పన్ను ఎగవేత కేసులో సానియా హాజరవుతుందా?
హైదరాబాద్:
ఆదాయ పన్ను ఎగవేత కేసులో సమన్లు అందుకున్న సానియా మీర్జా ఫిబ్రవరి16వ తేదీన సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ ఎదుట హాజరు కాకపోవచ్చు. ప్రస్తుతం ఆమె ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లనున్నారు. దీంతో ఆమె తరఫు ప్రతినిధి కమిషనర్ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఈ విషయంలో సానియా సంబంధీకులు అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమె కానీ, ఆమె తరఫు వారు కానీ సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ ఎదుట హాజరుకాకపోయినట్లయితే సానియాపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం 2014లో సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమిస్తూ రూ.కోటి అందజేసింది. ఇందుకు సంబంధించి ఆమె సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదంటూ అధికారులు తాఖీదులు అందజేశారు. నిబంధనల ప్రకారం 14.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంది. ఈ పన్ను కట్టనందుకు గాను ప్రస్తుతం జరిమానా కూడా చెల్లించుకోవాల్సి ఉందని ఆదాయ పన్ను శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.