రోజా, కొడాలి నానీలపై చర్యలు తీసుకోవాలి
అధికారపక్ష సభ్యులను మందలించాలి
♦ భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి
♦ స్పీకర్‌కు మండలి బుద్ధ ప్రసాద్ కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: సభ సజావుగా జరగకుండా ఆటంకం కలిగిస్తూ శాసనసభలో ప్రతిపక్షంపై పదేపదే వ్యాఖ్యలు చేస్తున్న అధికారపక్ష సభ్యులను తీవ్రంగా మందలించాల్సిందిగా మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలోని కమిటీ స్పీకర్‌కు సూచించింది. సభా మర్యాదకు భంగం కలిగేలా వ్యవహరించిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆర్‌కే రోజా, కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని పేర్కొంది. భవిష్యత్‌లో సభలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కె.శ్రీధర్‌రెడ్డిలను హెచ్చరించాలని నివేదికలో పొందుపరిచారు. గతేడాది డిసెంబర్ 22న శాసనసభ జీరో అవర్‌లో జరిగిన చర్చ, వీడియో ఫుటేజీ లీకేజ్ తదితర అంశాలపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు.. ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఛైర్మన్‌గా, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తెనాలి శ్రావణ్‌కుమార్, పి.విష్ణుకుమార్ రాజు సభ్యులుగా కమిటీని నియమించారు. ఈ కమిటీ తన నివేదికను స్పీకర్‌కు అందజేసింది.
ఆయన ఈ నివేదికను ప్రివిలేజ్ కమిటీకి పంపారు. మంగళవారం జరిగిన ప్రివిలేజ్ కమిటీలో అప్పటికప్పుడు నివేదికను అందజేసి, చర్చ చేపట్టాలని ఇన్‌చార్జి కార్యదర్శి కె.సత్యానారయణ ప్రయత్నించారు. దీన్ని వైఎస్సార్‌సీపీ సభ్యులు అడ్డుకున్నారు. నివేదికను తాము అధ్యయనం చేసిన తరువాతనే చర్చించాలని సూచించారు. దీంతో సభ్యులకు నివేదికను అందచేశారు. మండలి బుద్ధప్రసాద్ కమిటీ నివేదికలోని అంశాలు ఇలా ఉన్నాయి.
ప్రతిపక్షం తప్పులను ఎత్తి చూపేందుకే వీడియో క్లిప్పింగ్‌లు ఉపయోగపడేలా ఉన్నాయని, అధికారపక్షం సభ్యులు చేసిన వ్యాఖ్యలను కూడా కమిటీ పరిశీలించాలని గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు. వీడియో క్లిప్పింగ్‌ల లీకేజీకి సంబంధించి సైబర్ క్రైం పోలీసులతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సభ జరిగే సమయంలో వీడియో రికార్డింగ్, ప్రత్యక్ష ప్రసారాలు బహిర్గతం కాకుండా ఉండేందుకు సమగ్ర వ్యవస్థను రూపొందించాలని కమిటీ సూచించింది. కమిటీ చేసిన కొన్ని సిఫార్సులను గడికోట శ్రీకాంత్‌రెడ్డి వ్యతిరేకించారు. రోజాపై సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని కోరారు. ప్రతిపక్ష నేతపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండించిన కొడాలి నానీపై చర్యకు సిఫార్సు చేశారని, ఆ వ్యాఖ్యలు చేసిన అచ్చెన్నాయుడుపై కూడా చర్యకు సిఫార్సు చేసి ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు.