రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో కదలిక
♦ నడికుడి-శ్రీకాళహస్తి భూ సేకరణకు రాష్ట్రం రూ.193 కోట్ల కేటాయింపు
♦ కోటిపల్లి-ముక్తేశ్వరం వంతెన నిర్మాణానికి రైల్వే శాఖ సర్వే
♦ ప్రత్యేక రైళ్ల మంజూరుకు కేంద్రానికి ఏపీ వినతి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటా ప్రాతిపదికన చేపట్టే రైల్వే ప్రాజెక్టుల్లో కదలిక వచ్చింది. రైల్వే లైన్లకు సంబంధించి సర్వేలు పూర్తి కావడంతో బడ్జెట్‌లో కేంద్రం కేటాయించిన నిధులతో పనులు ప్రారంభించనున్నారు. ఈ అరకొర నిధులతో దశల వారీగా పనులు చేపట్టడానికి అటు రైల్వే శాఖ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాయి. వాటా ప్రాజెక్టులకు అవసరమైన భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాల్సి ఉండటంతో ఇందుకు అవసరమైన నిధుల్ని ఆయా జిల్లాలకు కేటాయిస్తున్నారు.
నడికుడి-శ్రీకాళహస్తికి నిధులు
నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్‌కు 2010-11 సంవత్సరంలో రైల్వే శాఖ ఓకే చెప్పింది. ప్రాజెక్టు వ్యయం మొత్తం రూ. 1,314 కోట్లు కాగా, ఇందులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో పాటు భూ సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలి. ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ. 90 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు రాష్ట్రం భూ సేకరణకు గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో రూ. 289 కోట్లు మంజూరు చేసింది. తాజాగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భూ సేకరణకు రూ. 193 కోట్లు కేటాయించింది. మొత్తం 309 కి.మీ. మేర రైల్వే మార్గానికి గుంటూరు జిల్లాలో 30 కి.మీ. పనులు ప్రారంభమయ్యాయి. దీనికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. వంద కోట్లు కేటాయించింది.
కోటిపల్లి వంతెనకు శ్రీకారం
2000-01 సంవత్సరంలో రూ. 695 కోట్ల అంచనాతో కోటిపల్లి-నర్సాపురం ప్రాజెక్టు మంజూరు చేసింది. ఈ రైల్వే బడ్జెట్‌లో కేంద్రం రూ. 200 కోట్లు కేటాయించింది. ఈ మార్గంలో మూడు చోట్ల గోదావరిపై వంతెనలు నిర్మించాల్సి ఉంది. మొదటగా కోటిపల్లి-ముక్తేశ్వరం మధ్య రైల్వే వంతెన నిర్మించేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. మే మొదటి వారంలో పనులు ప్రారంభానికి సమాయత్తమవుతోంది.రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభుత్వం కలసి వాటా ప్రాతిపదికగా చేపడుతున్న మొత్తం 12 ప్రాజెక్టుల్లో మిగిలిన రైల్వే ప్రాజెక్టులను బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా చేపట్టనున్నట్లు రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కొత్త రైళ్లు, పుష్కర పనులకు వినతి
జూన్ నుంచి ఉద్యోగులను రాజధానికి తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగ సంఘాలు హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతానికి వారాంతం, వారం ప్రారంభంలో ప్రత్యేక రైళ్లను నడపాలని కోరాయి. దీనికి అనుగుణంగా హైదరాబాద్ నుంచి విజయవాడకు రెండు రైళ్లు నడపాలని ప్రభుత్వం రైల్వే శాఖకు లేఖ రాసింది. పుష్కరాలకు గాను ప్రత్యేక రైళ్లతో పాటు రైల్వే పనులకు నిధులు కేటాయించాలని కోరింది.