మళ్లీ గర్జించిన ఉత్తర కొరియా.. భారీగా ఆయుధ ప్రదర్శన
అవసరమైతే అమెరికా యుద్ధ నౌకలను సైతం పేల్చేస్తామని హెచ్చరించిన ఉత్తర కొరియా.. తమ వద్ద ఏయే ఆయుధాలు ఉన్నాయో చూసుకోవాలంటూ మంగళవారం నాడు ఓ భారీ ప్రదర్శన నిర్వహించింది. తమ సైన్యం ఏర్పడి 85 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర కొరియా ఈ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వార్తా సంస్థ యోన్‌హాప్ తెలిపింది. తూర్పు తీరంలోని వోన్‌సాన్ నగరంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆయుధ ప్రదర్శన నిర్వహించినట్లు దక్షిణ కొరియా ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ యోన్‌హాప్ తెలియజేసింది.
ఇంతకుముందు కూడా దేశ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకుని ఉత్తరకొరియా తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రదర్శించింది. అప్పట్లో జలాంతర్గాముల నుంచి ప్రయోగించగలిగే ఖండాంతర క్షిపణులను (ఎస్ఎల్‌బీఎం) కూడా ప్రదర్శించారు. అవకాశం దక్కినప్పుడల్లా తమవద్ద ఎంత భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్నాయో చూసుకోవాలంటూ ప్రపంచ దేశాలకు ప్రదర్శించి చూపించడం ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌కు అలవాటు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఆయుధాలను ప్రదర్శించారని అంటున్నారు.