మొజాంబిక్ నుంచి పప్పుధాన్యాలు | Indian prime minister kicks off 4-nation African visit | Sakshi
Sakshi News home page

మొజాంబిక్ నుంచి పప్పుధాన్యాలు

Published Fri, Jul 8 2016 3:36 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

మొజాంబిక్ నుంచి పప్పుధాన్యాలు - Sakshi

మొజాంబిక్ నుంచి పప్పుధాన్యాలు

ప్రధాని మోదీ పర్యటనలో ఒప్పందం
* ఉగ్రవాదం ప్రపంచానికి పెనుముప్పన్న నరేంద్ర మోదీ
* ఆఫ్రికా దేశం మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్‌తో చర్చలు
* పప్పు కొనుగోళ్లు సహా 3 ఒప్పందాలపై సంతకాలు
* మొజాంబిక్‌కు నిత్యావసర ఔషధాల విరాళం ప్రకటన

మపుటో (మొజాంబిక్): వివిధ దేశాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచానికి ఉగ్రవాదం అతి ప్రమాదకరమైన ముప్పు అని.. అది భారత్, మొజాంబిక్ దేశాలపై ఒకే రకంగా ప్రభావం చూపుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మొజాంబిక్ చేరుకున్న ప్రధాని రాజధాని మపుటోలో ఆ దేశాధ్యక్షుడు ఫిలిప్ న్యూసితో సమావేశమై విస్తృత స్థాయి చర్చలు జరిపారు.

భారత్, మొజాంబిక్‌లు భద్రత, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, ఆహార భద్రతపై సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. ఈ సందర్భంగా ఇరు దేశాలూ మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ప్రధానంగా.. భారత్‌లో పప్పు ధాన్యాల కొరత తలెత్తుతున్న పరిస్థితుల్లో మొజాంబిక్ నుంచి పప్పు ధాన్యాలు కొనుగోలు చేసేందుకు దీర్ఘ కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అనంతరం న్యూసీతో కలిసి మీడియాతో మాట్లాడారు. మొజాంబిక్‌కు భారత్ విశ్వసనీయమైన మిత్రదేశమని, ఆధారపడదగ్గ భాగస్వామి అని మోదీ పేర్కొన్నారు.

ఈ దేశ ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయటంలో భాగంగా.. ఎయిడ్స్‌కు చికిత్స చేసేందుకు వినియోగించే ఔషధాలు సహా నిత్యావసర ఔషధాలను భారత్ విరాళంగా ఇస్తుందని ప్రకటించారు. అభివృద్ధి, పురోగతి బాటలో మొజాంబిక్‌తో పాటు ప్రతి అడుగులోనూ కలిసి నడుస్తుందంటూ.. ఆ దేశ భద్రతా బలగాల సామర్థ్యాలను పెంపొందించేందుకు భారత్ సాయపడుతుందని చెప్పారు.  
 
వ్యవసాయాభివృద్ధికి భారత్ తోడ్పాటు...  
భారత్, మొజాంబిక్ దేశాలు హిందూ మహాసముద్రం ద్వారా అనుసంధానితమై ఉన్నాయంటూ.. సముద్ర భద్రత సహా కొత్తగా పుట్టుకొస్తున్న భద్రతా సవాళ్ల గురించి మోదీ ప్రస్తావించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతి భీకరమైన ముప్పు ఉగ్రవాదమని అధ్యక్షుడు న్యూసీ, తాను అభిప్రాయపడ్డామని.. ఈ ప్రమాదానికి భారత్, మొజాంబిక్ దేశాలు అతీతం కాదని మోదీ చెప్పారు. ‘‘ఉగ్రవాద వ్యవస్థలకు ఇతర నేరాలకు సంబంధముంది. ఈ వ్యవస్థలు, ఈ మహమ్మారులపై పోరాటం చేయటంలో భాగంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణకు మేం ఒప్పందం చేసుకున్నాం’’ అని తెలిపారు.

వ్యవసాయాభివృద్ధికి తాను ప్రాధాన్యం ఇస్తున్నట్లు న్యూసీ చెప్పారని.. మొజాంబిక్‌లో వ్యవసాయ మౌలికవసతులు, ఉత్పాదకతను ఎలా మెరుగుపరచాలనే అంశంపై ఇరు దేశాల నిపుణులు చర్చలు జరిపారని వివరించారు. మొజాంబిక్ నుంచి పప్పుధాన్యాల కొనుగోలుకు భారత్ కట్టుబడి ఉందని.. ఇది ఈ దేశంలో వాణిజ్య వ్యవసాయంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు, వ్యవసాయ ఉపాధి పెరగటానికి, రైతుల ఆదాయాలు పెరగటానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. నిజానికి ఆఫ్రికాలో భారతీయ పెట్టుబడుల్లో దాదాపు నాలుగో వంతు మొజాంబిక్‌లోనే ఉన్నాయన్నారు. న్యూసీ గత ఏడాది ఆసియా పర్యటనలో ముందుగా భారతదేశాన్ని సందర్శించినందున.. తాను కూడా ఇప్పుడు ఆఫ్రికా పర్యటనలో ముందుగా మొజాంబిక్‌కు వచ్చానని మోదీ పేర్కొన్నారు.

పోర్చుగీస్ జాతీయ భాషగా ఉన్న మొజాంబిక్‌లో పెట్టుబడులు పెట్టాలనకునే భారతీయ వ్యాపారవేత్తల కోసం భారత దౌత్యకార్యాలయం ఇంగ్లిష్‌లో ముద్రించిన మార్గదర్శకాల పుస్తకాన్ని.. మోదీ ఈ సందర్భంగా న్యూసీకి బహూకరించారు. గత 34 ఏళ్లలో మొజాంబిక్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోదీ. ఈ పర్యటనలో మొజాంబిక్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు వెరోనికా మకామోతో కూడా మోదీ భేటీ అయ్యారు.  మొజాంబిక్‌లోని 250 మంది పార్లమెంటు సభ్యుల్లో 93 మంది మహిళలే కావటం పట్ల మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇరు దేశాల మధ్య యువ పార్లమెంటేరియన్ల బృందాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు  
 
గల్ఫ్ నేతలకు మోదీ శుభాకాంక్షలు...
ఈద్-అల్-ఫితర్‌ను పురస్కరించుకుని గల్ఫ్ దేశాల నేతలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. అబుదాబి యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని యూఏఈ అధికారిక వార్తాసంస్థ వామ్ తెలిపింది. అలాగే కతార్ ఎమిర్ షస్త్రక్ తామిమ్ బిన్ హమద్ అల్-థానితోనూ మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement