ఎంచుకున్న దిశలో వీచిన పవనం
నొప్పించకుండా... నిలదీయకుండా.. జనసేనాని ప్రసంగం
* చంద్రబాబు వైఫల్యాలు, అవినీతిపై గప్‌చుప్
* వాగ్దానభంగంపై వీసమెత్తు విమర్శలేదు..
* ప్రత్యేకహోదా కోసం పోరాడకపోవడంపై ప్రశ్నల్లేవ్..
* జాగ్రత్తగా తయారైన స్క్రిప్ట్ బాగా చదివారంటున్న విశ్లేషకులు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు జరిగిన రెండున్నరేళ్ల తర్వాత జనసేన అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ జనం ముందుకు రానుండడంతో హామీలు నెరవేర్చని అధికారపక్షాన్ని ప్రశ్నిస్తారని, అవినీతి, వైఫల్యాలపై నిలదీస్తారని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. రాష్ర్టప్రభుత్వ నిష్క్రియాపరత్వంపై గర్జిస్తారని అనుకున్నారు.
అయితే ప్రత్యేక హోదాపై ఎక్కువసేపు మాట్లాడిన పవన్ కల్యాణ్ ఎవరెవరిపైనో విరుచుకుపడడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ర్టంలో పూర్తిగా అడుగంటిపోయిన కాంగ్రెస్ పార్టీపై విమర్శలకే సింహభాగం కేటాయించడం, నిజంగా కేంద్రంపై పోరాడి సాధించాల్సిన చంద్రబాబు పాత్రను పూర్తిగా విస్మరించడం విశేషం. ఉమ్మడిగా పోటీచేసి కేంద్రంలో అధికారం అనుభవి స్తున్న చంద్రబాబు నాయుడిని మాత్రం పవన్‌కల్యాణ్ పల్లెత్తుమాట కూడా అనకపోవడం ఆశ్చర్యకరమని రాజకీయ విశ్లేషకులంటున్నారు.
మొత్తంగా పవన్ కల్యాణ్ ప్రసంగం అత్యంత జాగ్రత్తగా తయారుచేసిన స్క్రిప్ట్‌ను తలపించిందని, తడబడుతూ... తనపైనే సెటైర్లు వేసుకుంటూ... అడపాదడపా ఎవరెవరిపైనో అకస్మాత్తుగా గర్జిస్తూ పవన్ తన ప్రసంగాన్ని బాగానే రక్తికట్టించారని పరిశీలకులంటున్నారు.
అసలు ముద్దాయిని వదిలేసి...
పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చకుండా మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రప్రభుత్వాన్ని నిలదీయాల్సిందెవరు? ఎన్నికల ముందు ప్రధాన మంత్రి అభ్యర్థిని, పవన్ కల్యాణ్‌ను పక్కనపెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌కి కనీసం పదిహేనేళ్లయినా ప్రత్యేకహోదా అవసరమని, అది తెచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడును పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో మాటమాత్రంగా కూడా నిలదీయలేదు. బాధ్యత మరచి.. ప్రజలకిచ్చిన వాగ్దానాన్ని భంగపరుస్తూ స్వీయ రాజకీయ ప్రయోజనాల కోసం ఐదుకోట్ల మంది ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రిని నిలదీయడానికి పవన్ కల్యాణ్‌కు మాటలే దొరకకపోవడం ఆశ్చర్యకరమని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎన్నికల సభల్లో ప్రత్యేకహోదా సాధిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబునాయుడు గద్దెనెక్కగానే అదే ప్రత్యేకహోదా అవసరం లేదంటూ, అదేమైనా సంజీవనా అంటూ... అనేక సందర్భాలలో రకరకాల వ్యాఖ్యానాలు చేసినా పవన్‌కల్యాణ్ స్పందించలేదు. రెండున్నరేళ్ల తర్వాత ప్రజల ముందుకొస్తున్న సందర్భంగా కనీసం ఇపుడైనా చంద్రబాబు తీరుపై పవన్ కల్యాణ్ స్పందిస్తారని ఆశించినవారికి నిరాశ తప్పలేదు. ప్రత్యేకహోదాపై పిల్లిమొగ్గలు వేయడమే కాదు మేనిఫెస్టోలోని హామీలన్నిటినీ చంద్రబాబు అటకెక్కించారు.
చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా చూసే బాధ్యత తనది అని ఎన్నికల సభల్లో ప్రజలకు వాగ్దానం చేసిన పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో ఆ హామీల ప్రస్తావనే తీసుకురాకపోవడం విస్మయపరుస్తున్నదని విశ్లేషకులంటున్నారు. పాలకులకు తగినంత సమయం ఇచ్చానని, అందుకే రెండున్నరేళ్ల వరకు వేచి చూశానని పవన్ చెప్పడం కూడా హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. ఎందుకంటే అది తక్కువ సమయమేమీ కాదని, సగం పాలనా కాలం కరిగిపోయినట్లేనని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
రాజధాని పేరుతో జరుగుతున్న అంతర్జాతీయ స్థాయి కుంభకోణాలపైన గానీ, సదావర్తి సత్రం భూములను సర్కారుపెద్దలే కైంకర్యం చేయడం వంటి దిగజారుడు వ్యవహారాలపైన గానీ పవన్ ఎన్నడూ స్పందించిందే లేదు. కనీసం ఈ సందర్భంగానైనా వాటిని ప్రస్తావించి.. నిలదీయాలని ఆయనకు అనిపించకపోవడం విస్మయపరుస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. అత్యంత చాకచక్యంగా.. సుతిమెత్తగా ప్రసంగాన్ని సాగించిన పవన్ ఒకదశలో చంద్రబాబు చాలా కష్టపడుతున్నారని, ఇంకా బాగా చేయాలని వ్యాఖ్యానించడం పట్ల సభకు వచ్చిన యువకులు ఆశ్చర్యపోవడం కనిపించింది.
ప్రత్యేకహోదాపై పోరాడుతున్నదెవరు?
ప్రత్యేక హోదాపై ఇపుడు పోరాటం ప్రారంభిద్దామని పవన్ కల్యాణ్ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ సీని యర్‌నేత ఒకరు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై పోరాడడం కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ కలసి రావాలనడం కూడా విస్మయపరుస్తోందని ఆయన పేర్కొన్నారు. రెండున్నరేళ్లు గాఢనిద్రలో ఉన్న పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకహోదాపై వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటాలు ఏవీ తెలియకపోవడం సహజమేనని మరో ముఖ్యనేత వ్యాఖ్యానించారు.
పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలో ధర్నా చేయడం, గుంటూరులో ఆమరణదీక్ష చేయడం, ముఖ్యపట్టణాలలో యువభేరి సదస్సులు నిర్వహిస్తూ యువతలో చైతన్యం నింపడం, రాష్ర్టపతి, ప్రధానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించడం, పార్టీ ఎంపీలు పార్లమెంటులోనూ, వెలుపలా పోరాడడం వంటివాటిని ఆయన గుర్తు చేశారు. ప్రత్యేకహోదా కోసం నిరంతరాయంగా పోరాడుతున్న ఏకైకపార్టీ వైఎస్సార్సీపీయేనని ఆయన స్పష్టంచేశారు. ప్రజలపక్షాన చేస్తున్న తమ పోరాటం ఇక ముందుకూడా అవిశ్రాంతంగా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రత్యేకహోదా గురించి పవన్‌కల్యాణ్ మాట్లాడడం స్వాగతించే పరిణామమని ఆయన అభిప్రాయపడ్డారు.
జాగ్రత్తగా తయారుచేసిన స్క్రిప్ట్..
ముందుగా పకడ్బందీగా సిద్ధం చేసుకున్న ప్రతిని చూస్తూ పవన్ అత్యంత జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడారని, అపుడపుడు ఉద్వేగభరితంగా కొన్ని వ్యాఖ్యలు చేసినా తాను అనుకున్నది అనుకున్నట్లు చెప్పారని పరిశీల కులంటున్నారు. ప్రత్యేకహోదాపై ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఉధృత పోరాటాలతో ప్రజ లలో భావోద్వేగాలు పెరగడం, పార్లమెంటులోనూ చర్చనీయాంశం కావడం, దేశం దృష్టిని ఆకర్షించడంతో పవన్ రంగంలోకి దిగారని (దింపారని) విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రభుత్వంపై పెరుగుతున్న ప్రజావ్యతిరేకత దారిమళ్లకుండా మిత్రపక్షమైన జనసేన సొమ్ముచేసుకుంటే భవిష్యత్‌లో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వపెద్దలే పవన్‌ను రంగంలో దించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబునాయుడిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. బీజేపీపైనా, మోడీపైనా, వెంకయ్యనాయుడిపైన, అశోకగజపతిరాజుపైన ఏవో కొన్ని ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేసినా అసలు దోషి అయిన తెలుగుదేశం అధినేతనుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి.