ప్రతీకాత్మక చిత్రం
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ.. రోజువారీ జీవితం తీపి, చేదుల మిశ్రమంగానే కనిపించడం సహజం. ప్రపంచ పరిణామాలూ, దేశీయ ఘటనలు కూడా ఈ క్రమానికి అనుగుణంగానే సాగడం గమనార్హం. నూతన సంవత్సర ప్రారంభం నాటికి ప్రపంచంలో కొట్టొచ్చినట్లు కనిపించే విశేషం ఏమిటంటే సమస్యల రాజకీయాల స్థానంలో ఆకాంక్షల పరిష్కారాల దిశగా మార్పు కొట్టొచ్చినట్లు కనిపించడమే. 2019 సంవత్సరం హాంకాంగ్, లెబనాన్, సూడాన్ వంటి ప్రపంచ దేశాల్లోనూ, భారతదేశంలోనూ విద్యార్థుల తిరుగుబాటుకు సంకేతంగానే నిలించింది. హాంకాంగ్, లెబనాన్, చీలీ, కేటలోనియా, ఇరాక్, రష్యా వంటి పలు దేశాల్లో నగర వీధులు ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలతో దద్దరిల్లాయి. ముఖ్యంగా 10 నుంచి 16 ఏళ్ల లోపు వయసున్న పిల్లలు తమ తమ దేశ ప్రభుత్వాలపై తీవ్రనిరసనలతో వీధుల్లోకి రావడమే. ముఖ్యంగా చైనా ప్రభుత్వం తమపై మోపిన నిరంకుశ చట్టానికి వ్యతిరేకంగా హాంకాంగ్‌లో పసిపిల్లలు లక్షల సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. చీలీలో నిరసనలు వెల్లువెత్తడంతో ఆ దేశాధ్యక్షుడు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది.
ఇక 16 ఏళ్ల స్వీడన్ బాలిక గ్రేటా థన్ బెర్గ్.. వాతావరణ మార్పుపై ప్రపంచవ్యాప్తంగా చైతన్యం తీసుకొచ్చిన గొప్ప మార్పుకు నాందిపలికింది. లెబనాన్‌లో దశాబ్దాలుగా ఒంటెత్తు రాజకీయాలు నడుపుతున్న నాయకత్వంపై యువత ఆకస్మికంగా తిరుగుబాటు ప్రకటించింది. ఇక సూడాన్‌లో 22 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని ఎలా షలాహ్ జనసమూహంలో కారుపై నిల్చుని ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు, పాడిన పాటలు ప్రపంచవార్తగా మారాయి. భారత్ విషయానికి వస్తే ఢిల్లీలో విద్యార్థుల నిరసన ప్రదర్శనల దెబ్బకు మెట్రో, విమాన సర్వీసులను సైతం మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. టెక్నాలజీ ద్వారా ప్రజలకు సంక్రమించే సమాచారం ఎంతవేగంగా జన సమీకరణకు వీలుకల్పిస్తుందో అర్థమైన భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు సందర్భంలో కశ్మీర్ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను మూసివేసింది. ఇక రామ మందిర్ వివాదంపై శతాబ్దాల గొడవపై సుప్రీం కోర్టు తీర్పు ఇరుపక్షాల ప్రజల్లో ఆగ్రహావేశాలను కలిగించలేదు కానీ.. జాతీయ పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర పట్టిక రేపిన పెనుజ్వాలలు దేశాన్ని మండించాయి.
ప్రజల ఆకాంక్షల్ని పట్టించుకోకుండా చట్టసభల్లో మెజారిటీ ప్రాతిపదికన మొండిగా తీసుకొచ్చే చట్టాలు ప్రజామోదం పొందవని ఇవి నిరూపించాయి. కాగా, డిసెంబర్ 12న ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా యూనివర్శిటీ విద్యార్థినులు వణికించే చలిలో రాత్రిపూట కారుపై నిలబడి చేసిన నినాదాలు విశేష చర్చకు దారి తీశాయి. ఎన్నార్సీ మాకు వద్దు అంటూ తమిళనాడులో ముగ్గుల రూపంలో యువతులు చేసిన నిరనన నిరంకుశత్వంపై సృజనాత్మక పోరాటానికి దారితీసింది. సంప్రదాయకరమైన ముగ్గులను నిరసన తెలిపేమార్గంగా ఎంచుకున్న యువతులను అరెస్ట్ చేయవచ్చు.. ఆ రాష్ట్ర వ్యాప్తంగా 50 వేలమందిపై కేసులు పెట్టవచ్చు కానీ యువత తిరుగుబాటును చట్టాలు, అరెస్టులు అడ్డుకోలేవని ఈ పరిమాణం తేల్చి చెప్పింది.
ఏపీ ప్రభుత్వ దిశానిర్దేశం
నిర్భయ ఉదంతం తర్వాత హైదరాబాద్‌లో దిశ ఘటన మన జాతి చైతన్యాన్ని మరోసారి కదిలించి ప్రభుత్వాలను నిలదీసింది. వేలాది మంది యువతులు, విద్యార్థినులు దిశ ఘటన తర్వాత ఈ దేశంలో తాము బతకగలమా అంటూ ఢిల్లీలో, డజన్ల కొద్దీ నగరాల్లో చేసిన నిరసన ప్రదర్శనలు ప్రభుత్వాలనే కదిలించివేశాయి, ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వ తీసుకున్న అనూహ్య చర్య (దిశహంతకుల ఎన్‌కౌంటర్) కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ చరిత్రలో తొలిసారిగా మహిళల భద్రత పట్ల తీసుకొచ్చిన దిశా చట్టం కానీ.. యువత ఆకాంక్షలను పరిష్కరించే క్రమం మొదలైందని చాటి చెప్పాయి. చిన్నారులను లైంగిక వేధింపులకు గురిచేయడం లాంటి ఘటనలను తీవ్రంగా పరిగణించిన వైఎస్ జగన్ ప్రభుత్వం కఠిన చట్టం రూపకల్పనతో దిశానిర్దేశం చేసింది. 2019కి వీడ్కోలు చెబుతూ 2020కి స్వాగతం పలుకుతున్న సందర్భంగా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా ప్రభుత్వాలు మరింత క్రియాశీలంగా నడుచుకుంటాయని ఆశిద్దాం.
– కె. రాజశేఖరరాజు
Comments
Please login to add a commentAdd a comment