పాపన్న నడయాడిన కొండలు
పీడిత జనం విముక్తి కోసం పోరు చేస్తూనే... మొగల్ సామ్రాజ్యవాదులపై తిరుగుబావుటా ఎగురవేసిన వీరయోధుడు సర్ధార్ సర్వాయిపాపన్నగౌడ్. సామాన్య గీతకార్మికుడిగా ఓ పశువుల కాపరిగా జీవించిన ఆయన ఆనాటి బానిస సంకెళ్లను తెంచడం కోసం వీరోచిత పోరాటాలు చేసిన పరాక్రమవంతుడు. వరంగల్ జిల్లాలో పుట్టిన ఆయన అనేక కోటలు జయించి వీరుడుగా నిలిచాడు. క్రీ.శ1675 ప్రాంతంలో కరీంనగర్ జిల్లా వెన్కెపల్లి-సైదాపూర్ మండలంలోని సర్వాయిపేటలో తొలిసారిగా కోటలు నిర్మించాడు. ఇక్కడే 2వేల మందికి సైనిక శిక్షణ ఇచ్చాడు. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సర్వాయిపేట కోటతో పాటు కోటగిరి గుట్టల్లో ఉన్న కొత్త ఖిల్లా, పాతఖిల్లాలపై పాపన్న చరిత్రను తెలిపే అనేక ఆనవాళ్లు ఉన్నాయి. వందల ఎకరాలలో విస్తరించిన కొండల అందాలు అరకులోయలను తలపించే ప్రకృతి సోయగం ఈ ప్రాంతం సొంతం.
చూడాలనిపించే కట్టడాలు
బలిష్టమైన రాతి కట్టడాలు, 20 అడుగుల ఎత్తులో ఉన్న కోట ముఖ ద్వారం, 50 అడుగుల ఎత్తులో ఉన్న బురుజులు, కోట ద్వారానికి కుడివైపు రాతితో నిర్మించిన కోనేరు, కొత్త కిలపై కోనేరు, పాపన్న ఆరాధ్య దైవం బయ్యన్న విగ్రహం (ఎతై ్తన బండకు చెక్కిన శిలా విగ్రహం), పాపన్న ప్రియురాలు బుచ్చమ్మ అర్ర, కోట చుట్టూ రక్షణగా కందకాలు, కోట నుంచి గుట్టలకు రహస్య సొరంగాలు, గుట్టల చుట్టూ బలమైన రాతి గోడలు, లోనికి ప్రవేశించే ద్వారాలు, గుట్టలపై పాపన్న ఆడిన పచ్చీసలు, తహశీల్ బండ, పచ్చీసల బండ, దనంబండ, హన్మాన్ విగ్రహం, పోచమ్మగుడి, శివాలయం, సాకలి మడుగు, చేదబావి, నీటి కొలనులు, విశాలమైన మఠంగా పిలువబడే మైదానం, పాపన్న నాటిన చింతచెట్లు, పూజల కోసం నాటిన దేవగన్నేరు వక్షం... ఇలా ఒక్కటేమిటి ఆనాటి అనేక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి.
కోటగిరి గట్లు
సైదాపూర్, హుస్నాబాద్, బీమదేవరపల్లి, చిగురుమిడి మండలాలను ఆనుకుని ఎతై ్తన గుట్టలు వందల ఎకరాల విస్తీర్ణంలో కోటగిరిగట్లు ఉన్నాయి. పాపన్న ఈ గుట్టలపై కోటలు కట్టడంవల్ల కోటగిరిగట్లుగా పేరుకువచ్చాయి.
గుట్టల చుట్టూ బలమైన బండరాళ్ల రక్షణ గోడలు నిర్మించాడు. జారుడు బండల్లా ఉన్న గుట్టలపై ఎతై ్తన రాళ్లు ఎలాంటి మట్టి, సిమెంట్, డంగు సున్నంను ఉపయోగించకుండా నిర్మించడం నైపుణ్యతను చూపుతోంది. సింహద్వారాలు తప్పితే మరెక్కడి నుంచి ఎవ్వరూ లోనికి ప్రవేశించకుండా ఉండేలా ఈ గోడలు ఉన్నాయి.
చూసినికొద్దీ తనివితీరాలనిపించే ఈ చారిత్రక కట్టడాలు ఉన్న ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ది చేయాల్సిన అవసరముంది.
- కనుకుంట్ల కృష్ణహరి
వ్యాసకర్త, పాపన్న ఆస్తుల పరిరక్షణా కార్యకర్త