నేను మీ జుట్టుని | special story about hair and health tips | Sakshi
Sakshi News home page

నేను మీ జుట్టుని

Published Wed, May 11 2016 10:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:53 PM

నేను మీ జుట్టుని

నేను మీ జుట్టుని

మేము / నేను దాదాపు నిర్థకమైన అవయవాన్నే. పెద్ద పనేమీ చేయను. ఆనంద్ నాకు ఇచ్చే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. కానీ తన కీలక అవయవాల్లో దేనికి అనారోగ్యం కలిగినా ఎంత బాధపడతాడో... నేను అనవసరం అని తెలిసినా ఆనంద్ అంతే ఆందోళన చెందుతుంటాడు. నేను ఆనంద్ జుట్టును. మేము అని పిలిస్తే ఆనంద్ జుట్టును. నేను అంటే... ఆనంద్‌కు జుట్టులోని ఒకానొక కేశాన్ని. నేను రాలితే ఎంతగానో బాధపడిపోతాడు ఆనంద్. ఎంతో ఖర్చు పెడతాడు.

ఆనంద్ దేహంలో నేను కంటిపై ఉంటే కనుబొమల ఆకృతికి తగ్గట్లు చాలా పొట్టిగా ఉంటాను. అదే తలపై పొడవుగా పెరుగుతాను. ఆనంద్ జుట్టునైన నాలో దాదాపు లక్ష వెంట్రుకలు ఉంటాయి. అదే గడ్డంలో దాదాపు ముప్ఫైవేలు ఉంటాయి. తల, గడ్డంలోని రోమాలు వేగంగా పెరుగతాయి. నన్ను కట్ చేయకుండా అదేపనిగా పెంచితే గడ్డంలోనైతే 14 సెంటీమీటర్లు, తలమీదనైతే 12 సెంటీమీటర్ల పొడవు పెరుగుతాను.

నన్ను నేను రోజూ రాల్చుకుంటుంటాను...
నాలోంచి (జుట్టు నుంచి) రోజూ దాదాపు 75 కేశాలు రాలిపోతుంటాయి. దాదాపు రెండు నెలలు విశ్రాంతి తర్వాత మళ్లీ అవి పెరగడం ప్రారంభిస్తాయి. ఆనంద్ తలపై ఉండే జుట్టు ఎప్పటికప్పుడు కొత్తగా, ఫ్రెష్‌గా ఉండటానికి ఇలా జరుగుతుంది. ఆనంద్ చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నేను ‘నూగు’ (ఇంగ్లిష్‌లో వెల్లస్) అని పిలిచే చాలా మృదువైన జుట్టుగా ఉండేదాన్ని. ఆనంద్‌కు కొత్తగా మీసం మొలిచే సమయంలో ఇలాంటి మృదువైన జుట్టును గమనించవచ్చు. ఆ తర్వాత నేను కాస్త రఫ్‌గా మారిపోతాను. దీన్నే టెర్మినల్ హెయిర్ అంటారు. కానీ జుట్టును ఎప్పటికప్పుడు కొత్తగా చేసుకునే ప్రయత్నంలో భాగంగా టెర్మినల్ హెయిర్ అయిన నేను రాలుతూ నూగు వెంట్రుకలను పుట్టించుకుంటూ ఉంటాను. ఒకవేళ టెర్మినల్‌గా హెయిర్‌గా మారిన నేను మళ్లీ నూగు వెంట్రుకలుగా పుట్టకపోతే ఆ ప్రదేశంలో రోమాంకురం నుంచి రోమం పుట్టదు. ఇదే ప్రక్రియ అదేపనిగా జరిగితే ఆనంద్‌కు బట్టతల వస్తుంది. అయితే, ఆనంద్ భార్యకు బట్టతల రావడం అరుదు.

 వయసు పెరుగుతుంటే సన్నబడుతుంటా...
ఆనంద్ వయసు పెరుగుతున్న కొద్దీ అతడిలోని నా చుట్టుకొలత (డయామీటర్)  తగ్గుతుంటుంది. అంటే నేను సన్నబడిపోతుంటా. అంతేకాదు కాస్త నిడివి కూడా తగ్గుతుంటా. నాణ్యత కూడా ఒకింత తగ్గుతుంటుంది. నా ఫాలికిల్‌లో ప్రధానంగా చాలావరకు ప్రోటీన్ ఉంటుంది. నాకు కొంత సాగే గుణం ఉంటుంది. నేను చాలా సన్నగా ఉంటాను కాబట్టి మరీ  బలహీనం అని అపోహపడకండి. ఒక్కోసారి నేను గరిష్ఠంగా 90 గ్రాముల బరువునూ భరించగలను. నా ఫాలికిల్ చివరన ఉన్న సంక్లిష్టమైన కణాల్లో కొంత రంగునిచ్చే పదార్థం ఉంటుంది. దీనివల్ల ఆనంద్ జుట్టుకు ఉండాల్సిన రంగును ఈ సంక్లిష్ట కణాల్లోని కలరింగ్ మ్యాటర్, అది అక్కడ చిన్న చిన్న రేణువుల్లా (గ్రాన్యూల్స్)లా  వ్యాపించిన తీరు నిర్ణయిస్తాయి. అలాగే అక్కడి పిగ్మెంట్ ఉన్న తీరు వల్ల కూడా వెంట్రుకకు బ్రౌన్ లేదా నలుపు రంగు ఎరుపు లేదా పసుపు రంగు వచ్చేలా చేస్తుంటాయి.

ప్రతి ఫాలికిల్ చివర సబేషియస్ గ్లాండ్ అనే గ్రంథి ఉండి, దాని నుంచి కేశానికి వాటర్‌ప్రూఫింగ్ కలిగించేలా, కొవ్వులాంటి ఒక స్రావం విడుదల అవుతూ ఉంటుంది. వెంట్రుక మొదలులోని జీవకణాలు కింద నుంచి పెరుగుతూ ఉంటాయి. అవి అక్కడ పెరుగుతూ వెంట్రుకను పైకి తోస్తూ ఉంటాయి. దాంతో రోమం కింది వైపు నుంచి పై వైపునకు పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగే ప్రక్రియలో అది గట్టిబారుతుంది. ఇలా గట్టిబారే ప్రక్రియను కెరటినైజేషన్ అంటారు. కేశంలో ఉండే ఈ కెరటిన్ అనే పదార్థమే ఆవు కొమ్ముల్లో, బాతు ఈకల్లో, ఖడ్గమృగం కొమ్ములోనూ ఉంటుంది.

 వేర్వేరు చోట్లలో వేర్వేరు పెరుగుదల...
నేను ఆనంద్ దేహంపై ఉన్న స్థానాన్ని బట్టి నా పెరుగుదల కూడా వేరుగా ఉంటుంది. ఉదాహరణకు కనుబొమలు, కనురెప్పల వద్ద నా పెరుగుదల తక్కువ. అయితే అక్కడ షేవ్ చేసినప్పటికంటే వాటిని లాగేస్తే మరింత వేగంగా పెరుగుతాను. ఇక మీసంలో నా పెరుగుదల కనుబొమల కంటే కాస్త వేగంగా జరుగుతుంది.

మా ఫాలికిల్స్‌లోని అడ్డుకోత (క్రాస్‌సెక్షన్)లోని నిర్మాణాన్ని బట్టి జట్టులోని మా కేశాలు నిటారుగా పెరగడమో లేదా అలలు అలలుగా ఉండటమో లేదా రింగులుగా తిరగడమో చేస్తాయి. అడ్డుకోత నిర్మాణంలో మేము ఇలా గుండ్రం (రౌండ్)గానో లేదా అండాకారం (ఓవల్ షేప్)లోనో లేదా బల్లపరుపు (ఫ్లాటెన్‌డ్)గానో... ఇలా ఈ మూడు ఆకృతుల్లో ఏదో ఒక రకంగా ఉంటాం. అడ్డుకోత నిర్మాణంలో మేము గుండ్రంగా ఉంటే వాళ్ల జుట్టు నిటారుగా స్ట్రెయిట్‌గా పెరుగుతుంది. మేం అండాకరంలో ఉంటే అలలు అలలుగా (వేవీగా) పెరుగుతుంది. ఇక బల్లపరుపుగా ఉంటే రింగులు తిరుగుతుంది. ఇదే నిర్మాణం కేశం పొడవునా ఒకేలా కాకుండా కాస్తంత వేర్వేరుగానూ మారవచ్చు. అందుకే కొన్నిసార్లు కొంత మేర స్ట్రెయిట్‌గా పెరిగినా... ఆ తర్వాత రింగులు తిరుగుతుంటాను.

నా నిర్మాణమూ ఆసక్తిదాయకం...
నేను (రోమం) మొలిచే చోట ఒక సెంటీమీటరులో నాలుగో వంతు భాగం... చర్మంలోని సెరియమ్ అనే భాగంలో కూరుకుపోయి ఉంటుంది.  ఈ సెరియమ్ అనే భాగం  ఎపిడర్మిస్ అనే చర్మపు పొర కింద ఉంటుంది. దీనిలో రక్తపు సరఫరాతో పాటు నరాలూ ఉంటాయి. ఈ భాగాన్ని ఫాలికిల్ అంటారు. ఈ భాగంలో నేను నా పొడవును పెంచుకునే ఫ్యాక్టరీలా పనిచేస్తుంటాను. ఆ పనిని రోజులో 24 గంటల పాటు ఏడేళ్లు కొనసాగిస్తాను. ఏడేళ్ల తర్వాతే ఫ్యాక్టరీలోని ఆ భాగానికి విశ్రాంతిని ఇస్తాను. అందుకే అప్పటివరకూ నేను పెరుగుతూనే ఉంటాను. ఏడేళ్ల తర్వాత నేను కాస్త వ్యవధి ఇచ్చి రాలిపోతాను. మళ్లీ నా అంకురం నుంచి పెరగడం మొదలు పెడతాను. ఫాలికిల్ భాగంలో రక్తసరఫరా, నరాలు ఉంటాయి కాబట్టి నన్ను పట్టి లాగితే నొప్పిగా ఉంటుంది. కానీ మిగతా కేశ భాగంలో రక్తసరఫరా, నరాలు ఉండవు. కాబట్టి కట్ చేసినా నొప్పి ఉండదు.

ఒక వయసు తర్వాత తెల్లబడటం మామూలే...
ఇప్పుడు ఆనంద్ వయసు 47 ఏళ్లు. ఇక అతడి జుట్టులో కొన్ని కేశాలు తెల్లబడటం మామూలే. నా అంకురంలో ఉండే రంగును ఇచ్చే పదార్థాల ఉత్పాదన తగ్గుతూ పోవడమే ఆనంద్ జుట్టు తెల్లబడటానికి కారణం. ఒక విధంగా చెప్పాలంటే... జుట్టు అనే మేము ఆనంద్ ఆరోగ్యాన్ని కూడా రికార్డు చేస్తూ ఉంటాం అని కూడా చెప్పవచ్చు. ఆనంద్ ఆహారంలో చాలా కొద్ది భాగాన్నే తీసుకునే మేము... అతడిలోని పోషకాల లోపాన్ని తెలియపరుస్తాం. ఇప్పుడు ఉన్న మోటారు వాహనాలు వెలువరించే కాలుష్యంతో ఆనంద్ చుట్టూ ఉండే వాతావరణంలో లెడ్ ఎక్కువైతే అది మాలోనూ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒకవేళ ఆనంద్ వద్ద అతడి తాతగారికి సంబంధించిన జట్టు ఉంటే... దాన్ని ఆనంద్ జుట్టుతో పోల్చితే అతడి కేశాల్లో లెడ్ ఎంతగా పెరిగిందో చెప్పేయవచ్చు. ఇక ఒకవేళ ఆనంద్ తీసుకునే టీలో ఆర్సెనిక్ అనే విషం కలిసిందనుకోండి... మంచి కెమిస్ట్ మమ్మల్ని పరిశీలిస్తే ఆ విషయం వెంటనే తెలిసిపోతుంది.

అవన్నీ అపోహలే...
మా (జుట్టు) గురించి చాలా అపోహలే ఉన్నాయి. మేం చనిపోయాక కూడా పెరుగుతామన్నది అందులో ఒకటి. అది అబద్ధం. ఇక షేవ్ చేసుకుంటే మేం మరింత  దట్టంగా పెరుగుతామన్నది మరో అపోహ. అందుకే ఆనంద్ భార్య తన కాళ్లపై ఉండే మమ్మల్ని షేవ్ చేసుకోడానికి వెనకాడుతుంది. కానీ ఇదీ నిజం కాదు.

మేమూ డయాగ్నోజ్ పరీక్షలకు సహాయం చేస్తాం...
ఆనంద్ రక్త పరీక్ష, మూత్రపరీక్ష లాగే జుట్టు పరీక్ష చేయించాడనుకోండి. అతడి ఆరోగ్య సమస్యలు కొన్నింటిని మేమూ నిర్ధారణ (డయాగ్నోజ్) చేయగలం. మమ్మల్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌లోగానీ, ఎక్స్-రే ద్వారా గాని పరిశీలిస్తే ఆనంద్‌కు ఉన్న జన్యుపరమైన జబ్బులనూ చెప్పగలం. స్కార్లెట్ ఫీవర్ వంటి తీవ్రమైన జ్వరం, నిమోనియా వస్తే మేం రాలిపోతాం.

మాకూ ఎన్నో జబ్బులు...
ఆనంద్ ఇతర అవయవాల్లాగే మాకూ ఎన్నో జబ్బులు వస్తాయి. మా ఫాలికిల్స్‌లో ఒక్కోసారి చిన్న గడ్డలు (ట్యూమర్స్) రావచ్చు. కొందరిలో ఫంగస్‌కు సంబంధించిన జబ్బులూ (రింగ్ వార్మ్ ఇన్ఫెక్షన్) రావచ్చు. ఇక ‘విటమిన్-ఏ’  ను ఎక్కువ మోతాదులో తీసుకుంటే మేం రాలిపోవచ్చు. మా మీద వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లూ దాడి చేస్తాయి. కొందరిలో ప్యాచ్‌లు... ప్యాచ్‌ల్లాగా ఉండే బట్టతల రావచ్చు. అలోపేషియా ఏరేటా అని పిలిచే ఈ బట్టతల ఎందుకు వస్తుందో ఇంకా తెలియదు. కొందరు వంశపారంపర్యంగా వస్తుందంటారు.

ఆ టైమ్‌లో పలుచబడతాం...
ఆనంద్ యుక్తవయసుకు రాగానే అతడిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్రవిస్తుంది. దాంతో తలపై హెయిర్‌లైన్ వెనక్కుపోతుంటుంది. అలాగే ఆనంద్ భార్యలోనూ గర్భధారణ సమయంలో, ఆ తర్వాత ఆమెలో స్రవించే హార్మోన్లు మా పెరుగుదలపై ప్రభావం చూపుతాయి. ఆనంద్ భార్య గర్భం దాల్చినప్పుడు ఆమె తలపై మేం దట్టంగా ఉన్నా... ప్రసవం తర్వాత ఆమె తల కాస్త పలచబారుతున్నట్లు ఆనంద్ భార్య గుర్తిస్తుంది. అయితే ఆమె భయపడాల్సిందేమీ లేదు. ప్రసవం అయిన కొన్నాళ్ల తర్వాత ఆమెలోని హార్మోన్ల పాళ్లు చక్కబడ్డ తర్వాత మేం మళ్లీ దట్టంగానే పెరుగుతాం. సాధారణంగా ఆనంద్ భార్యలో ఒత్తిడి పెరిగినప్పుడు స్రవించే పురుష హార్మోన్ కొద్దిపాళ్లలోనే ఉంటుంది. అయితే ఒకవేళ ఆమెలో పురుష హార్మోన్ల పాళ్లు పెరిగితే మాత్రం అది మా పెరుగుదలపై దుష్ర్పభావం చూపుతుంది.

 మమ్మల్ని సంరక్షించుకోవడం ఎలా...?
మా కుదుళ్లలో దుమ్ము పేరుకోకుండా, బ్యాక్టీరియా చేరుకోకుండా జాగ్రత్త పడాలి. ఇందుకోసం వారానికి రెండుసార్లు షాంపూ చేసుకోవడం మేలు. మేం మరీ ఎక్కువగా ఎండకు ఎక్స్‌పోజ్ కాకుండా చూసుకోవాలి. అదే జరిగితే మేం పెళుసుబారిపోతాం. ఉప్పునీళ్లు, క్లోరినేటెడ్ నీళ్లలో ఈదకుండా జాగ్రత్త పడాలి.
మేం ఆరోగ్యంగా ఉండాలంటే... ముందు ఆనంద్ ఆరోగ్యంగా ఉండాలి. అతడి ఆరోగ్యమే మాకు మహా భాగ్యం.
- డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ ,
చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్,
గచ్చిబౌలి, హైదరాబాద్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement