జీవో 130 ప్రకారమే భర్తీ చేయండి..
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: అన్‌ఎయిడెడ్ మైనారిటీ వైద్య విద్యా సంస్థల్లో మెడికల్, డెంటల్ కోర్సులకు సంబంధించిన కన్వీనర్ కోటా (ఏ), యాజమాన్య కోటా (బీ), ప్రవాస భారతీయ కోటా (సీ) సీట్లను గత ఏడాది జారీ చేసిన జీవో 130 ప్రకారమే భర్తీ చేయాలని ఉమ్మడి హైకోర్టు సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ రజనీతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. కన్వీనర్ కోటా సీట్లను తగ్గిస్తూ, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా ఫీజులను గణనీయంగా పెంచడంపై ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. యాజమాన్య కోటా సీట్లను తగ్గిస్తూ, బీ, సీ కేటగిరీల ఫీజులను పెంచుతూ జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ బషీరుద్దీన్ సిద్దిఖీ, మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
ఏకపక్షంగా జీవోలు...
పిటిషనర్ల తరఫు న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏ కేటగిరీ సీట్ల తగ్గింపు, బీ, సీ కేటగిరీ సీట్ల పెంపు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు కూడా ఈ జీవోల వల్ల యాజమాన్యపు కోటా సీట్లను ఎంపిక చేసుకోవాల్సిన దుస్థితి కలుగుతోందన్నారు. గత ఏడాది జారీ చేసిన జీవో 130 ప్రకారం మొత్తం సీట్లలో 60 శాతం సీట్లను యాజమాన్యపు కోటా కింద భర్తీ చేసి, మిగిలిన 40 శాతం సీట్లను బీ,సీ కేటగిరీ కింద భర్తీ చేసే వారన్నారు. ఇప్పుడు తీసుకొచ్చిన జీవోల ప్రకారం కన్వీనర్ కోటా సీట్లను 60 శాతం నుంచి 50 శాతానికి తగ్గించిందన్నారు.
అలాగే యాజమాన్య కోటా సీట్లను 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారని ఆమె తెలిపారు. అంతేకాక బీ కేటగిరీ ఫీజును ఎంబీబీఎస్ కోర్సుకు రూ.11.55 లక్షలు, బీడీఎస్ కోర్సుకు రూ.4.2 లక్షలుగా నిర్ణయించిందన్నారు. అలాగే సీ కేటగిరీ ఫీజును రూ.23.10 లక్షలు, బీడీఎస్ కోర్సుకు రూ.5.25 లక్షలుగా ఖరారు చేసిందని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం జీవో 130 ప్రకారమే సీట్లు భర్తీ చేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.