పాత దరఖాస్తుల సం‘గతేంటి’?
ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ జీవోలో స్పష్టత కరువు
- యూఎల్సీలో ఎనిమిదేళ్లుగా మూలుగుతున్న 5వేల దరఖాస్తులు
- రూ.300 కోట్లు చెల్లించినా భూమి కేటాయింపుల్లేక లబ్ధిదారుల గగ్గోలు
సాక్షి, హైదరాబాద్: ఇతరుల అధీనంలో ఉన్న పట్టణ భూ పరిమితి చట్టం (యూఎల్సీ) ఖాళీ స్థలాలను క్రమబద్ధీకరించేందుకు రెవెన్యూ శాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టత లోపించింది. మిగులు భూములను డిక్లరెంట్ ద్వారా కొనుగోలు చేసిన ఎంతోమంది.. ప్రభుత్వం జారీ చేసిన పలు జీవోలకు అనుగుణంగా తమ స్థలాలను క్రమబద్ధీకరించాలని యూఎల్సీ ప్రత్యేక అధికారికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన 166, 455, 456, 747.. తదితర ఉత్తర్వుల మేరకు గత ఎనిమిదేళ్లుగా సుమారు ఐదువేలకు పైగా దరఖాస్తులు యూఎల్సీ కార్యాలయంలో మూలన పడి ఉన్నాయి.
ఆయా దరఖాస్తులతో పాటు భూముల కేటాయింపు/క్రమబద్ధీకరణ నిమిత్తం భూమి యజమానులు సుమారు రూ.300 కోట్లు చెల్లించినప్పటికీ, ఇంతవరకు వారికి భూమి క్రమబద్ధీకరణ/కేటాయింపు జరగలేదు. అంతేకాదు.. ఇన్నేళ్లుగా తమ దరఖాస్తులను ఆమోదించడం గానీ లేదా తిరస్కరించడం గానీ చేయకపోవడం, తిరస్కరించిన కొన్ని దరఖాస్తులకు సంబంధించి సొమ్మును మాత్రం వెనక్కి తిరిగి చెల్లించకపోవడంతో తమకు ఏంచేయాలో దిక్కుతోచడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. పాత దరఖాస్తుల పరిస్థితి ఇలా ఉంటే.. యూఎల్సీ చట్టం కింద ఉన్న ఖాళీస్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని తాజాగా ప్రభుత్వం జీవో జారీ చేయడం మరింత విడ్డూరంగా ఉందంటున్నారు. సర్కారు జారీ చేసిన జీవోలో పాత దరఖాస్తులను ఏవిధంగా పరిష్కరించాలో స్పష్టత ఇవ్వకపోవడం ఉన్నతాధికారుల బాధ్యతా రాహిత్యాన్ని చెప్పకనే చెబుతోందని ఆరోపిస్తున్నారు.
మురికివాడల్లో లింక్ డాక్యుమెంట్లా..!
యూఎల్సీ ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ/ కేటాయింపు కోరేవారు తప్పనిసరిగా దరఖాస్తుతో పాటు డిక్లరెంట్ నుంచి పొందిన లింక్ డాక్యుమెంట్‌ను జతపరిచాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మధ్య, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఉండే ప్రాంతాల్లో కొంతమేరకు భూమిని కొనుక్కున్న వారి వద్ద లింక్ డాక్యుమెంట్లు ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. మురికివాడల్లో చిన్నచిన్న గుడిసెలు వేసుకొని ఉంటున్న వారి వద్ద లింక్ డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండే అవకాశం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోని ఉన్నతాధికారులు.. మురికివాడల్లో నివసించే వారికి బేసిక్ వాల్యూలో 10 శాతం చెల్లిస్తే ఆయా స్థలాలను క్రమబద్ధీకరిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని కిందిస్థాయి అధికారులు అంటున్నారు.
ఒకవైపు తక్కువ ధరకు స్థలాలను క్రమబద్ధీకరించుకోమని చెబుతూనే, మరోవైపు వారివద్ద లేని లింక్ డాక్యుమెంట్లను తప్పనిసరిగా సమర్పించాలని సర్కారు మెలికపెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, యూఎల్సీ ఖాళీస్థలాలను మాత్రమే క్రమబద్ధీకరించాలని సర్కారు ఉత్తర్వుల్లో పేర్కొందని, యూఎల్సీ స్థలాల్లో ఇప్పటికే నిర్మాణాలు ఉంటే క్రమబద్ధీకరించాలో, లేదో అర్థం కావడం లేదని మండల తహసీల్దార్లు, ఆర్డీవోలు తల పట్టుకుంటున్నారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఏదైనా ఉత్తర్వులు జారీ చేసేపుడు క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకొంటే ఎక్కువ మందికి మేలు జరుగుతుందని, లేకుంటే ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం నెరవేరదంటున్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం పరిశీలించి ఆయా అంశాలపై కిందిస్థాయి అధికారులకు స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.