జ్ఞాపకం.. కళకాలం
జీవితంలో దారి తప్పిన మధుర జ్ఞాపకాలు.. కలకాలం గుర్తుండిపోతే ఎంత బాగుంటుంది. మనసు పొరల్లో దాక్కున్న స్పందనలు ప్రతిరోజూ సాక్షాత్కరిస్తే ఎంత హాయిగా ఉంటుంది. అలాంటి అనుభవాలనే పంచుతోంది ఇమ్‌ప్రింట్స్. గడచిపోయిన క్షణాలకు ఛాయ.. ఫొటో అయితే, అనుభూతులకు స్వచ్ఛమైన రూపం..
ఇమ్‌ప్రింట్స్!
ఇమ్‌ప్రింట్స్.. ఇప్పుడు నగరంలో నయాట్రెండ్. కన్నబిడ్డలకు అపూర్వ కానుక ఇవ్వాలనుకుంటున్న తల్లిందండ్రులకు ఈ కళ ఒక వరం. ఇమ్‌ప్రింట్స్‌తో ఎన్నేళ్లయినా మీ మధుర స్మృతులు కళాత్మకంగా మిమ్మల్ని స్పృశిస్తాయి. ఆ చిట్టి చేతుల ముద్రలను తాకితే.. ఎప్పుడో పొట్టి చేతులు మీ బుగ్గ నిమిరిన జ్ఞాపకాన్ని నెమరువేసుకోవచ్చు. చిట్టి పాదాల ఆనవాళ్లు ముట్టుకుంటే.. మీ గుండెలపై ఒకనాడవి చేసిన బాలతాండవం అనుభవంలోకి వస్తుంది. మీ గారాల పట్టి కొనగోటి ఆనవాళ్లు.. మీకు కోటి రూకల నకళ్లవుతాయి.
కదిలే కాలానికి సంకెళ్లు
గతంలో పుత్రోత్సాహం కలిగిన త ల్లిదండ్రులు వారి ఆనందాన్ని పదిమందితో పంచుకునేవారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చిట్టితల్లి రూపాన్ని క్లిక్ మనిపించేవారు. కొత్తదనం కోరుకునే తల్లిదండ్రులు ప్రతి నెలా పిల్లల ఫొటోలు తీసి.. మొదటి పుట్టిన రోజు వేడుకలో తమ అంశ ఇలా.. ఇలా.. ఎదిగిపోయిందంటూ అన్ని ఫొటోలతో ఫ్లెకీ ్స వేయిస్తుంటారు. ఇప్పుడు.. ఇమ్‌ప్రింట్స్ వాటన్నింటినీ మించిపోతోంది. తల్లిదండ్రులకు, పిల్లలకు చెప్పలేని తీపి జ్ఞాపకాలు బహుమతిగా ఇస్తోంది.
అపు‘రూప కళ’యిక
మీ చిన్నారుల చిట్టి చేతులను, పొట్టి పాదాలను క్లేలో అద్దించి.. వాటికి ప్రతిరూపాలు తయారు చేయడమే ఇమ్‌ప్రింట్స్ ప్రత్యేకత. 2డీ, 3డీ రూపంలో వీటిని రూపొందిస్తున్నారు. క్లేలో అద్దడం ద్వారా 2డీ ఆనవాళ్లు చిరస్థాయిగా నిలబడితే.. 3డీలో అయితే అన్ని కోణాల్లోనూ చూసుకునే అవకాశం ఉంటుంది. బుడతల హస్త, పాద ముద్రలే కాదు.. ఏ వయసువారైనా ఈ కళతో వారి చేతులు, పాదాలను కళాత్మక రూపంలో చూసుకోవచ్చు. గ ర్భిణీ స్త్రీలు సైతం నెలల వారీగా శరీరంలో జరుగుతున్న పరిణామాలను ఇమ్‌ప్రింట్స్ ద్వారా అపురూపంగా దాచుకుంటున్నారు.
అనుబంధాలకు ఆనవాళ్లు
ఈ విధానంలో మొదట అర చే తులు, పాదాలు శుభ్రం చేస్తారు. తర్వాత క్లేలో అద్దుతారు. ఐదు నుంచి పది నిమిషాల్లో క్లే ఎండిపోయి రూపం స్పష్టంగా ఏర్పడుతుంది. దానిని అందమైన ఫొటో ఫ్రేమ్‌లో బంధిస్తే మీ ఆనవాళ్లు అలా నిలిచిపోతాయి. ఇక 3డీలో అరచేతులకు, పాదాలకు నమూనాలు తీసుకుని వాటికి కాస్టింగ్ ద్వారా తుది రూపాన్ని ఇస్తారు. చేతులు, పాదాలకు వ్యాజిలిన్ రాసి, కాస్త వెచ్చగా ఉన్న ప్లాస్టర్ స్లిప్‌లను పొరలుగా చుడతారు. అవి పొడిగా మారడానికి ఓ ఐదు నిమిషాల సమయం పడుతుంది. తర్వాత వాటిని జాగ్రత్తగా విడదీసి, ఆ నమూనాలకు కాంక్రీట్, ప్లాస్టర్, కే ్ల, డెంటల్ వైట్ సిమెంట్ అప్లై చేసి.. అనుకున్న రూపం తీసుకువస్తారు. తర్వాత ముద్రలకు అందమైన రంగులద్ది.. మరింత అందంగా ఆవిష్కరిస్తారు.
ఎప్పటికీ నిలిచిపోతాయి
గతంలోని తీపి జ్ఞాపకాలను ఎక్కడో మరచిపోకుండా జాగ్రత్త చేసేదే ఇమ్‌ప్రింట్స్ ఆర్ట్. ఈ ఆర్ట్‌లో ఎలాంటి హానీ చేయని ఎకో ఫ్రెండ్లీ ముడి సరుకునే వాడతాం. పైగా నమూనాలు తీసుకునేటప్పుడు ఎలాంటి బాధ ఉండదు. గర్భిణిలు కూడా ఈ విధానంపై ఆసక్తి కనబరుస్తున్నారు. నెలల వారీగా కాస్టింగ్ ద్వారా ఆనవాళ్లు దాచుకుంటున్నారు. తమ శరీరంలో జరుగుతున్న పరిణామాలను ప్రత్యక్షంగా చూసుకోవడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఇమ్‌ప్రింట్స్ ద్వారా అరుదైన బహుమతి అందించే అవకాశం లభిస్తుంది.
- భాను, హ్యాపీ ఇమ్‌ప్రింట్స్
- శిరీష చల్లపల్లి