వైద్య పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు
వైద్య పోస్టుల భర్తీకి మెడికల్ బోర్డు
Published Tue, May 30 2017 3:32 AM | Last Updated on Tue, Sep 5 2017 12:17 PM
తమిళనాడు తరహాలో ఏర్పాటు చేయాలని యోచన
సాక్షి, హైదరాబాద్: వైద్య పోస్టుల భర్తీకి తమిళనాడు తరహాలో మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ యోచిస్తోంది. దీనికి సీఎం ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది. వైద్యులు, నర్సులు, ఫార్మసిస్టులు, టెక్నీషియన్లు సహా ఇతర పారా మెడిక ల్ సిబ్బందినంతా ఈ బోర్డు ద్వారానే నియమిస్తారు. బోర్డును స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థగా ఏర్పాటు చేస్తారు. దీనికి అదనపు కార్యదర్శి హోదాగల ఐఏఎస్ అధికారిని చైర్మన్‌గా నియమించవచ్చు. దాంతోపాటు జాయింట్ డైరెక్టర్ హోదా అధికారి సభ్యుడిగా, డీఆర్‌వో కేడర్ అధికారి సభ్య కార్యదర్శి గా ఉంటారు. అనుబంధంగా పరిపాలనా అధికారి, సూపరింటెండెంట్ సహా ఇతర సిబ్బంది ఉంటారు.
టీఎస్‌పీఎస్సీ విఫలమైనందునే...
ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో అనేక పథకాలు అమలు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని నిర్ణయిం చింది. గర్భిణులకు రూ.12వేలు ఇవ్వనున్నారు. ఈ పథకం వచ్చే నెల 3న ప్రారంభం కానుంది. అలాగే హైదరాబాద్‌లో కొత్తగా మూడు నిమ్స్ స్థాయి ఆసుపత్రులను నెలకొల్పాలని నిర్ణయించింది. ఒక్కో ఆసుపత్రికి రూ. 500 కోట్లు ఖర్చచేయనుంది. ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, జర్నలిస్టుల నగదు రహిత చికిత్సలకు పథకాలను అమలు చేస్తోంది. ఇన్ని కార్యక్రమాలు రూపొందిస్తున్నా.. ఖాళీ వైద్య పోస్టుల భర్తీ జరగలేదు.
పలు దఫాలుగా విన్నవించినా..
వైద్య ఆరోగ్యశాఖ గత డిసెంబర్‌లో 2,118 వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీకి విజ్ఞప్తి చేసింది. అలాగే వైద్య విద్య సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి పరిధిలోని బోధనాసుపత్రులకు 1,099 వైద్య సిబ్బంది పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వాటిని కూడా టీఎస్‌పీఎస్సీకి అప్పగించారు. ఇలా పలు దఫాలుగా పోస్టుల భర్తీకి విన్నవించినా ఇప్పటికీ టీఎస్‌పీఎస్సీ అందులో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. దీంతో సొంతంగా రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ యోచిస్తోంది.
ఆటోమెటిక్‌గా క్రమబద్ధీకరణ...
బోర్డును ఏర్పాటు చేస్తే కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసే పోస్టులు కూడా మూడేళ్లలో ఆటోమెటిక్‌గా క్రమబద్ధీకరణ అయ్యేలా చేయాలని యోచిస్తున్నారు. బోర్డు ఏర్పాటుకు ముందు ఈ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేయాలని యోచిస్తున్నారు.
Advertisement