సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ సంక్షేమ, అభివృద్ధి కారకమైనదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఇది చిన్న బడ్జెట్ అని, ఇందులో వివిధ శాఖ లు, పథకాలకు చేసిన కేటాయింపులు తాత్కాలికమేనని, వాటిని తరువాత సవరిస్తామని తెలిపారు. పదేళ్ల తర్వాత ఆర్థిక మంత్రిగా బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టాక అసెంబ్లీ సెంట్రల్ హాల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి పథకానికి వంద శాతం నిధులు కేటాయించామని తాము చెప్పటంలేదన్నారు. నూతన రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చును కేంద్రం భరిస్తామన్నందునే తాము నిధులు కేటాయించలేదని చెప్పారు.