కమలిని కవిత్వం
సెలబస్
‘‘యమునాతీరం... సంధ్యారాగం’’ అంటూ ‘ఆనంద్’ సినిమాలో ఆడిపాడిన కమలినీ ముఖర్జీ అందరికీ అభిమాన నటి అయ్యింది. ‘‘వచ్చే వచ్చే వానజల్లుల్లారా’’ అంటూ ‘గోదావరి’ నీళ్లల్లో పడవ మీద తుళ్లిపడుతూ అందరినీ అలరించింది. ఆమెలో ఎంత గొప్ప నటి ఉందో ప్రతి ప్రేక్షకుడూ చెబుతాడు. కానీ ఆమెలో ఎంత మంచి కవయిత్రి ఉందో, ఆమె కలం ఎంత చక్కటి కవితలను లిఖించగలదో మాత్రం ఎవరికీ తెలియదు. హావభావాలతో ఆకట్టుకునే కమలిని అక్షరాలతో మనసులను ఎలా పెనవేయగలదో తెలుసుకోవాలంటే... ఇదిగో, ఆమె రాసిన ఈ కవిత చదివితే సరి!
ఇది నా తొలి కవిత. ఎప్పుడు రాశానో, ఎందుకు రాశానో, ఎలా రాశానో కూడా నాకు గుర్తు లేదు. ఇప్పుడా కవితని చదువుతుంటే... ఎప్పుడో రాత్రివేళ, రకరకాల ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో రాశానేమో అనిపిస్తుంది. అప్పుడు నేను ఏ మూడ్‌లో ఉన్నానో తెలియదు... బహుశా మౌనంగా, ప్రశాంతంగా, ఏవేవో ఊహల్లో తేలియాడుతూ ఉండి ఉంటాననిపిస్తోంది. ప్రేమలో పడినప్పుడు ఇలా ఉంటారని అంటారు కదూ! ప్రేమలో పడ్డానని కాదుగానీ... ఆ క్షణంలో ప్రేమ గురించిన తలపుల్లో మునకలు వేస్తూ ఉండి ఉంటానేమో!
- కమలినీ ముఖర్జీ
తలపులు
నీలి రంగు పులుముకున్న ఆకాశంకేసి నిశితంగా చూస్తున్నాను.
సన్నగా వీస్తోన్న పిల్ల తెమ్మెరలను ఆస్వాదిస్తున్నాను.
దూరం నుంచి వినిపిస్తోన్న సాగరపు ఉచ్ఛ్వాస, నిశ్వాసల్ని ఆలకిస్తూ ....
భ్రాంతిపూరితమైన నా భావనలను నేను తరచి చూసుకుంటున్నాను.
హాయియైన ఆ భ్రమను, భావనలను అలాగే నిలిపి ఉంచేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నాను.
చామంతి పూపానుపుపై పవళించి... నీ తలపుల మత్తులో తూగుతున్నాను.
నువ్వు నా హృదయాన్ని పూర్తిగా ఆక్రమించేశావు.
దాని స్పందనలన్నింటినీ నువ్వే నిర్దేశిస్తున్నావు.
నేను ఎడారిలో ఎండమావి కోసం గానీ వెతుకుతున్నానా...? తెలియదు.
కానీ శిశిరం తరువాత వచ్చే వసంతం కోసం ఎదురు చూడకుండా ఉండలేను కదా!
అదేమిటో... అల్పమైన వాటిలో కూడా అందమైన విషయాలను గుర్తిస్తున్నాను.
లేత గులాబీరంగు అద్దాల గుండా చూసి జీవితాన్ని వర్ణచిత్రంగా భావిస్తున్నానా అని సందేహం కలుగుతోంది.
అందుకే ఆ అనుభూతిలో ఉండగా ఒక్కసారి ఉలిక్కిపడి నన్ను నేను ప్రశ్నించుకుంటాను... ఒక వేళ నేను స్వప్నంలో గానీ జీవిస్తున్నానా అని!!!
(కమలినీ ముఖర్జీ రాసిన
‘థాట్స్’ అనే ఆంగ్ల కవితకి
స్వేచ్ఛానువాదం)