వారాహీమాత ఆలయం
అరుదైన శాక్తేయ ఆలయాల్లో ఒకటైన వారాహీమాత ఆలయం ఒడిశాలోని పూరీ జిల్లా చౌరాసి గ్రామంలో ఉంది. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో సోమవంశ రాజులు నిర్మించిన ఈ ఆలయం కళింగ శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నేటికీ నిలిచి ఉంది. రెండు ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో వెలసిన ఈ ఆలయం ఎత్తు 15 మీటర్లకు పైబడే ఉంటుంది. లలితాసన భంగిమలో కనిపించే వారాహీమాతను స్థానికులు మత్స్యవారాహిగా ఆరాధిస్తారు. వరాహ ముఖంతో కుడిచేత మత్స్యం, ఎడమచేత కుంభం ధరించి కనిపించే వారాహిమాత మూలవిరాట్టు ఉగ్రరూపంలో కనిపిస్తుంది.
తాంత్రిక పద్ధతిలో ఇక్కడ రోజువారీ పూజలు చేస్తారు. అలాగే అమ్మవారికి అనుదినం చేపలను నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే, పూరీలోని శ్రీజగన్నాథ ఆలయంలో రోజూ జరిగే మహానైవేద్యాలను ఈ ఆలయానికి పంపడం తరతరాలుగా ఆచారంగా కొనసాగుతుండటం విశేషం. వారాహీమాత వెలసిన చౌరాసి గ్రామం సుప్రసిద్ధ సూర్యక్షేత్రం కోణార్క్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ వరకు అన్ని ప్రాంతాల నుంచి విమాన, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడకు రోడ్డు మార్గంలో రావాల్సి ఉంటుంది.