కుండపోత వాన..56 మంది మృతి
బీజింగ్: చైనాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. గత వారం నుంచి దక్షిణ చైనాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు 56 మంది మృతి చెందగా 22 మంది జాడ లేకుండా పోయారు. ఈ వర్షాలతో విద్యత్ నిలిచిపోయి నగరాలన్ని అంధకారం అయ్యాయి. ఆహారం కోసం ప్రజలు అల్లాడుతున్నారు.
దాదాపు 11 ప్రాంతాల్లో జూన్ 29 నుంచి కురుస్తున్న వానలకు 27 వేల ఇళ్లు నేలమట్టం కాగా 37 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. యాంగ్జి నది మునుపెన్నడూ లేనంత వరదలతో పరవళ్లు తొక్కుతోంది. దాదాపు 3.72 బిలియన్ డాలర్ల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వానలు కాస్త తగ్గుముఖం పట్టటంతో సహాయ, రక్షణ చర్యలను ప్రారంభించింది.