మత్స్యకన్యను చూడాలనుకుంటున్నారా?
నెట్‌ఇంట్లో
సగం శరీరం చేపలా, సగం శరీరం మనిషిలా ఉండే జలకన్య మెర్మెయిడ్ అంటే పాశ్చాత్యులకు పిచ్చి. ఉందో లేదో కాని, ఆమె చుట్టూ కథలను అల్లుకున్నారు. కబుర్లు చెప్పుకున్నారు. సాహసవీరుడు, సాగరకన్య లాంటి కథలను పంచుకున్నారు. అలాంటి మెర్మెయిడ్ వాస్తవ వీడియో మా దగ్గర ఉందహో అని ఎవరయినా చెబితే ఇక హడావిడి ఆగుతుందా? సముద్రం ఒడ్డున జలకన్య సేద తీరుతున్న వీడియో చూడండహో అంటే చూడకుండా ఉంటారా? ఆ వీడియోను నవంబర్ 24న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసీ చేయగానే 3.12 కోట్ల మంది చూసేశారు. షేర్లు చేసేశారు. వీడియో పూర్తయ్యేసరికి వాళ్లంతా ఖంగుతిన్నారు. ఎందుకో ఊహించగలరా? వీడియో చివర సముద్రాల్ని మనం కాపాడుకోకపోతే జంతువులన్నీ ఇదిగో ఈ మెర్మెయిడ్‌లా కాల్పనిక లోకంలోనే ఉంటాయి అన్న పర్యావరణ సందేశం వస్తుంది. ఒక్క నిమిషం ఆశాభంగమై కోపం వచ్చినా, ఆ వెను వెంటనే వాతావరణ మార్పులపై అవగాహనా వస్తుంది.
శివరామ్ లైక్స్ సైనా నెహ్వాల్!!
ఆయనది ఆ దరి. ఈమెది ఈ దరి. ట్విట్టరమ్మ కలిపింది ఇద్దరిని. అయితే ఇది ఓ స్టార్ ప్లేయర్ పట్ల ఓ పరమ వీర ఫ్యాన్ ప్రేమ. అనగనగా ఓ శివరామ్ శర్మ. ఆయనకి సైనా నెహ్వాల్ అంటే వెర్రి అభిమానం. ఆమె ఏ భంగిమలో ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే అదే భంగిమలో తన ఫొటోలను పోస్ట్ చేసేవాడు. కొన్నేళ్లుగా మనోడి గాలి ముద్దుల్ని ఆమె రాకెట్‌తో అవతలి కోర్టుకు పంపించేస్తోంది. బాడ్మింటన్ కాక్ తప్ప మరేదీ కనిపించని సైనాకి ఈ అభిమాని అస్సలు కనిపించలేదు. అలాంటిది ఓ స్పోర్ట్స్ మ్యాగజైన్ ఒక ట్విట్టర్ కాంటెస్ట్‌ను ఏర్పాటు చేసింది. విజేతలకు సైనాను ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం కల్పించింది. ఆ కాంటెస్ట్‌లో శివరామ్ శర్మ గెలిచాడు. అదిగో అలా ఛాన్స్ వచ్చింది శర్మకు. సైనాను దుబాయ్ వెళ్లి కలిసి, పూలగుత్తిని బహూకరించి, ఓ సెల్ఫీ దిగి మరీ వచ్చాడు. సైనా సెల్ఫీ దిగింది. శర్మకు మాత్రం మత్తు ఇంకా దిగలేదు.
పరమచెత్త ఫ్యాషన్ ట్రెండ్స్!!
2015లో పరమచెత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఏమిటి? బజ్ ఫీడ్ అనే వెబ్‌సైట్ ఓ జాబితాను విడుదల చేసింది. బబుల్ నెయిల్స్, మెరిసిపోయే గడ్డాలు, చంకల్లో మెరుపులు అద్దుకోవడం, తలకాయపై చిన్న మొక్కల్ని లేదా రెండాకుల్ని ఫిక్స్ చేసుకోవడం, జుత్తును తివాచీలా పడుగూ పేకల్లా అల్లేయడం (హెయిర్ టాపెస్ట్రీ), టై అండ్ డై హెయిర్ స్టయిల్, రిజల్యూషన్ తక్కువగా ఉన్న ఫొటో పిక్సెలేట్ అయినట్టు పిక్సెల్ హెయిర్‌ని పెంచుకోవడం, జుత్తుపై టాటూలు వేయించుకోవడం, తలపై ఆకు రూపంలో పెయింట్ వేయించుకోవడం, పెదిమల్ని వాచిపోయేలా చేసుకోవడం.. దాని కోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయడం - ఇవీ ఆ పరమచెత్త ఫ్యాషన్ ట్రెండ్స్. కనీసం వచ్చే ఏడాది ఇలా చేయకండి బాబూ అని మరీ ఆ వెబ్‌సైట్ కొత్తొక వింత అని వేలంవెర్రిగా ఫాలో అయ్యేవాళ్లని వేడుకుంటోంది.
కూర్పు: కె. రాకా సుధాకరరావు www.sakshipost.com