‘రియల్’కు బూమ్
♦ స్థిరాస్తి రంగానికి సర్కారు కానుకలు
♦ లేఅవుట్లలో పేదలకు ‘వాటా’ రద్దు
♦ ఆకాశ హర్మ్యాలకు ప్రోత్సాహం
♦ జీహెచ్‌ఎంసీ పరిధిలో సీడీఏ చార్జీలు తొలగింపు
♦ సెట్‌బ్యాక్, అంతస్తుల పరిమితి సడలింపు
♦ 23 అంశాలపై కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్థిరాస్తి రంగం అభివృద్ధికి మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర భవన నిర్మాణ నియమావళిలోని పలు నిబంధనలను సడలించింది. భారీ మొత్తం లో రాయితీలూ ప్రకటించింది. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. స్థిరాస్తి రంగం అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ సమర్పించిన ప్రతిపాదనల్లో 23 అంశాలకు శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు సీఎం కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది.
► ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. ఐదెకరాలు/అంతకు మించిన విస్తీర్ణం గల ప్రైవేటు హౌసింగ్ ప్రాజెక్టుల్లో బలహీనవర్గాలు (ఈడబ్ల్యూఎస్), తక్కువ ఆదాయం గల సమూహాల(ఎల్‌ఐజీ)కు 25 శాతం ఇళ్లు లేదా భవనంలో 10 శాతం ప్రాంతాన్ని కేటాయించడం తప్పనిసరి. తాజాగా దీనిని ప్రభుత్వం రద్దు చేసింది. దానికి బదులుగా ఐదెకరాల లేఅవుట్ అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 30 లక్షలు, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ. 16 లక్షలు అదనపు ఫీజుగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ఆదాయాన్ని పేదల గృహ నిర్మాణానికి వినియోగిస్తారు.
► ఆకాశ హర్మ్యాల నిర్మాణాన్ని ప్రోత్సహించేందుకు ‘సిటీ లెవల్ ఇంపాక్ట్ ఫీజు’ను భారీగా తగ్గించారు. ప్రస్తుతం నాలుగు స్లాబుల్లో దీనిని వసూలు చేస్తుండగా.. రెండు స్లాబులకు కుదించారు. 17 అంతస్తుల వరకు ఒక స్లాబ్, ఆపై మరో స్లాబ్‌ను అమలు చేస్తారు. చదరపు మీటర్‌కు జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ. 500 నుంచి రూ. 1,500 వరకు, హెచ్‌ఎండీఏ పరిధిలో రూ. 175 నుంచి రూ. 500 వరకు ఫీజులు విధించనున్నారు. = సైబరాబాద్ అభివృద్ధి ప్రాంతం(సీడీఏ) పరిధిలో చదరపు మీటర్‌కు రూ.100 చొప్పున వసూలు చేస్తున్న వాల్యూ ఎడిషన్ చార్జీలను జీహెచ్‌ఎంసీ పరిధి మేరకు రద్దు చేశారు.
► రాష్ట్రవ్యాప్తంగా వేగంగా భవన నిర్మాణ అనుమతులి చ్చేందుకు ఆన్‌లైన్ విధానం అమలు చేస్తారు. జీహెచ్‌ఎంసీతో పాటు డీటీసీపీ పరిధిలోనూ అమలు చేస్తారు.
► హౌసింగ్ ప్రాజెక్టు నిర్మిత స్థలంలో కనీస సౌకర్యాలకు 3 శాతం కేటాయించడానికి బదులుగా.. ఇకపై కనీ సం 3శాతం లేదా 50,000చ.అ., రెండింట్లో ఏది తక్కువ అయితే అది కేటాయిస్తే సరిపోనుంది.
► ఆకాశ హర్మ్యాలు ఏడేళ్లలో, గ్రూపు హౌసింగ్ ప్రాజెక్టులు ఐదేళ్ల్లలో పూర్తి చేయాలన్న నిబంధనలు మారతా యి. ఇకపై ఏ భవనమైనా ఆరేళ్లలో పూర్తి చేయాలి.
► ఇకపై 15 రోజుల్లో ఆక్యూపెన్సీ సర్టిఫికెట్ ఇస్తారు. లేకుంటే బాధ్యులైన అధికారులపై రోజుకు రూ.500 చొప్పున జరిమానా విధిస్తారు.
► భవన నిర్మాణ సమయంలో ఖాళీ స్థలం పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్)ను తొలగించారు.
► గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో అన్ని రోడ్లు, ఖాళీ స్థలాలను స్థానికపురపాలక సంస్థకు గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయించాలనే నిబంధనను సడలించనున్నారు. కేవలం 10 శాతం ఖాళీ స్థలం గిఫ్టు రిజిస్ట్రేషన్ చేయిస్తే సరిపోనుంది. అంతర్గత రోడ్లు/డ్రైవ్‌వేలకు రిజిస్ట్రేషన్ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు.
► గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టుల్లో 40 అడుగుల అంతర్గత రోడ్లకు స్థలం కేటాయిస్తే... సెట్‌బ్యాక్ సడలింపులు/అదనపు అంతస్తులకు అనుమతులు/ ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్(టీడీఆర్) సౌకర్యాన్ని కల్పిస్తారు.
► కొత్త సేకరణ చట్టం-2013 అమల్లోకి వచ్చాక రోడ్ల విస్తరణ కోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించడం పురపాలికలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పరిహారానికి బదులు స్థల యజమానులకు టీడీఆర్/సెట్‌బ్యాక్ సడలింపులు/ అదనపు అంతస్తుల నిర్మాణానికి అవకాశం కల్పిస్తారు.
► రక్షణ, రైల్వే స్థలాలకు 500 మీటర్ల పరిధిలో ఉన్న చోట్ల నిర్మాణాలకు ప్రస్తుతం రక్షణ, రైల్వేశాఖల నుంచి నిరంభ్యంతర పత్రం తప్పనిసరి. పలు జాగ్రత్తలు తీసుకుని ఈ నిబంధనను సడలించనున్నారు.
► ఓఆర్‌ఆర్ గ్రోత్ కారిడార్ పరిధిలో వసూలు చేస్తున్న స్పెషల్ ఇంపాక్ట్ ఫీజును 50 శాతానికి తగ్గిస్తారు.
► ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అగ్నిమాపక శాఖలు అనుమతిస్తే మల్టీప్లెక్స్‌లపై అదనపు అంతస్తులకు అనుమతిస్తారు.
► మూసీ నది సరిహద్దుల వెంట బఫర్ స్ట్రిప్‌ను 50 మీటర్లకు కుదించనున్నారు.
► 200 చదరపు మీటర్లలోపు గల చిన్న భవనాల్లో ఖాళీ అంతస్తు(స్టిల్ట్ ఫ్లోర్)ను పార్కింగ్ అవసరాల కోసం ఇకపై అనుమతించనున్నారు.
► పాతబస్తీ, రద్దీ ప్రాంతాల్లో ప్లాట్లను కలిపేసుకోడానికి అనుమతిస్తారు. ఏకీకరణకు ముందు ఒక్కో ప్లాటు విస్తీర్ణం గరిష్టంగా 100 చదరపు మీటర్లు, తర్వాత 300 చదరపు మీటర్లలోపు ఉండాలి.
►18 మీటర్లు, ఆపై ఎత్తు గల ఆకాశ హర్మ్యాల చుట్టూ కనీసం 9 మీటర్ల సెట్‌బ్యాక్ ఉంటేనే అందులో 2 మీటర్ల స్థలాన్ని గ్రీన్‌స్ట్రిప్ (పచ్చదనం) కోసం వినియోగించాలి. సెట్‌బ్యాక్ తక్కువ ఉంటే అవసరం లేదు.
► 1,000 చదరపు మీటర్ల స్థలంలో సైతం ఇకపై ‘యూ’ ఆకార భవనాలను అనుమతిస్తారు.
► జల వనరుల సరిహద్దుల్లోని 30 మీటర్ల బఫర్ స్ట్రిప్‌లో 12 అడుగుల నడక/సైక్లింగ్ ట్రాక్‌ను నిర్మించేందుకు అనుమతించనున్నారు. బఫర్ స్ట్రిప్ కబ్జాకు గురికాకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
► అక్రమ నిర్మాణాలపై కట్టుదిట్టమైన నియంత్రణ కోసం ఇకపై 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణం/10 మీటర్ల ఎత్తు గల భవనాలపై నియంత్రణ బాధ్యతల నుంచి గ్రామ పంచాయతీలను తప్పించి హెచ్‌ఎండీఏకు అధికారాలను కట్టబెట్టనున్నారు.
అధ్యయనానికి నిపుణుల కమిటీ
స్థిరాస్తి వ్యాపార సంఘాలు చేసిన ఇతర విజ్ఞప్తులపై అధ్యయనం జరపాలని ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కమిషనర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీని ఆదేశించింది. ఈ కమిటీలో హెచ్‌ఎండీఏ కమిషనర్, వాటర్ బోర్డు ఎండీ, పురపాలక శాఖ కమిషనర్, హైదరాబాద్/సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఉంటారు. హెచ్‌ఎండీఏ/కుడాల నుంచి నేరుగా అనుమతులు, ప్రధాన రహదారులు/కూడళ్ల వద్ద మల్టీప్లెక్స్‌లకు అనుమతులు, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో భవనాల ఎత్తుపై ఆంక్షల సడలింపు తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది.