ట్రంప్, పుతిన్ తొలి భేటీలో ఏం చర్చిస్తారు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో జూలైలో భేటీ కానున్నారు. హాంబర్గ్ లో జరగనున్న జీ20 దేశాల సదస్సులో భాగంగా వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై ప్రధాన సమస్యలపై చర్చిస్తారని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. గురువారం ట్రంప్ ను కలిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రష్యా అధినేత పుతిన్ తో ట్రంప్ తొలి భేటీ ఇదే కానుంది. సిరియాలో ఉగ్రవాదంపై రష్యాతో పాటు తమ సేనల సంయుక్త పోరుకు స్వస్తి చెబుతున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు.
ఇటీవల రష్యా అధినేతకు ట్రంప్ కాల్ చేసి ప్రమాదకరమైన ఉత్తరకొరియా అంశంపై మాట్లాడారు. అణ్వస్త్ర పరీక్షలకు దూరంగా ఉండాలన్న అమెరికా హెచ్చరికలను ఏమాత్రం లేక్కచేయని ఉత్తరకొరియా అధినేత కిమ జోంగ్ ఉన్.. తమ క్షిపణి పరీక్షలను అవసరమైతే రెట్టింపుచేస్తామని హెచ్చరించిన విషయంపై చర్చించారు. అమెరికా ఆంక్షలకు భయపడి మిస్సైళ్లు, అణుపరీక్షలపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని కిమ్ స్పష్టంచేసిన నేపథ్యంలో రష్యా సాయంతో ఉత్తరకొరియాను ఢీకొట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. ది క్రెమ్లిన్ వెబ్ సైట్ మాత్రం పుతిన్, ట్రంప్ తమ వ్యక్తిగత పనులకే అగ్రతాంబూలం ఇవ్వనున్నట్లు పేర్కొంది. మరోవైపు ట్రంప్ ఆ దేశంలోని అత్యున్నత దర్యాప్తు విభాగమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్ జేమ్స్ కొమెను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.