గొప్పోళ్లు.. స్లిప్పయ్యారు!
థీమ్.. త న న
మొన్న డిసెంబర్ 25న వాజపేయి బర్త్‌డేని, వాజపేయి తప్ప దేశమంతా జరుపుకుంది! 92వ బర్త్ డే అది. బి.జె.పి. నాయకులు కేక్ కట్ చేశారు. కొన్నిచోట్ల వాజపేయి చిత్రపటాన్ని ఉంచి ప్రసంగాలు ఇచ్చారు. వాజపేయి మాత్రం లైవ్‌లో ఎక్కడా కనిపించలేదు. నిజమే కొన్నాళ్లుగా భారత మాజీ ప్రధాని వాజపేయి బయటెక్కడా దర్శనం ఇవ్వడం లేదు. కొందరైతే ఆయన్ని దాదాపుగా మర్చిపోయినట్లున్నారు. మిగతా పార్టీవాళ్లకు మెమరీ లాస్ అయితే అయింది. ఆయన పార్టీవాళ్లకైనా ‘హి ఈజ్ దేర్’ అని గుర్తుండాలి కదా. మొన్న ఆలీఘర్ మేయర్ (బి.జె.పి) శకుంతల భారతి... వాజపేయి జన్మదిన వేడుకల్లో మాట్లాడుతూ, ‘ఆయన మన మధ్య లేకున్నా, ఆయన జ్ఞాపకాలు మనతో ఉన్నాయి’ అనేశారు! తర్వాత ఆమె చాలా ఫీలయ్యారు. పార్టీ కూడా ఫీలయింది.పొలిటీషియన్లు అనుకోకుండా ఇలా నోరుజారడం, అభాసుపాలు కావడం తరచు జరిగేదే. కొన్ని మాటలు కోపం తెప్పిస్తే, కొన్ని మాటలు నవ్వు తెప్పిస్తాయి. కొన్ని మాటలు మనోభావాలను గాయపరుస్తాయి. అలా నవ్వును, కోపాన్ని తెప్పించిన, ఆవేదనను కలిగించిన కొన్ని పొలిటికల్ స్టేట్‌మెంట్స్ మీ కోసం.
జీతాలు ఇంత తక్కువగా ఉంటే.. మోదీ మాత్రమైనా ప్రెసిడెంట్ ఒబామాను ఎలా ఫేస్ చెయ్యగలడు?
ఈయన పరిచయం అక్కర్లేదు కానీ ఇలాంటి మాటలు అన్నప్పుడే ‘ఇతడేనా ఇలా అన్నది’ అనే డౌట్ వస్తుంది. ఇంతకీ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఏ సందర్భంలో ఈ మాట అన్నారు? ‘ఎమ్మెల్యేల జీతాలు పెంచాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా పట్టించుకోరే..’ అని కేంద్రంపై చికాకు పడుతూ అన్నమాట ఇది.
స్వేచ్ఛ కోసం అంతగా పరి తపిస్తున్నప్పుడు వాళ్లెందుకు బట్టలు విప్పేసి రోడ్ల మీద తిరక్కూడదు?!
ఈయన మనోహర్ లాల్ ఖట్టార్. హరియాణా ముఖ్యమంత్రి. ఆడపిల్లలు స్వేచ్ఛగా, నిర్భయంగా తిరిగే పరిస్థితులు హరియాణాలో లేవు అనే ఆరోపణకు ఆయన ఉక్రోషంగా అన్నమాట. ఈయనే ముస్లింల గురించి ఇంకో మాట కూడా అన్నారు. గొడ్డు మాంసం తిననంత కాలం ముస్లింలు ఈ దేశంలో ఉండొచ్చట!
కట్నం, ప్రేమ వ్యవహారాలు, మగటిమి లేకపోవడం వల్లే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
ఈయన రాధామోహన్ సింగ్. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి. విన్నారుగా ఏం అన్నాడో! మనమందరం అనుకుంటున్నట్లుగా రైతుల ఆత్మహత్యలకు కారణం.. అప్పులు, గిట్టుబాటు కాని ధరలు, ప్రభుత్వ విధానాలు కాదన్నమాట!!!
బిగుతైన దుస్తులు, హైహీల్స్ ధరించడం వల్ల మహిళలకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పరిశోధనా ఫలితాలు వెల్లడిస్తున్నాయి. మన సంస్కృతికి, మన వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా స్త్రీలు తమ దుస్తులను ఎందుకు ఎంచుకోకూడదు?!
ఈయన రాజేశ్ లోయ. ఆర్.ఎస్.ఎస్. లీడర్. నాగపూర్ మహానగర్ సంఘచాలక్. మహిళలు సంప్రదాయ దుస్తులను మాత్రమే ఎందుకు ధరించాలన్న ప్రశ్నకు ఈయన ఇచ్చిన అనాలసిస్ ఇది!
వ్లాదిమిర్ పుతిన్ హిందువు.
చాలారోజుల తర్వాత మీరు పడీపడీ నవ్వారు కదా. ఈ మాట అన్నది సాద్వి ప్రాచి. అప్పుడే ఏమయిందీ? ఈ వి.హెచ్.పి. నాయకురాలు ఇంకా ఏమన్నారో చూడండి. పుతిన్ అసలు పేరు వారాహమిహిర పుత్ర్‌సింగ్ అట!
మోదీ ఈ దేశాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి నడుపుతున్నారు!
ఇంత గొప్ప స్టేట్‌మెంట్ ఇంకెవర్నుంచి వస్తుంది చెప్పండి? రాహుల్ జీ మీ ఉద్దేశం ఏమిటి? మోదీ తన ఇంటి నుంచి ఈ దేశాన్ని నడపాలనా?!
రాహుల్ మనకు వేసిన ఈ ప్రశ్నల్ని కూడా వినండి.
మోదీజీ ఎప్పుడైనా ఒక రైతుతో సెల్ఫీ దిగడం మీరు చూశారా?
మోదీజీ ఎప్పుడైనా ఒక కార్మికుడితో సెల్ఫీ దిగడం మీరు చూశారా?
మోదీజీ ఎప్పుడైనా ఒక నిరుద్యోగితో సెల్ఫీ దిగడం మీరు చూశారా?
నిజమే కదా! యు ఆర్ రైట్ రాహుల్ జీ. లీడర్ అంటే మీరే. మీరే. మీరే.
ప్రతి హైందవ మహిళా కనీసం నలుగురు పిల్లల్నైనా కనాలి.
ఈయన 21వ శతాబ్దపు బి.జె.పి. ఎంపీ సాక్షి మహరాజ్. ఈయన మాట 19వ శతాబ్దపు వజ్రాల మూట. మా నాయనే! మా మారాజే!
ఇద్దరు చేస్తే గ్యాంగ్ రేప్ కాదు. నలుగురైదుగురు చేస్తేనే అది గ్యాంగ్ రేప్.
ఈయన కర్ణాటక హోం మంత్రి కె.జె.జార్జి. ఇప్పుడు కాదులెండి. ప్రస్తుతం ఉన్నాడు కదా.. జి.పరమేశ్వర.. ఆయనకు ముందున్న మహనీయుడు. ఒక రేప్ ఘటనపై ప్రతిపక్షాల నోరు మూయించే ప్రయత్నంలో ఈయన ఇలా నోరు పారేసుకున్నారు. పరమేశ్వర కూడా తక్కువేం తిన్లేదు. మొన్న న్యూ ఇయర్ డే వేడుకల్లో ఆకతాయిల్ని వెనకేసుకొచ్చి మాట్లాడాడు. ‘అమ్మాయిలు వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని బయటికి వస్తే.. ఇదిగో... ఇలాగే ఉంటుంది’ అనేశాడు! అన్నట్లు కె.జె.జార్జి ఇప్పుడు టౌన్ ప్లానింగ్ శాఖను వెలగబెడుతున్నాడు.
కలామ్ స్పీచ్‌ని నేను మరువలేను. ఒక అవార్డు ఫంక్షన్‌లో ఆయన నన్ను ఎంతగానో పొగిడారు. అదింకా నా మెమరీలో సుడులు తిరుగుతూనే ఉంది.
ఈయన్ని గుర్తుపట్టగలరు కదా! డి.ఎం.కె. చీఫ్ ఎం.కరుణానిధి. కలామ్ ఈయన్ని పొగడకపోతే, కలామ్ ఈయనకు గుర్తుండేవారు కాదన్నమాట.
రాహుల్ గాంధీ బీఫ్ తింటాడు. తనను తను శుద్ధి చేసుకోకుండా ఆలయంలోకి వెళ్తాడు. అపవిత్రంగా అతడు కేదార్‌నాథ్ ఆలయ ప్రవేశం చేసిన కారణంగానే నేపాల్‌లో అంత పెద్ద భూకంపం వచ్చింది.
సాక్షి మహరాజ్, సాద్వి ప్రాచీ ఉమ్మడిగా కనిపెట్టిన సత్యం!