుడు ధన్‌రాజ్ అంటే అమ్మనాన్నలకు గౌరవం. నేను తీసుకున్న నిర్ణయం సబబే అని మాతో ఉన్న కొన్నిరోజులకే వారికి పూర్తిగా అర్థమైంది.
 
 రూపాయి అవసరమైనా!
 మా మొదటి పెళ్లిరోజుకు కాళ్లకు పట్టీలు తెచ్చి నన్ను సర్‌ప్రైజ్ చేశారు ఈయన. అప్పటికి ఈయన దగ్గర అంత డబ్బు లేదు. నన్ను సంతోషపెట్టాలని తాపత్రయపడుతుంటారు. ఇప్పుడు ‘నేనిలా ఉండటానికి కారణం నువ్వే’ అంటూ వచ్చిన డబ్బును నా చేతిలో పెట్టేస్తారు. ‘ఎందుకలా?’ అని అడిగితే ‘నా చేతిలో డబ్బు ఉండదు. పొదుపు, పెట్టుబడులు నువ్వే చూసుకో! యాక్టింగ్ వరకు మాత్రమే నన్ను పరిమితం చెయ్యి!’ అంటారు. రూపాయి అవసరమైనా అడిగి తీసుకుంటారు. ఎలాంటి పరిస్థితుల్లో మేం ఒక్కటయ్యామో, ఇప్పుడు ఎలా ఉన్నామో, భవిష్యత్తులో ఎలా ఉండాలో చెబుతుంటారు. బాబుని బాగా చదివించాలని, డ్యాన్సర్‌ని చేయాలని మా కల.
 
 గొడవలు కూడా కామనే!
 వచ్చిన ప్రతిసినిమా చూసి తీరాల్సిందే అంటారు ఈయన. ఇతర నటుల నటనను చూసి, తన నటనలో మెరుగులు దిద్దుకోవడానికని తర్వాత తెలిసింది. అందుకే నాకు నచ్చకపోయినా సరే ఈయన కోసం సినిమాలకు వెళుతుంటాను. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా! అని గొడవలు లేకుండా ఏమీ ఉండవు. మా మధ్య చిన్న చిన్న గొడవలు మామూలే! ఒక్కోరోజు దెబ్బలాడుకొని మూడునాలుగు రోజులు మాట్లాడుకోకుండానూ ఉంటాం. మా బాబు వల్లనో, వచ్చే ఫోన్ల వల్లనో... మళ్లీ మాటల్లో పడిపోతాం.’’
 
 ‘‘జీవితభాగస్వామి మీద నమ్మకం ఉంటే గుడిసెలో అయినా బతకచ్చు, గుడిసె లేకపోయినా బతకవచ్చు’’ అని ధన్‌రాజ్ అంటే ‘‘ఆ నమ్మకమే మమ్మల్ని ఓ ఇంటివారిని చేసింది. జతగా కలిసి ఉండే అవకాశాన్నిచ్చింది’’ అని చెప్పారు శిరీష. నమ్మకంతో కలిసి అడుగువేసిన ఈ జంట ఆ నమ్మకమే జీవితమంతా తోడురావాలని జాగ్రత్తపడుతూ ముందుకు నడుస్తోంది.         
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement