'ఆమె నాకు తెలుసు'
వాషింగ్టన్: మాలి ఉగ్రవాద దాడిలో ఇండియన్ అమెరికన్ స్వచ్ఛంద కార్యకర్త అనిత దాతర్ మృతి పట్ల అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తనకు వ్యక్తిగతంగా తెలుసునని, ఆమె మృతి బాధాకరమని పేర్కొన్నారు. సమాజ సేవే జీవిత సర్వస్వంగా మార్చుకున్న అనితా దాతర్ (41) స్వచ్ఛంద కార్యకర్తగా మాలిలో పనిచేస్తూ.. ఉగ్రవాద దాడిలో బలయ్యారు. ఉగ్రవాదులు గత శుక్రవారం మాలిలోని ఓ హోటల్‌లోకి చొరబడి.. 27 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. మాలి దాడిలో మరణించిన ఏకైక అమెరికన్, భారత సంతతి మహిళ ఆమెనే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి రేసులో ముందున్న కిల్లరీ క్లింటన్ అనితా దాతర్ మృతి పట్ల స్పందించారు.
'ఆమె నాకు తెలుసు. ఏడేళ్ల కొడుకు తల్లిగా, నా విధాన సలహాదారుల్లో ఒకరైన డేవిడ్ గార్టన్ మాజీ భార్యగా ఆమెతో నాకు పరిచయముంది. ఈ విషాద సమయంలో దాతర్, గార్డెన్ కుటుంబాలకు మద్దతుగా నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అనిత, డేవిడ్ ఏడేళ్ల కొడుకు గురించి నేను ఆలోచిస్తున్నాను. రానున్న రోజులను అతను ఎలా ఎదుర్కొంటాడో? ఎన్ని కష్టాలు పడతాడో? అని ఆలోచిస్తేనే ఎంతో బాధ కలుగుతున్నది' అని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులకు తెగబడుతున్న ఐఎస్ఎఐస్, ఆల్‌ఖైదాపై వెంటనే అమెరికా యుద్ధాని ప్రారంభించి.. విజయం సాధించాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు.