అధికార పార్టీకి దీటుగా వ్యూహం
♦ గ్రేటర్ ప్రచారానికి జాతీయ నేతలు
♦ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పని విభజన
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌కు దీటుగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. టీపీసీసీ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేయడం, జాతీయ నేతలను ప్రచారంలోకి దించడం, నియోజకవర్గాల వారీగా టీపీసీసీ బాధ్యులను నియమించడం, ప్రతీరోజు డివిజన్ల వారీగా సమన్వయం, పర్యవేక్షణ వంటివాటితో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. టీపీసీసీ సమన్వయకమిటీలోనే చర్చించి నిర్ణయం తీసుకోవడం వల్ల ముఠా కుమ్ములాటలు బహిరంగంగా కనిపించడం లేదని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు 100 డివిజన్లలో సీరియస్‌గా పోటీచేస్తున్నారని, వీటిలో 70-80 స్థానాల్లో అభ్యర్థులు గట్టిపోటీ ఇస్తున్నట్లు టీపీసీసీ అంచనా వేస్తోంది.
వీటిలోనూ గెలుపునకు దగ్గరగా ఉన్న డివిజన్లను గుర్తించి పనిచేయాలని భావిస్తోంది. అయితే శివారులోని డివిజన్లలో నియోజకవర్గ ఇన్‌చార్జీలు అభ్యర్థుల ఎంపికలో పొరపాట్లు చేసినట్టు టీపీసీసీకి ఫిర్యాదులు వచ్చాయి. అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థులకు లాభం కలిగేలా కొందరు ఇన్‌చార్జీలు లోపాయికారీగా సహకరించినట్లు ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించి, లోపాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలను నివేదించడానికి పార్టీ సీనియర్లకు బాధ్యతలను అప్పగించినట్టు తెలుస్తోంది. ప్రచార వ్యూహాన్ని ఖరారుచేయడానికి టీపీసీసీ స్థాయిలో ఒక ప్రచార కమిటీని ఏర్పాటుచేసింది. ఏఐసీసీ కార్యదర్శి వి.హనుమంతరావు నేతృత్వంలో 15 మంది సీనియర్లతో ఈ కమిటీని నియమించింది. డివిజన్ల వారీగా ప్రచార వ్యూహాన్ని ఈ కమిటీ ఇప్పటికే ఖరారుచేసింది. ఎన్నికల ప్రచారానికి ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్ తదితరులను హైదరాబాద్‌కు రప్పిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ముఖ్యనేతలు మల్లు భట్టివిక్రమార్క, కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఇప్పటికే ప్రచారంలో తలమునకలయ్యారు.