అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా? | family health counciling | Sakshi
Sakshi News home page

అజీర్ణం... కడుపు ఉబ్బరం ఎందుకిలా?

Published Thu, Dec 14 2017 1:10 AM | Last Updated on Thu, Dec 14 2017 1:10 AM

family health counciling - Sakshi

హోమియో కౌన్సెలింగ్స్‌

నా వయసు 43 ఏళ్లు. తరచూ టూర్స్‌ చేస్తుంటాను. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్‌ అన్నారు. మందులు వాడుతున్నంత సేపు బాగానే ఉన్నా, అవి మానేస్తే మళ్లీ మామూలే. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా?
– సుధాకర్‌రావు, నల్లగొండ

ప్రస్తుత ఆధునికజీవనశైలిలో భాగంగా ఉరుకులు పరుగుల జీవితం గడపడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో చాలామంది గ్యాస్ట్రైటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్‌ పొర ఇన్‌ఫ్లమేషన్‌ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్‌ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్‌ గ్యాస్ట్రైటిస్‌ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్‌ లేదా పుండ్లుగా ఏర్పడతాయి.

కారణాలు: 20 నుంచి 50 శాతం అక్యూట్‌ గ్యాస్ట్రైటిస్‌ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్‌ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం ∙కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙కొన్ని జీర్ణకోశ వ్యాధులు (క్రౌన్స్‌ డిసీజ్‌), కొన్ని ఆటో ఇమ్యూన్‌

వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్‌ సమస్య కనిపిస్తుంది.
లక్షణాలు: కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్‌ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

నివారణ కోసం పాటించాల్సిన జాగ్రత్తలు: ∙సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి ∙పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ∙ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న రెండు గంటల తర్వాత నిద్రించాలి.

చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా గ్యాస్ట్రిక్‌ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్‌ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
హైదరాబాద్‌

బాబుకు ఆస్తమా... చికిత్స ఉందా?
మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు చలికాలం వచ్చింది కదా... ఎప్పుడు హాస్పిటల్‌లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు పూర్తి చికిత్స ఉందా? – సాయిప్రసాద్, విశాఖపట్నం
ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లమ్‌) ఎక్కువగా తయారవుతుంది. అది కూడా ఊపిరిని అడ్డుకుంటుంది.

కారణాలు: ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ పరిస్థితులు, చల్లగాలి ∙వైరస్‌లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్‌ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి రేణువులు ∙వంశపారంపర్యం మొదలైనవి.

లక్షణాలు: ∙ఆయాసం ∙దగ్గు రాత్రిపూట రావడం ∙గాలి తీసుకోవడం కష్టం కావడం;  పిల్లికూతలు ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం.

వ్యాధి నిర్ధారణ: ఎల్‌ఎఫ్‌టీ (లంగ్‌ ఫంక్షన్‌ టెస్ట్‌), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, కొన్ని రక్తపరీక్షలు.

చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపారంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్‌ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్‌ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్‌ ఆల్బ్‌ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు వాడితే హోమియో విధానం ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు.
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి,
ఎండీ (హోమియో), స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌

తిన్న వెంటనే... ఏమిటీ ఇబ్బంది?
నా వయసు 35 ఏళ్లు. మధ్యాన్నం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత మరొకటి కనిపిస్తున్నాయి. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. దయచేసి నా సమస్య ఏమిటో వివరించి, హోమియోలో చికిత్స చెప్పండి. – రమేశ్, మెదక్‌
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ (ఐబీఎస్‌)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సమస్యకు నిర్దిష్టమైన కారణం తెలియదు. అయితే... ∙జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌ వాడటం ∙జన్యుపరమైన కారణలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తుంటాయి. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్‌ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. ఐబీఎస్‌ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది.

దీని నిర్ధారణకు నిర్దిష్టమైన పరీక్ష అంటూ ఏదీ లేదు. కాకపోతే రోగి లక్షణాలను బట్టి, రోగి కడుపులో ఏవైనా పరాన్నజీవులు ఉన్నాయా లేదా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏవైనా ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా దీన్ని చాలా నిశిత పరిశీలనతో వ్యాధి నిర్ధారణ చేస్తారు. దాంతోపాటు మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్‌ బ్రీత్‌ టెస్ట్‌ వంటి పరీక్షలు ఈ వ్యాధి నిర్ధారణకు తోడ్పడతాయి.

వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు: ∙పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ∙ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
చికిత్స: ఇరిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌కు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. కాన్‌స్టిట్యూషనల్‌ సిమిలియమ్‌ ద్వారా చికిత్స చేసి, సమస్యను చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్,
పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement